రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి పేరరివాళన్ విడుదలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు భారత శిక్షాస్మృతిని అర్థం చేసుకోవడం లేదు. ఈ దేశంలో ఒక నేర ఘటన రాజకీయ రంగును పులుముకున్నప్పుడు దానిపై రాజకీయ అభిప్రాయాలే తప్ప, నేర న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉండదనేది స్పష్టం. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా శాసించబోవడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. దేశ శాసనాలకు అనుగుణంగా కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేర్చకపోవడం వల్లే న్యాయస్థానం పేరరివాళన్ కేసును ఈ విధంగా పరిష్కరించాల్సి వచ్చింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న అధికారాలను ఉపయోగించుకున్న సుప్రీంకోర్టు, రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏజీ పేరరివాళన్ విడు దలకు ఆదేశించింది. సుప్రీంకోర్టు చర్య మిశ్రమ స్పందనలకు తావి చ్చింది. ఈ తీర్పు ఉగ్రవాదానికీ, డబ్బు బలానికీ విజయమని తమిళ నాడు కాంగ్రెస్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ చిన్నపాటి నిరసన లను పక్కన బెడదాం. సుప్రీంకోర్టు తీర్పును మాత్రం సమాజంలోని వివిధ వర్గాలు స్వాగతించాయి. రెండు దశాబ్దాలకు పైగా ఈ కేసు కొనసాగిన క్రమానికీ, వివిధ దశల్లో అది ప్రేరేపించిన ఘర్షణకూ ముగింపు లభిం చినట్లయిందని వీరు భావిస్తున్నారు. పైగా రాజ్ భవన్‌కూ, సచివాల యానికీ మధ్య నడిచిన పోరుకు కూడా ఈ తీర్పు ముగింపు పలికింది.
రాజీవ్ గాంధీ హత్యానంతరం, ఆ హత్యకు కుట్రపన్నారన్న ఆరో పణపై నిర్బంధించిన నిందితులను టాడా చట్టం (తీవ్రవాద, విధ్వం సక చర్యల నిరోధక చట్టం) 1987 కింద విచారించారు. ఐపీసీ కింద నేర విచారణ పద్ధతికి భిన్నంగా ఎస్పీ స్థాయి అధికారి ముందు నిందితులు నేరం ఒప్పుకొంటే సరిపోతుందని ఈ చట్టం అనుమతిం చింది. రాజీవ్ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణకు గురైన 26 మంది నిందితులంద రికీ టాడా స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని మాత్రమే టాడా నిబంధనలు చెబుతున్నాయి కానీ టాడా కింద నేరాలను స్పష్టంగా వెల్లడించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే ఉగ్రవాద చర్యలకు సంబం ధించి అంతవరకు ఏ కేసునూ విచారించి ఉండలేదని సుప్రీంకోర్టు పేర్కొంటూ రాజీవ్ హత్యకేసులో 22 మంది నిందితులకు పడ్డ ఉరి శిక్షలను సవరించింది. నళిని, పేరరివాళన్, మురుగన్, శాంతన్‌ల ఉరిశిక్షను మాత్రమే 1999లో ఖరారు చేసింది.
దాంతో ఆ నలుగురూ ఆర్టికల్ 161 కింద తమకు క్షమాభిక్ష పెట్టాలని తమిళనాడు గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. నాటి రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫాతిమా బీవీ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని కేబినెట్ సలహా తీసుకో కుండానే వారి పిటిషన్‌ను తోసిపుచ్చారు. మంత్రిమండలి సలహా తీసు కోకుండా క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించలేరని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో బంతి తమిళనాడు ప్రభుత్వానికి తిరిగొచ్చింది. అప్పటికే ఎల్టీటీఈ పట్ల కరుణానిధి ప్రభుత్వం మెత్తటి వైఖరితో ఉందని విమర్శలకు గురవుతోంది. దాంతో ఈ నలుగురిలో నళినికి మాత్రమే ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, పేరరి వాళన్ సహా మిగతా ముగ్గురి అప్పీలును తోసిపుచ్చవచ్చనీ తమిళ నాడు ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌కు సలహా ఇచ్చింది.
ఉరిశిక్షకు గురైనవారికి తన అసాధారణ అధికారాలను ఉపయో గించి క్షమాభిక్ష పెట్టడంలో గవర్నర్‌కు కూడా పరిమితులున్నాయి. 1978లో ఐపీసీకి పార్లమెంట్ సవరణ చేసి సెక్షన్ 433ఏ ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం ఖైదీలు 14 సంవత్సరాల కనీస శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుంటేగానీ వారిని విడుదల చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 72 కింద తమకు క్షమాభిక్ష పెట్టాలని పేరరివాళన్, మరో ఇద్దరూ రాష్ట్రపతిని అభ్యర్థించారు. అయితే ఇద్దరు భారత రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలామ్ తమ పదవీకాలంలో వీరికి క్షమాభిక్ష ఆదేశాలను పాస్ చేయలేదు. కానీ 11 సంవత్సరాల జాప్యం తర్వాత మూడో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వీరి పిటిషన్లను తిరస్కరిం చారు. దీంతో తమిళనాడు శాననసభ అసాధారణ చర్య చేపట్టింది. రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని 2011లో తీర్మానం చేసింది.
తర్వాత వారికి ఉరిశిక్ష అమలు చేసేనాటికి వీరు మద్రాస్ హైకోర్టు తలుపులు తట్టారు. తమపై ఉరిశిక్ష వారెంటును సవాలు చేశారు. ఈ కేసులు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. నిర్దిష్ట కాలంలో వీరి క్షమా భిక్షపై నిర్ణయం తీసుకోకుండా భారత రాష్ట్రపతులు జాప్యం చేయడం సరైంది కాదనీ, పైగా నళిని మినహా ఉరిశిక్ష ఖరారైన ముగ్గురిపై 11 ఏళ్లుగా ఉరితాడు వేలాడుతూనే ఉందనీ చెబుతూ సుప్రీంకోర్టు వీరి ఉరి శిక్షలను రద్దుచేసి యావజ్జీవ శిక్షగా మార్చింది.
ఈలోగా, 2014 ఫిబ్రవరి 19న తమిళనాడు కేబినెట్ ఈ ఏడు గులు ఖైదీలను విడుదల చేయాలంటూ గవర్నర్‌కు సూచించింది. కేంద్ర ప్రభుత్వం తర్వాత ఒక పిటిషన్ వేసి ఈ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యేలా చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్, యావజ్జీవం అంటే ఖైదీ జీవితకాలం పొడవునా నిర్బంధంలోనే ఉండా లని తీర్పు చెప్పింది. శిక్షాకాలాన్ని తగ్గించాల్సిందిగా సీఆర్పీసీ సెక్షన్ 432 కింద దరఖాస్తు చేసుకోవచ్చని వీలు కల్పించింది. ఉరిశిక్షలు పడిన వారందరికీ ఈ తీర్పు వర్తిస్తుందని చెప్పింది.
దాంతో ఈ ఏడుగురు ఖైదీలు మరోసారి తమ శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ తమిళనాడు గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. వారికి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సలహా ఇచ్చింది. గవర్నర్ స్పందించకపోవడంతో నళిని కోర్టుకు వెళ్లింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఏ ఆదేశమూ ఇవ్వలేదు. పైగా గవర్నర్ తన రాజ్యాంగ బద్ధ విధులను నిర్వర్తించనందుకు ఎవరూ ప్రశ్నించజాలరనీ, తాను కోర్టులకు జవాబుదారీ కాదనీ వ్యాఖ్యానించింది, తర్వాత పేరరివాళన్ తల్లి అర్పుతమ్మాళ్ తన కుమారుడికి పెరోల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన ప్పుడు మాత్రం గవర్నర్ జాప్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ రాష్ట్ర కేబినెట్ ఇచ్చిన సలహాను గవర్నర్ దీర్ఘకాలం తొక్కిపెట్టి ఉంచలేరని వ్యాఖ్యానించింది.
2018 సెప్టెంబర్ 9న ఈ ఏడుగురు ఖైదీల క్షమాభిక్ష పిటిషన్‌పై తమిళనాడు అసెంబ్లీ మళ్లీ తీర్మానం చేసింది. కానీ దాని మీద కూడా గవర్నర్ ఏ చర్యా తీసుకోలేదు. కోర్టు ఒత్తిడి చేయడంతో ఈ విష యాన్ని రాష్ట్రపతి నిర్ణయించాలని గవర్నర్ ప్రకటించారు. ఈ వ్యవ హారం తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లింది. అన్ని పరిస్థితులనూ ఆకళింపు చేసుకున్న తర్వాత మాత్రమే ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు పేరరి వాళన్ విడుదలకు ఆదేశించింది.
భారత శిక్షాస్మృతిని నిస్సందేహంగా సంస్కరించాలనీ, అది నిర్బంధపూరితంగా ఉండరాదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, ఒక అనాగరిక నేరానికి అనాగరిక శిక్ష పరిష్కారం కానే కాదని అభిప్రాయ పడింది. పేరరివాళన్ విడుదలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు భారత శిక్షాçస్మృతిని అర్థం చేసుకోవడం లేదు. పైగా తన విడుద లకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు వెనుక కారణాన్ని వీరు గ్రహించడం లేదు. అంతిమంగా ఈ దేశంలో ఒక నేర ఘటన రాజకీయ రంగులు పులుముకున్నప్పుడు దానిపై రాజకీయ అభిప్రాయాలే తప్ప, నేర న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉండదనేది స్పష్టం.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా శాసించబోవడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. ఇది భారత రాజ్యాంగ సంవిధానాన్నే మలినపరుస్తుంది. దేశ శాసనాలకు అనుగుణంగా కాకుండా, భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజీవ్ హత్య కేసులో దోషుల క్షమాభిక్షనూ, తదనంతర పరిణామాలనూ కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశిం చడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వాల నిర్ణయ రాహిత్యం లేక తమ బాధ్యతను నెరవేర్చకపోవడం వల్లే న్యాయస్థానం పేరరివాళన్ కేసును ఈ విధంగా పరిష్కరించవలసి వచ్చింది.
ఇప్పుడు మిగిలిన ఆరుగురు ఖైదీలకూ ఇదే రకమైన ఉపశమనం లభిస్తుందా లేక వీరి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికీ, తమిళనాడు గవర్నర్‌కూ మధ్య మొరటు ఘర్షణ మళ్లీ మొదలవుతుందా అనేది ప్రశ్న. ఈ విషయంలో విజ్ఞత రాజ్యమేలుతుందనీ, గవర్నర్ కార్యాల యాన్ని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువును చేయబోరనీ ఆశిద్దాం.
వ్యాసకర్త: కె. చంద్రు
మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment