Perarivalan
-
క్షమాభిక్షలోనూ ఇన్ని రాజకీయాలా?
రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి పేరరివాళన్ విడుదలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు భారత శిక్షాస్మృతిని అర్థం చేసుకోవడం లేదు. ఈ దేశంలో ఒక నేర ఘటన రాజకీయ రంగును పులుముకున్నప్పుడు దానిపై రాజకీయ అభిప్రాయాలే తప్ప, నేర న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉండదనేది స్పష్టం. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా శాసించబోవడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. దేశ శాసనాలకు అనుగుణంగా కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేర్చకపోవడం వల్లే న్యాయస్థానం పేరరివాళన్ కేసును ఈ విధంగా పరిష్కరించాల్సి వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న అధికారాలను ఉపయోగించుకున్న సుప్రీంకోర్టు, రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏజీ పేరరివాళన్ విడు దలకు ఆదేశించింది. సుప్రీంకోర్టు చర్య మిశ్రమ స్పందనలకు తావి చ్చింది. ఈ తీర్పు ఉగ్రవాదానికీ, డబ్బు బలానికీ విజయమని తమిళ నాడు కాంగ్రెస్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ చిన్నపాటి నిరసన లను పక్కన బెడదాం. సుప్రీంకోర్టు తీర్పును మాత్రం సమాజంలోని వివిధ వర్గాలు స్వాగతించాయి. రెండు దశాబ్దాలకు పైగా ఈ కేసు కొనసాగిన క్రమానికీ, వివిధ దశల్లో అది ప్రేరేపించిన ఘర్షణకూ ముగింపు లభిం చినట్లయిందని వీరు భావిస్తున్నారు. పైగా రాజ్ భవన్‌కూ, సచివాల యానికీ మధ్య నడిచిన పోరుకు కూడా ఈ తీర్పు ముగింపు పలికింది. రాజీవ్ గాంధీ హత్యానంతరం, ఆ హత్యకు కుట్రపన్నారన్న ఆరో పణపై నిర్బంధించిన నిందితులను టాడా చట్టం (తీవ్రవాద, విధ్వం సక చర్యల నిరోధక చట్టం) 1987 కింద విచారించారు. ఐపీసీ కింద నేర విచారణ పద్ధతికి భిన్నంగా ఎస్పీ స్థాయి అధికారి ముందు నిందితులు నేరం ఒప్పుకొంటే సరిపోతుందని ఈ చట్టం అనుమతిం చింది. రాజీవ్ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణకు గురైన 26 మంది నిందితులంద రికీ టాడా స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని మాత్రమే టాడా నిబంధనలు చెబుతున్నాయి కానీ టాడా కింద నేరాలను స్పష్టంగా వెల్లడించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే ఉగ్రవాద చర్యలకు సంబం ధించి అంతవరకు ఏ కేసునూ విచారించి ఉండలేదని సుప్రీంకోర్టు పేర్కొంటూ రాజీవ్ హత్యకేసులో 22 మంది నిందితులకు పడ్డ ఉరి శిక్షలను సవరించింది. నళిని, పేరరివాళన్, మురుగన్, శాంతన్ల ఉరిశిక్షను మాత్రమే 1999లో ఖరారు చేసింది. దాంతో ఆ నలుగురూ ఆర్టికల్ 161 కింద తమకు క్షమాభిక్ష పెట్టాలని తమిళనాడు గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. నాటి రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫాతిమా బీవీ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని కేబినెట్ సలహా తీసుకో కుండానే వారి పిటిషన్‌ను తోసిపుచ్చారు. మంత్రిమండలి సలహా తీసు కోకుండా క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించలేరని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో బంతి తమిళనాడు ప్రభుత్వానికి తిరిగొచ్చింది. అప్పటికే ఎల్టీటీఈ పట్ల కరుణానిధి ప్రభుత్వం మెత్తటి వైఖరితో ఉందని విమర్శలకు గురవుతోంది. దాంతో ఈ నలుగురిలో నళినికి మాత్రమే ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, పేరరి వాళన్ సహా మిగతా ముగ్గురి అప్పీలును తోసిపుచ్చవచ్చనీ తమిళ నాడు ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌కు సలహా ఇచ్చింది. ఉరిశిక్షకు గురైనవారికి తన అసాధారణ అధికారాలను ఉపయో గించి క్షమాభిక్ష పెట్టడంలో గవర్నర్‌కు కూడా పరిమితులున్నాయి. 1978లో ఐపీసీకి పార్లమెంట్ సవరణ చేసి సెక్షన్ 433ఏ ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం ఖైదీలు 14 సంవత్సరాల కనీస శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుంటేగానీ వారిని విడుదల చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 72 కింద తమకు క్షమాభిక్ష పెట్టాలని పేరరివాళన్, మరో ఇద్దరూ రాష్ట్రపతిని అభ్యర్థించారు. అయితే ఇద్దరు భారత రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలామ్ తమ పదవీకాలంలో వీరికి క్షమాభిక్ష ఆదేశాలను పాస్ చేయలేదు. కానీ 11 సంవత్సరాల జాప్యం తర్వాత మూడో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వీరి పిటిషన్లను తిరస్కరిం చారు. దీంతో తమిళనాడు శాననసభ అసాధారణ చర్య చేపట్టింది. రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని 2011లో తీర్మానం చేసింది. తర్వాత వారికి ఉరిశిక్ష అమలు చేసేనాటికి వీరు మద్రాస్ హైకోర్టు తలుపులు తట్టారు. తమపై ఉరిశిక్ష వారెంటును సవాలు చేశారు. ఈ కేసులు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. నిర్దిష్ట కాలంలో వీరి క్షమా భిక్షపై నిర్ణయం తీసుకోకుండా భారత రాష్ట్రపతులు జాప్యం చేయడం సరైంది కాదనీ, పైగా నళిని మినహా ఉరిశిక్ష ఖరారైన ముగ్గురిపై 11 ఏళ్లుగా ఉరితాడు వేలాడుతూనే ఉందనీ చెబుతూ సుప్రీంకోర్టు వీరి ఉరి శిక్షలను రద్దుచేసి యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈలోగా, 2014 ఫిబ్రవరి 19న తమిళనాడు కేబినెట్ ఈ ఏడు గులు ఖైదీలను విడుదల చేయాలంటూ గవర్నర్‌కు సూచించింది. కేంద్ర ప్రభుత్వం తర్వాత ఒక పిటిషన్ వేసి ఈ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యేలా చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్, యావజ్జీవం అంటే ఖైదీ జీవితకాలం పొడవునా నిర్బంధంలోనే ఉండా లని తీర్పు చెప్పింది. శిక్షాకాలాన్ని తగ్గించాల్సిందిగా సీఆర్పీసీ సెక్షన్ 432 కింద దరఖాస్తు చేసుకోవచ్చని వీలు కల్పించింది. ఉరిశిక్షలు పడిన వారందరికీ ఈ తీర్పు వర్తిస్తుందని చెప్పింది. దాంతో ఈ ఏడుగురు ఖైదీలు మరోసారి తమ శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ తమిళనాడు గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. వారికి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సలహా ఇచ్చింది. గవర్నర్ స్పందించకపోవడంతో నళిని కోర్టుకు వెళ్లింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఏ ఆదేశమూ ఇవ్వలేదు. పైగా గవర్నర్ తన రాజ్యాంగ బద్ధ విధులను నిర్వర్తించనందుకు ఎవరూ ప్రశ్నించజాలరనీ, తాను కోర్టులకు జవాబుదారీ కాదనీ వ్యాఖ్యానించింది, తర్వాత పేరరివాళన్ తల్లి అర్పుతమ్మాళ్ తన కుమారుడికి పెరోల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన ప్పుడు మాత్రం గవర్నర్ జాప్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ రాష్ట్ర కేబినెట్ ఇచ్చిన సలహాను గవర్నర్ దీర్ఘకాలం తొక్కిపెట్టి ఉంచలేరని వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్ 9న ఈ ఏడుగురు ఖైదీల క్షమాభిక్ష పిటిషన్‌పై తమిళనాడు అసెంబ్లీ మళ్లీ తీర్మానం చేసింది. కానీ దాని మీద కూడా గవర్నర్ ఏ చర్యా తీసుకోలేదు. కోర్టు ఒత్తిడి చేయడంతో ఈ విష యాన్ని రాష్ట్రపతి నిర్ణయించాలని గవర్నర్ ప్రకటించారు. ఈ వ్యవ హారం తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లింది. అన్ని పరిస్థితులనూ ఆకళింపు చేసుకున్న తర్వాత మాత్రమే ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు పేరరి వాళన్ విడుదలకు ఆదేశించింది. భారత శిక్షాస్మృతిని నిస్సందేహంగా సంస్కరించాలనీ, అది నిర్బంధపూరితంగా ఉండరాదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, ఒక అనాగరిక నేరానికి అనాగరిక శిక్ష పరిష్కారం కానే కాదని అభిప్రాయ పడింది. పేరరివాళన్ విడుదలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు భారత శిక్షాçస్మృతిని అర్థం చేసుకోవడం లేదు. పైగా తన విడుద లకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు వెనుక కారణాన్ని వీరు గ్రహించడం లేదు. అంతిమంగా ఈ దేశంలో ఒక నేర ఘటన రాజకీయ రంగులు పులుముకున్నప్పుడు దానిపై రాజకీయ అభిప్రాయాలే తప్ప, నేర న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉండదనేది స్పష్టం. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా శాసించబోవడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. ఇది భారత రాజ్యాంగ సంవిధానాన్నే మలినపరుస్తుంది. దేశ శాసనాలకు అనుగుణంగా కాకుండా, భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజీవ్ హత్య కేసులో దోషుల క్షమాభిక్షనూ, తదనంతర పరిణామాలనూ కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశిం చడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వాల నిర్ణయ రాహిత్యం లేక తమ బాధ్యతను నెరవేర్చకపోవడం వల్లే న్యాయస్థానం పేరరివాళన్ కేసును ఈ విధంగా పరిష్కరించవలసి వచ్చింది. ఇప్పుడు మిగిలిన ఆరుగురు ఖైదీలకూ ఇదే రకమైన ఉపశమనం లభిస్తుందా లేక వీరి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికీ, తమిళనాడు గవర్నర్‌కూ మధ్య మొరటు ఘర్షణ మళ్లీ మొదలవుతుందా అనేది ప్రశ్న. ఈ విషయంలో విజ్ఞత రాజ్యమేలుతుందనీ, గవర్నర్ కార్యాల యాన్ని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువును చేయబోరనీ ఆశిద్దాం. వ్యాసకర్త: కె. చంద్రు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
అన్నిరకాలా అసాధారణమే!
పరిస్థితులు అసాధారణమైతే, నిర్ణయాలూ అసాధారణంగానే ఉంటాయి. రాజ్యాంగంతో సంక్రమిం చిన అసాధారణ అధికారాలను సుప్రీమ్ కోర్టు బుధవారం వినియోగించుకున్న వైనం అలాంటిదే. ఆ అధికారాల కిందే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన పేరరివాళన్‌ను తక్షణం విడుదల చేస్తూ సుప్రీమ్ ఉత్తర్వులిచ్చింది.19 ఏళ్ళ వయసులో అరెస్టయి, 31 ఏళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినా సరే క్షమాభిక్షపై గవర్నర్ నిర్ణయం రాక, ఒక జీవితకాల నిరీక్షణలో ఉన్న వ్యక్తికి న్యాయం కోసం చివరకు కోర్టు కదలాల్సి వచ్చింది. సదరు వ్యక్తి తాలూకు ‘శిక్ష పూర్తయినట్టు భావించా’లంటూ పేర్కొనాల్సి వచ్చింది. కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య అధికార పంపిణీ – కరవైన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి లాంటి చర్చలు దేశంలో ఎక్కువైన వేళ... మంత్రిమండలి సలహా మేరకు అధికారాలను వినియోగించడమే రాష్ట్రపతి, గవర్నర్ల రాజ్యాంగ విహిత బాధ్యత అని కోర్టు చెప్పకనే చెప్పింది. నేరస్థుడికి క్షమాభిక్ష, ముందస్తు విడుదల లాంటివి రాష్ట్ర జాబితాలోవి గనక ప్రజా ప్రభుత్వాల అభీష్టమే ఆ అంశాల్లో సర్వోన్నతమని తేల్చింది. రిటైర్డ్ తమిళ ఉపాధ్యాయుడి కుమారుడైన 50 ఏళ్ళ పేరరివాళన్ అలియాస్ అరివు పక్షాన అతని తల్లి, పలువురు వకీళ్ళు, స్నేహితులు జరిపిన న్యాయపోరాటం చివరకు ఇలా పరిణమించింది. రాజీవ్‌ను చంపిన మానవబాంబు పెట్టుకున్న బాంబుల బెల్టుకు కావాల్సిన బ్యాటరీలు సమకూర్చి నట్టు అతనిపై ఆరోపణ. దోషిగా తేలిన ఆ కేసులో అతని పాత్ర ఎంత, అతని అమాయకత్వమెంత అనేది వేరే పెద్ద చర్చ. శిక్షాకాలంలో దాదాపు 11 ఏళ్ళు చిన్న 6 బై 9 అడుగుల జైలు గదిలో అతను ఏకాంతవాస శిక్ష అనుభవించారు. తీయని ఉరి కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించారు. క్షమాభిక్ష అభ్య ర్థనపై సుదీర్ఘ జాప్యంతో 2014లో పేరరివాళన్ సహా ముగ్గురు దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది సుప్రీమ్ కోర్టు. 2015లో గవర్నర్‌ను క్షమాభిక్ష కోరుతూ, అరివు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు 2018లో గవర్నర్‌ను కోరింది. గవర్నర్ దాన్ని పట్టించుకోకపోవడంతో, అప్పటి తమిళనాడు క్యాబినెట్ అతణ్ణి విడుదల చేయాలని సిఫార్సు చేసింది. ఆ తర్వాత 2020లో సుప్రీమ్ మరో మాట చెప్పింది. అరివుపై విచారణ సాగుతున్నా, ఉపశమనం ఇచ్చేందుకు గవర్నర్‌కు అధికారం ఉందంది. చివరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం అతని క్షమాభిక్ష అంశం రాజ్‌భవన్ విచక్షణకే వదిలేసింది. అయినా సరే గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా బంతి కేంద్రం కోర్టులో వేసి, అంతా రాష్ట్రపతి ఇష్టమేనంటూ చేతులు దులుపుకొన్నారు. చివరకిప్పుడు రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకున్న అసాధారణ అధికారాన్ని సుప్రీమ్ వినియోగించాల్సి వచ్చింది. అరివు విడుదలకు ఆదేశించాల్సి వచ్చింది. సుప్రీమ్ తాజా ఆదేశం వివాదాలూ రేపుతోంది. రాజీవ్ హత్య కేసులోని దోషులను క్షమిస్తున్నా మనీ, వారిని విడిచిపెడితే అభ్యంతరం లేదనీ ప్రియాంక సహా రాజీవ్ కుటుంబసభ్యులే గతంలో చెప్పారు. కానీ, తీరా ఇప్పుడు దోషుల్లో ఒకరైన అరివు విడుదలకు అధికార బీజేపీ వైఖరే కారణ మంటూ కాంగ్రెస్ తప్పుబట్టింది. మిగతా ఆరుగురు దోషులను కూడా విడిచిపెట్టేస్తారా అని ప్రశ్నిస్తోంది. ఇక, రాష్ట్ర గవర్నర్ పేరబెట్టిన క్షమాభిక్షను కోర్టు పరిష్కరించడంతో, రాజ్ భవన్‌పై బాణాలు వేసేందుకు తమిళనాడు సర్కారుకు సరికొత్త అస్త్రం దొరికినట్టయింది. ఒక్క అరివు క్షమా భిక్షే కాదు... ఏడాది క్రితం గద్దెనెక్కినప్పటి నుంచి ‘నీట్’ రద్దు సహా అనేక అంశాలపై స్టాలిన్ సర్కారు చేసిన పలు సిఫార్సుల గతీ ఇదే! రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు వ్యవహరించాల్సిన గవర్నర్లు తద్విరుద్ధంగా, ప్రభుత్వ సిఫార్సులపై సాచివేత ధోరణిని అవలంబిస్తున్న తీరు ఇలా మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్రం చేతిలోని గవర్నర్ల వ్యవస్థపై వస్తున్న విమర్శలకు కొత్త బలం చేకూరింది. సుప్రీమ్ తన తాజా ఉత్తర్వులో 1980 నాటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రస్తావించింది. రాష్ట్రపతి ఓ ప్రతీక. కేంద్రప్రభుత్వమే వాస్తవం. గవర్నర్ పేరుకే పెద్ద, కార్యనిర్వాహక అధికారాలకు కేంద్రం. మంత్రిమండలి సలహా మేరకే ఆ అధికారాలను వాడవచ్చన్న మాటలను ఉటంకించింది. అధికారాల విషయంలో కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య ‘లక్ష్మణరేఖ’ ఉందంటూనే, భారత శిక్షాస్మృతి కింద విచారణ చేసినప్పుడు రాష్ట్రాన్ని తోసిపుచ్చే పై చేయి కేంద్రానికి లేదంది. ఎన్ఐఏ, ‘ఉపా’ లాంటి చట్టాల కింద కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసినప్పుడు తప్ప, ఏ ఇతర చట్టాల కిందా కేంద్రానిది పై మాట కాదనీ గుర్తు చేసింది. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకొనే అధికారం గవర్నర్లకు లేదనీ, సుప్రీమ్ తాజా ఆదేశాలు ‘రాష్ట్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి’కి విజయసూచిక అనీ స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇల్లలకగానే పండగ కాదు. ఈ ఒక్క తీర్పుతో కేంద్రం, వివాదాస్పద గవర్నర్లంతా తమ వైఖరిని మార్చేసుకుంటారనీ అనుకోలేం. అలాగే, ఇదే సందుగా పాపులర్ జనాభిప్రాయం సాకుతో దోషుల శిక్ష తగ్గించమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తే సబబనీ చెప్పలేం. అరివును కోర్టు విడుదల చేయమన్నంత మాత్రాన రాజీవ్ హత్య కుట్రలో శిక్ష పడ్డ అతను కానీ, మిగతా దోషులు కానీ అమాయకులనీ తీర్మానించలేం. నేర తీవ్రత, నేరస్థుడి ప్రవర్తన కాక, జైలులో శిక్షాకాలమే విడుదలకు గీటురాయనీ అనలేం. ఖైదీకైనా సరే రాజ్యాంగ స్వేచ్ఛకు భంగం వాటిల్లితే కోర్టు జోక్యం చేసుకోగలదన్నదే సారాంశం. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలంటున్నది అందుకే! -
పెరరివాళన్.. ఇప్పటికే ఆలస్యమైంది.. పెళ్లి చేసుకో
చెన్నై: సుదీర్ఘ కారాగారవాసం తర్వాత జీవితఖైదీ ఏజీ పెరరివాళన్ జైలు నుంచి విడుదలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైన పెరరివాళన్‌ను తాను కలవాలనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ చెప్పారు. అతడు సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. 1999లో ఏజీ పెరరివాళన్‌కు మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి జస్టిస్ కేటీ థామస్ నేతృత్వం వహించారు. ‘పెరరివాళన్‌ను నేను చూడాలనుకుంటున్నాను. మీకు సమయం దొరికితే, దయచేసి నన్ను కలవండి’ అంటూ కేరళలోని కొట్టాయంలో ఉన్న తన నివాసం నుంచి ఆయన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడారు. ‘సుదీర్ఘ కారాగారవాసం తర్వాత 50 సంవత్సరాల వయస్సులో జైలు నుంచి విడుదలైన అతడితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అతను త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రేమను మాత్రమే పొందాడు. వైవాహిక జీవితాన్ని అతడు గడపలేదు. తన ప్రియమైన వారితో అతడు సంతోషంగా జీవించాలి. పెరరివాళన్‌ను జైలు నుంచి బయటకు తీసువచ్చిన ఘనత అతడి తల్లి (అర్పుతం అమ్మాల్)కి దక్కుతుంది. ఈ ఘనతకు ఆమె సంపూర్ణంగా అర్హురాల’ని జస్టిస్ కేటీ థామస్ పేర్కొన్నారు. (చదవండి: ఇది అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం) రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు 23 ఏళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేయాలన్న నిర్ణయాన్ని 2013లో జస్టిస్ కేటీ థామస్ వ్యతిరేకించారు. దీంతో 2014లో ముగ్గురు దోషుల మరణశిక్షలను మారుస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడిపిన వారిని ఉరితీయడం అంటే ఒక నేరానికి రెండు శిక్షలు అమలు చేసినట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన గట్టిగా వాదించారు. అంతేకాదు దోషుల పట్ల ఉదారత చూపాలని అప్పట్లో సోనియా గాంధీని వేడుకున్నారు. దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు మంత్రివర్గ ప్రతిపాదనను గవర్నర్ పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. యావజ్జీవ కారాగార శిక్ష మొత్తం జీవితకాలానికి సంబంధించిదైనప్పటికీ.. భారత రాజ్యాంగం ఉపశమనాన్ని అనుమతిస్తుంది అని జస్టిస్ థామస్ అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో గోపాల్ గాడ్సేకు 14 సంవత్సరాల తర్వాత ఉపశమనం లభించిందని.. అతనితో పాటు జీవిత ఖైదులో ఉన్న ఇతర దోషులందరినీ కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ‘జైలు నుంచి విడుదలైన తర్వాత గోపాల్ గాడ్సే జీవితాన్ని చూడండి. అతడు పూర్తిగా మారిపోయాడు. పుస్తకాలు కూడా రాశాడు. మహాత్మా గాంధీ హంతకులను విడుదల చేసి.. వారిలో పరివర్తన తేవడానికి అనుమతించారు. మరి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను ఎందుకు సంస్కరించకూడద’ని థామస్ ప్రశ్నించారు. పెరరివాళన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మిగిలిన ఆరుగురు దోషులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. (చదవండి: పెరరివాళన్ పెళ్లి ఏర్పాట్లు షురూ) -
Rajiv Gandhi Assassination Case: పేరరివాళన్ పెళ్లి ఏర్పాట్లు షురూ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌కు సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం లభించిన విముక్తి.. మిగిలిన ఆరుగురినీ ఆశలపల్లకి ఎక్కించింది. సీఎం స్టాలిన్ సైతం ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తామని ప్రకటించడం వారి విడుదలపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పెళ్లి ఏర్పాట్లు చేస్తాం: అర్బుదమ్మాళ్ 1991 మే 21వ తేదీ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు గురికాగా, జూన్‌లో పేరరివాలన్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచి విడుదల కోసం తల్లి అర్బుదమ్మాల్ పోరాటం చేస్తున్నారు. తన కుమారుడు నిరపరాది అంటూ ఆనాటి నుంచి వరుసగా అందరు సీఎంలకు, అన్నిపార్టీల నేతలకు ఆమె వినతిపత్రాలు సమర్పించారు. పేరరివాలన్ విడుదలైన వెంటనే వివాహం చేసి పెట్టాలని ఆమె ఆశపడింది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చదవండి: (బిడ్డకోసం అమ్మ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, తీవ్ర భావోద్వేగం) నేపథ్యం ఇదీ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూరులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ బహిరంగసభకు హాజరైనప్పుడు ఎల్టీటీఈ మానవబాంబు చేతిలో హతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి 1999లో తొమ్మిది మంది విడుదల కాగా, పేరరివాళన్, నళిని, మురుగన్, శాంతన్‌కు ఉరిశిక్ష, రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పయస్‌కు యావజ్జీవశిక్ష పడింది. 2014లో పేరరివాళన్ సహా అందరూ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం పంపగా పరిశీలనలోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ సుప్రీంకోర్టు వారందరి మరణశిక్షను రద్దు చేసి యావజ్జీవశిక్షకు తగ్గించింది. ఆనాటి నుంచీ వారంతా తమిళనాడు రాష్ట్రం వేలూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. మానవబాంబుకు బ్యాటరీ కొనుగోలు చేసి ఇచ్చిన నేరంపై పేరరివాళన్‌కు శిక్ష పడగా విడుదల చేయాలని కోరుతూ అతని న్యాయవాది 2016లో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. మరో పిటిషన్ ఆధారంగా పేరరివాళన్‌కు సుప్రీంకోర్టు జామీను మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, మొత్తం ఏడుగురినీ విడుదల చేయాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా, గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పరిశీలనకు చేరింది. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి మాత్రమే నిర్ణయం తీసుకోగలరని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. -
ఇది అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం
-
బిడ్డకోసం అమ్మ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, తీవ్ర భావోద్వేగం
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏడుగురు దోషుల్లో ఒకరు, యావజ్జీవ ఖైదీ.. ఏజీ పెరారివాలన్ అలియాస్ అరివును విడుదల చేయాలని సుప్రీం మే 18న ఆదేశించింది. 19 ఏళ్ల వయసులో అరెస్టయ్యి, గత మూడు దశాబ్దాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల వయసులో పెరారివాలన్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. దీంతో ఆయన తల్లి అర్పుతం అమ్మాళ్ ఆనంధానికి అవధుల్లేవు. తన బిడ్డ అమాయకుడు అని వాదిస్తూ, ఏళ్ల తరబడి ఆమె చేసిన పోరాటం అంత తేలికైనదేమీ కాదు. ఎన్ని అవమానాలు, అడ్డంకులు ఎదురైనా పట్టువదలకుండా, న్యాయవ్యవస్థమీద విశ్వాసాన్ని కోల్పోకుండా పోరాడి విజయం సాధించిన గొప్ప తల్లి ఆమె. అందుకే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఆ మహాతల్లికి స్వర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ట్విటర్లో ఆమెకు ఏకంగా 21.3 వేల ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. ఆపదలో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కన్నతల్లి ఎంతటి త్యాగానికైనా, సాహసానికైనా వెరువదు అనేందుకు పెరారివాలన్ తల్లి నిలువెత్తు నిదర్శనం. అవమానాలు, అవహేళనలు ఎదురైనా, ఎన్నిసార్లు కోర్టులో నిరాశ ఎదురైనా వెన్ను చూపలేదు. ఆశ కోల్పోలేదు. ఆమెది ఒకటే లక్ష్యం. అన్యాయంగా జైల్లో మగ్గుతున్న తన కుమారుడికి విముక్తి లభించాలి. అందుకోసం ఏకంగా మూడు దశాబ్దాలుగా అంతులేని పోరాటం చేసేంది. అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులకు పలుసార్లు అభ్యర్థనలు పెట్టింది. ఈ సుదీర్ఘ పోరులో తనతో కలిసి వచ్చిన వారందరినీ కలుపుకుపోయారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టు కున్నారు. కుటుంబ సభ్యులు, తమిళ సోదరులు, ఇతర మిత్రుల సహకారంతో చివరికి అపూర్వ విజయం సాధించారు. అందుకే కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆనందంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఉత్సాహంగా మిత్రులకు, బంధువులకు స్వీట్లు పంచిపెట్టారు. మరణశిక్షనుంచి యావజ్జీవ శిక్షగా, ఇపుడు జైలునుంచి విడుదలయ్యే దాకా అర్పుతం అమ్మాళ్ చేసిన పోరాటం అభినందనీయంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా పెరారివాలన్ తల్లి అమ్మాళ్ మీడియాతో మాట్లాడారు. “మీ అందరినీ వెయిట్ చేయించినందుకు క్షమాపణలు కోరుతున్నాను, కానీ నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. మా పోరాటం 30 ఏళ్లు సాగింది. ఇంతకాలం మమ్మల్ని ఆదరించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇతర ముఖ్యులు అందరికీ కృతజ్ఞతలు. అసలు నేను ఎవరో తెలియని వారుకూడా అండగా నిలిచారు’’ అంటూ అందరికీ నీరు నిండిన కళ్లతో ధన్యవాదాలు తెలిపారు. అలాగే 30 ఏళ్లు జైలులో గడపడం ఎలా ఉంటుందో అందరూ ఒక్క నిమిషం ఆలోచించాలని అర్పుతం అమ్మాళ్ కోరారు. సుప్రీం తీర్పు తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన పెరారివాలన్, ‘‘తన సొంత కుటుంబ సభ్యుడిగా భావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు నాకు సంఘీభావంగా నిలిచారు. తన కోసం 30 సంవత్సరాలు పోరాడింది అమ్మ. ఈ ఘనత అమ్మదే. ముఖ్యంగా ప్రారంభంలో అక్కలు నాన్న, బావమరిది ప్రేమే నన్ను ముందుకు నడిపించాయి’’. ఈ పోరాట క్రమంలో ఓడిపోయిన ప్రతీసారి, అమ్మ శక్తిని హరించి వేస్తున్నంత బాధ కలిగేదని గుర్తుచేసుకున్నారు. అసలు తన మొఖం చూడాలంటేనే భయపడేవాడినని చెప్పారు కానీ వాళ్లంతా బతికి ఉండగానే తనకు విముక్తి లభిస్తుందని మాత్రం ఎప్పుడూ ఆశించానంటూ భావోద్వేగానికి లోనయ్యారు పెరారి. కాగా జైలులో ఉన్న సమయంలో పెరారి అనేక విద్యా అర్హతలను సంపాదిండమే కాదు ఒక పుస్తకాన్ని రాశారు. ఈ సుదీర్ఘ పయనంలో తన పెద్ద అక్కతో సహా, తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కిరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మరణశిక్షను నిరసిస్తూ కాంచీపురానికి చెందిన 20 ఏళ్ల మహిళ సెంకోడి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రులకు తన కోసం రాసిన అనేక లేఖలు , మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ సిబిఐ అధికారి విత్యాగరాజన్, జస్టిస్ కృష్ణయ్యర్, రిటైర్డ్ జస్టిస్ కెటి థామస్, ఫీజు కూడా ఆశించకుండా అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్, ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం, జైలు అధికారులు ఇలా ఎందరో తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. మీడియా సపోర్ట్ కూడా చాలా ఉందన్నారు. తాను మరణ శిక్షలకు వ్యతిరేకమని పెరారివాలన్ మీడియాతో చెప్పారు. మరోవైపు స్వయంగా తమిళనాడు సీఎం స్టాలిన్ అర్పుతం అమ్మాళ్కు ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా అభినందించారు. కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతమాజీ ప్రధాని, రాజీవ్ గాంధీ మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో, అప్పటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జికె మూపనార్‌తో కలిసి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆత్మాహుతి బాంబర్ ధను అలియాస్ తేన్మొళి రాజారత్నం చేసిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాజీవ్‌ను హత్య చేసేందుకు వినియోగించిన బెల్ట్ బాంబు బ్యాటరీని కొనుగోలు చేసినట్లు పెరారివారన్పై ప్రధాన ఆరోపణలు. ఈ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈకి చెందిన శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడనేది అభియోగం. ఆ సమయంలో పెరారి వాలన్ వయసు 19 సంవత్సరాలు. ఈ కేసుకు సంబంధించి 1998లో పెరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది. ఆ తరువాత 2014లో పెరారివాలన్, మురుగన్, సంతన్ క్షమాభిక్ష పిటిషన్లు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న కారణంగా దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం విడుదల చేయాలని కోరుతూ డిసెంబర్ 31, 2015న, పెరారివాలన్ 47 పేజీలు, సీడీలతో కూడిన క్షమాభిక్ష పిటిషన్‌ను తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అందించారు. అనంతరం పెరారివాలన్, ఇతర దోషులకు క్షమాపణ ఇవ్వాలని పళనిస్వామి నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం 2018లో గవర్నర్‌ను కోరింది. గవర్నర్ ఈ విషయాన్ని భారత రాష్ట్రపతికి నివేదించారు. ఫలితంగా పెరారివాలన్‌కు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పెరారివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. బ్యాటరీలను కొనుగోలు చేసిన ఉద్దేశ్యం, రాజీవ్ హత్యకుట్ర కోణం తనకు తెలియదని పెరారి వాదన. అలాగే అక్టోబరు 27, 2017 నాటి అఫిడవిట్లో పెరారివాలన్ చేసిన ప్రకటనను తాను రికార్డ్ చేయలేదని మాజీ సీబీఐ అధికారి త్యాగరాజన్ అంగీకరించారు. అంతేకాదు రెండు దశాబ్దాల తన జీవితంలో జరిగిన నష్టానికి తాను పశ్చాత్తాప పడుతున్నానని కూడా అని త్యాగరాజన్ చెప్పారు. మరోవైపు రాజీవ్ గాంధీ 31వ వర్ధంతికి కేవలం మూడు రోజుల ముందు (మే 18, బుధవారం) పెరారివాలన్‌కు విముక్తి లభించడం విశేషం. తాజా తీర్పుతో ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమం కానుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం బాధించింది : కాంగ్రెస్ పెరారివాలన్ విడుదలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేసింది. టెర్రరిస్టును టెర్రరిస్టుగానే పరిగణించాలి, సుప్రీం ఆదేశాలు తీవ్ర బాధను కలిగించాయని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. మరోవైపు రాజీవ్ భార్య, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, కాంగ్రెస్ నేతలు, రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. -
పేరరివాలన్ విడుదలకు మొగ్గు
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ విడుదలకు సుప్రీంకోర్టు పరోక్షంగా మొగ్గు చూపింది. ఈ మేరకు న్యాయమూర్తి నాగేశ్వ రరావు బెంచ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నేపథ్యం ఇదీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో నింధితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్ సహా ఏడుగురికి తొలుత విధించిన కోర్టు ఉరి శిక్ష విధించింది. కాలక్రమేనా అది యావజ్జీవ శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే శిక్షా కాలం ముగిసినా వీరంతా (30 ఏళ్లుగా) జైలుకే పరిమితమై ఉన్నారు. దీంతో తమను విడుదల చేయాలని కోరుతూ నిందితులు ఒక్కొక్కరిగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. అలాగే, వీరి విడుదలకు గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తుంగలో తొక్కడాన్ని కోర్టుల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులు ఒకరి తర్వాత మరొకరు కోర్టు ద్వారా పెరోల్ పొందే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంలో నిందితులకు అనుకూలంగానే వ్యవహరించింది. ఇక పేరరివాలన్, నళిని ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై బయట ఉన్నారు. అయితే, పెరోల్‌పై బయటకు వచ్చినా, ఇంట్లో నిత్యం పోలీసు పహారా మధ్య కాలం గడపాల్సిన పరిస్థితి ఉందని, ఇది కూడా ఓ జైలుగానే మారిందంటూ పేరరివాలన్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పేరరివాలన్‌కు బెయిల్ లభించింది. అదే సమయంలో తనకు ఈ కేసు నుంచి విముక్తి కలి్పంచాలని కోరుతూ పేరరివాలన్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ నాగేశ్వరరావు బెంచ్‌ముందు విచారణకు వచ్చింది. విడుదల చేయవచ్చుగా..? రాజీవ్ హత్య కేసులో పేరరివాలన్ నిందితుడు అన్న విషయంలో సరైన వివరాలు కేంద్రం వద్ద లేదని.. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినా, ఆంక్షలు తప్పడం లేదని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. విడుదల విషయంలో చేసిన తీర్మానంపై గవర్నర్ నిర్ణయం తీసుకోక పోవడం, ఆయన్ని విడుదల చేసే అధికారం కేంద్రానికి ఉందా..? రాష్ట్రానికి ఉందా..? అనే విషయంపై కేంద్ర బృందాలు ఇంకా నివేదిక ఇవ్వకపోవడం వంటి అంశాన్ని గుర్తు చేస్తూ తమ వాదనల్ని వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఈ చిక్కుల నేపథ్యంలో పేరరివాలన్‌ను విడుదల చేయవచ్చుగా..? అని వ్యాఖ్యనించింది. ఇంతకీ విడుదల అధికారాలు ఎవరికి ఉన్నాయి..? ఈ ఆంక్షల చట్రంలో అతడు ఎందుకు చిక్కుకోవాలి..? అని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
రాజీవ్ హత్య కేసు దోషికి బెయిల్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యోదంతం కేసులో దోషిలా తేలిన ఏజీ పెరారివాలన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరుచేసింది. పెరారివాలన్‌కు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే, గత 30 సంవత్సరాలుగా ఆయన జైల్లో మగ్గిపోయారని, పెరోల్ కాలంలోనూ సత్ప్రవర్తనతో మెలిగాడని బెయిల్ ఉత్తర్వుల మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎండీఎంఏ కేసు పూర్తయ్యేదాకా తన జీవితకాల శిక్షను రద్దు చేయాలంటూ 47 ఏళ్ల పెరారివాలన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1991 మే 21న రాజీవ్‌గాంధీని మహిళా ఆత్మాహుతి బాంబర్ ధను హత్యచేయడం తెల్సిందే. ఈ ఘటనలో ప్రమేయమున్న మురుగన్, సంథమ్, నళినిలతోపాటు పెరారివాలన్‌లకు ఉరిశిక్ష పడింది. అయితే శంథన్, మురుగన్, పెరారివాలన్‌ల క్షమాభిక్ష పిటిషన్లు 11 ఏళ్లపాటు పెండింగ్‌లో ఉండటంతో 2014 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు పెరారివాలన్ ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది. (చదవండి: ‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం) -
రాజీవ్ గాంధీ హత్య కేసు: దోషికి పెరోల్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివళన్ పెరోల్ పొందారు. వైద్య పరీక్షల నిమిత్తం సుప్రీం కోర్టు సోమావారం ఆయనకి వారం రోజులపాటు పెరోల్ జారీ చేసింది. కాగా, నవంబర్12న అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూడటానికి, మేనకోడలు వివాహం హాజరుకావడానికి పెరోల్ పోందారు. ప్రస్తుతం పెరరివళన్ జీవిత ఖైదు శిక్షను చెన్నై సమీపంలోని పుజల్ సెంట్రల్ జైలులో అనుభవిస్తున్నారు. తాజాగా ఇచ్చిన పెరోల్ గడువు నవంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఆయన గతంలో 2017లో తన తండ్రి అనారోగ్యంతో ఉంటే పెరోల్ పొందిన విషయం తెలిసిందే. చదవండి: రాజీవ్ హత్యకేసులో దారులన్నీ మూతపడ్డట్లే..! 1991లో చెన్నై సమీపంలోని శ్రీపెరంపుదూర్ వద్ద జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతి చెందిన విషయం తెలిసిందే. పెరరివళన్‌తో పాటు, ఈ కేసులో దోషులుగా తేలిన మురుగన్, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు జీవిత ఖైదు విధించారు. ఈ ఏడుగురిని విడుదల చేయాలనే తీర్మానాన్ని తమిళనాడు మంత్రివర్గం ఆమోదించగా, ఆ కేసుకు సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. -
నాడు నో నేడు ఎస్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్ ముందస్తు విడుదలపై కొన్నేళ్లుగా సాగుతున్న పోరాటం కొత్త మలుపు తిరిగింది. రాజీవ్ హంతకులకు క్షమాభిక్షపై గతంలో తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పిన అఖిలభారత కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాజాగా మాటమార్చారు. ‘పేరరివాళన్‌ను ముందుగా విడుదల చేయదలిస్తే ఎలాంటిæ అభ్యంతరం లేదని ప్రకటించారు. సదరు ఖైదీల క్షమాభిక్ష వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉండడంతో రాహుల్ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజీవ్‌గాంధీ హత్యకు సంబంధించి తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో పేరరివాళన్ ఒకడు. వేలూరు జిల్లా జోలార్పేటకు చెందిన ఇతనిపై సీబీఐ ముఖ్యమైన నేరారోపణలు చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకోసం ఆత్మాహుతి దళం బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను పెరిరవాళనే కొనిచ్చాడనే అభియోగంపై 1991 జూన్ 11వ తేదీన అరెస్ట్‌చేసింది. రాజీవ్ హత్యకేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పేరరివాళన్‌కు మరణశిక్ష విధించింది. అతనితోపాటు మురుగన్, శాంతన్, నళినిలకు సైతం ఉరిశిక్ష విధించింది. 1998లో టాడా న్యాయస్థానం విధించిన ఈ శిక్షను 1999లో సుప్రీంకోర్టు సైతం ఖరారుచేసింది. ఆ తరువాత పేరరివాళన్ విడుదల చేయాలని అనేక సంఘాలు ఆందోళనలు చేశాయి. అతని తల్లి అర్బుతమ్మాళ్ పలువురు నేతలను కలుస్తూ మద్దతు సేకరించారు. అయితే ఈపోరాటాలు సాగుతుండగానే 2014లో పేరరివాళన్ తదితరులను ఉరివేసేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. అయితే క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వారు చేసుకున్న విజ్ఞప్తిపై పదేళ్లుగా నిర్ణయం తీసుకోనందున ఉరిశిక్ష వేయకూడదని సుప్రీం కోర్టులో బాధితులు పిటిషన్ వేశారు. దీంతో ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువడింది. అంతేగాక, పేరరివాళన్ విడుదలపై తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు. దీంతో పేరరివాళన్ విడుదల ఖాయమనే ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పేరరివాళన్‌ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జయలలిత అప్పట్లోప్రయత్నం చేశారు. చట్టంలోని నిబంధనలు అందుకు అనుమతించలేదు. దీంతో పేరరివాళన్ గత 27 ఏళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్నారు. 1991లో అతడు ఇచ్చిన వాంగ్మూలం తప్పుగా తర్జుమా చేసినందునే మరణిశిక్షకు గురైనాడని కేసు విచారణలో పాల్గొన్న సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో రాజీవ్ హత్యకేసులో పేరిరవాళన్ అమాయకుడనే భావన నెలకొన్నా జైలు నుంచి విడుదలకు అవకాశం ఏర్పడలేదు. అతని తల్లి ఇప్పటికీ కొడుకు విడుదల కోసం పోరాడి అలసిపోయారు. రంజిత్ రాయబారం రాజీవ్ హంతకులు, ముఖ్యంగా పేరరివాళన్ ముందస్తు విడుదల అంశం దాదాపు తెరమరుగు కాగా, ప్రముఖ తమిళ దర్శకులు పా రంజిత్ రాయబారం చేయడంతో మరలా తెరపైకి వచ్చింది. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్న రంజిత్ సుమారు రెండుగంటలపాటూ తమిళనాడు రాజకీయాలను మాట్లాడుకున్న సమయంలో పేరరివాళన్ విడుదలకు సహకరించాల్సిందిగా రంజిత్ కోరారు. ‘పేరరివాళన్ విడుదల విషయంలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని రాహుల్ బదులివ్వగా రంజిత్ ధన్యవాదాలు తెలిపారు. రంజిత్‌తో కలిసి రాజకీయాలు మాట్లాడుకున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంతోపాటు ఫొటో పెట్టారు. కాగా, గతంలో సోనియా విజ్ఞప్తి మేరకు నళిని మరణదండన, యావజ్జీవ శిక్షగా మారింది. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో పేరరివాళన్ విడుదలయ్యేనా, తల్లి అర్బుతమ్మాళ్తోపాటు ఇతరుల కల నెరవేరేనా, రాహుల్ విజ్ఞప్తిని కేంద్రం స్వీకరించేనా అనే అనుమానాలు వరుసపెట్టాయి. ఆనాడే చుక్కెదురు మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని భావించిన జయలలితకు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడే చుక్కెదురైంది. అంతేగాక మాజీ ప్రధానిని హత్యచేసిన వారికే క్షమాభిక్షా అంటూ ఆనాడు సాక్షాత్తు రాహుల్‌గాంధీనే అడ్డుపుల్లవేశారు. మరి ఈరోజు అదే వ్యవహారంలో తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం అంగీకరించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని మంత్రి కడంబూరు రాజా చెప్పడం ద్వారా బంతిని కేంద్రం కోర్టులో వేసి చేతులు దులుపుకున్నారు. -
కారుణ్య మరణానికి అనుమతివ్వండి! : రాజీవ్ హంతకురాలు
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ తనకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని తల్లి అర్బుదమ్మాల్ ద్వారా తమిళనాడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్యకేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్, నళినితో పాటు ఏడుగురు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నందున విడుదల చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారి విడు దలను నిరాకరించారు. దీంతో నిరాశ చెందిన పేరరివాలన్ తల్లి జోలార్‌పేటలోని తన నివా సంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ హత్య కేసులో 19 ఏళ్ల వయస్సులో ఉన్న పేరరివాలన్‌ను విచారణకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారన్నారు. 27 ఏళ్లుగా చట్ట ప్రకారం విడుదల అవుతాడని ఎదురు చూసినా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత సీఎం జయలలిత రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారస్సు చేశారన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. కోర్టు నుంచి మంచి తీర్పు వింటామనే ఆశతో ఉన్న ఏడుగురికి నిరాశ మిగిల్చేలా రాష్ట్రపతి నిరాకరణ తెలపడం బాధాకరమన్నారు. మహాత్మాగాంధీ హత్యకేసు నిందితులకు 14ఏళ్లు మాత్రమే శిక్ష విధించి విడుదల చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. పేరరివాలన్‌ను 27 ఏళ్లుగా విడుదల చేయకపోవడంపై కన్నీరు మున్నీరయ్యారు. -
రాజీవ్ హంతకుడిపై జైల్లో దాడి
చెన్నై : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో మరణ శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివలన్పై తోటి ఖైదీ ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. వేలూరు జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అతడిపై మంగళవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన పెరరివలన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రాజేశ్ కన్నా ఈ దాడికి పాల్పడినట్లు వెల్లూరు రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ తెలిపారు. పెరిరవలన్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అతని నుదుటిపై గాయానికి నాలుగు కుట్లు పడినట్లు తెలిపారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు. కాగా 9వోల్టుల బ్యాటరీద్వారా బాంబు పేల్చి రాజీవ్‌ను హత్య చేయడంలో పెరరివలన్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. -
రాజీవ్ హత్య వెనుక రాజకీయం!
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య వెనుక రాజకీయం ఉందని ఈ కేసుకు సంబంధించి వేలూరు జైలులో ఉన్న పెరరివాళన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హత్య వెనుక రాజకీయం ఉన్నందునే కేసు విచారణ ముగింపులో జాప్యం జరుగుతోందని చెన్నైలోని టాడా కోర్టులో గురువారం వేసిన పిటిషన్లో ఆరోపించాడు. 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో పురోగతి లేదని, హత్య వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందన్నాడు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ సాగేలా చూడాలని పిటిషన్లో అభ్యర్థించాడు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సీబీఐ ఇంతవరకు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని అతని తరపు న్యాయవాది ఎన్ చంద్రశేఖర్ చెప్పారు. పిటిషన్ లో పేరరివాళన్ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్టీటీఈ ఇంటెలిజెన్ విభాగం అధినేత బొట్టు అమ్మన్ తో పాటు మరి కొందరు నిందితులు ఇంతవరకు పట్టుబడలేదన్నారు. రాజీవ్ హత్యకేసు విచారణ ముగిసిన తర్వాత సీబీఐ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని 1999 జూన్ 17న కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. రాజీవ్ హత్యకేసు విచారణలో పురోగతిని వివరిస్తూ టాడా కోర్టుకు వీరు ప్రతినెలా ఒక రహస్య నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి లేనందున బాధితునిగా మిగిలానని పేరరివాళన్ కోర్టుకు విన్నవించారు. విచారణ సక్రమంగా సాగితే రాజీవ్ హత్య వెనుకనున్న నిజాలు బయటపడతాయని చెప్పారు. హత్యలో కొందరు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇంతవరకు విచారించిన వారినే మరోసారి విచారించేలా ప్రత్యేక బృందాన్ని నియమించాలని, ఈ బృందం న్యాయస్థాన పర్యవేక్షణలో సాగేదిగా ఉండాలని ఆయన కోరారు. నిజాలను నిక్కచ్చిగా వెలికితీసేలా వారికి స్పష్టమైన ఆదేశాలు సైతం ఇవ్వాలని కోరారు. పేరరివాళన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై గురువారం టాడాకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున రంగనాధన్, పేరరివాళన్ తరపున ఎన్ చంద్రశేఖర్ వాదించారు. తీర్పును వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు. -
రాజీవ్ హత్య వెనుక ‘రాజకీయం’
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య వెనుక రాజకీయం ఉన్నందునే కేసు విచారణ ముగింపులో జాప్యం జరుగుతోందని ఈ కేసులో ముద్దాయి పేరరివాళన్ ఆరోపించారు. వేలూరు జైలులో ఖైదీగా ఉన్న పేరరివాళన్ తన న్యాయవాది చేత చెన్నైలోని టాడా కోర్టులో వేసిన పిటిషన్ గురువారం సాయంత్రం విచారణకు వచ్చింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సీబీఐ ఇంత వరకు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని అతని న్యాయవాది ఎన్ చంద్రశేఖర్ చెప్పారు.పిటిషన్లో పేరరివాళన్ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగం అధినేత బొట్టు అమ్మన్‌తోపాటు మరికొందరు నిందితులు ఇంతవరకు పట్టుబడలేదన్నారు. రాజీవ్ హత్యకేసు విచారణ ముగిసిన తరువాత సీబీఐ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని 1999 జూన్ 17న కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. రాజీవ్ హత్యకేసు విచారణలోని పురోగతిని వివరిస్తూ టాడా కోర్టుకు వీరు ప్రతి నెల ఒక రహస్య నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి లేనందున బాధితునిగా మిగిలానని పేరరివాళన్ కోర్టుకు విన్నవించారు. విచారణ సక్రమంగా సాగితే రాజీవ్ హత్య వెనుకనున్న నిజాలు బయటపడతాయని చెప్పారు. హత్యలో కొందరు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇంతవరకు విచారించిన వారినే మరోసారి విచారించేలా ప్రత్యేక బృందాన్ని నియమించాలని, ఈ బృందం న్యాయస్థాన పర్యవేక్షణలో సాగేదిగా ఉండాలని ఆయన కోరారు. నిజాలను నిక్కచ్చిగా వెలికితీసేలా వారికి స్పష్టమైన ఆదేశాలు సైతం ఇవ్వాలని కోరారు. పేరరివాళన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై గురువారం సాయంత్రం టాడా కోర్టు న్యాయమూర్తి దండపాణి విచారణ జరిపారు. సీబీఐ తరపున రంగనాథన్, పేరరివాళన్ తరపున ఎన్ చంద్రశేఖర్ వాదించారు. తీర్పును వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు.