నళిని (ఫైల్ ఫోటో)
సాక్షి, తమిళనాడు : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె ఈ చర్యకు పాల్పడటానికి కారణం తెలియరాలేదు. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలైన తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్ నారాయణన్ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment