రాజీవ్ హత్య వెనుక ‘రాజకీయం’
రాజీవ్ హత్య వెనుక ‘రాజకీయం’
Published Sat, Nov 30 2013 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య వెనుక రాజకీయం ఉన్నందునే కేసు విచారణ ముగింపులో జాప్యం జరుగుతోందని ఈ కేసులో ముద్దాయి పేరరివాళన్ ఆరోపించారు. వేలూరు జైలులో ఖైదీగా ఉన్న పేరరివాళన్ తన న్యాయవాది చేత చెన్నైలోని టాడా కోర్టులో వేసిన పిటిషన్ గురువారం సాయంత్రం విచారణకు వచ్చింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సీబీఐ ఇంత వరకు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని అతని న్యాయవాది ఎన్ చంద్రశేఖర్ చెప్పారు.పిటిషన్‌లో పేరరివాళన్ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగం అధినేత బొట్టు అమ్మన్‌తోపాటు మరికొందరు నిందితులు ఇంతవరకు పట్టుబడలేదన్నారు.
రాజీవ్ హత్యకేసు విచారణ ముగిసిన తరువాత సీబీఐ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని 1999 జూన్ 17న కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. రాజీవ్ హత్యకేసు విచారణలోని పురోగతిని వివరిస్తూ టాడా కోర్టుకు వీరు ప్రతి నెల ఒక రహస్య నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి లేనందున బాధితునిగా మిగిలానని పేరరివాళన్ కోర్టుకు విన్నవించారు. విచారణ సక్రమంగా సాగితే రాజీవ్ హత్య వెనుకనున్న నిజాలు బయటపడతాయని చెప్పారు.
హత్యలో కొందరు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇంతవరకు విచారించిన వారినే మరోసారి విచారించేలా ప్రత్యేక బృందాన్ని నియమించాలని, ఈ బృందం న్యాయస్థాన పర్యవేక్షణలో సాగేదిగా ఉండాలని ఆయన కోరారు. నిజాలను నిక్కచ్చిగా వెలికితీసేలా వారికి స్పష్టమైన ఆదేశాలు సైతం ఇవ్వాలని కోరారు. పేరరివాళన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై గురువారం సాయంత్రం టాడా కోర్టు న్యాయమూర్తి దండపాణి విచారణ జరిపారు. సీబీఐ తరపున రంగనాథన్, పేరరివాళన్ తరపున ఎన్ చంద్రశేఖర్ వాదించారు. తీర్పును వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు.
Advertisement
Advertisement