సాక్షి, చెన్నై: రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ విడుదలకు సుప్రీంకోర్టు పరోక్షంగా మొగ్గు చూపింది. ఈ మేరకు న్యాయమూర్తి నాగేశ్వ రరావు బెంచ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
నేపథ్యం ఇదీ..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో నింధితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్ సహా ఏడుగురికి తొలుత విధించిన కోర్టు ఉరి శిక్ష విధించింది. కాలక్రమేనా అది యావజ్జీవ శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే శిక్షా కాలం ముగిసినా వీరంతా (30 ఏళ్లుగా) జైలుకే పరిమితమై ఉన్నారు. దీంతో తమను విడుదల చేయాలని కోరుతూ నిందితులు ఒక్కొక్కరిగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. అలాగే, వీరి విడుదలకు గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తుంగలో తొక్కడాన్ని కోర్టుల్లో ప్రస్తావిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులు ఒకరి తర్వాత మరొకరు కోర్టు ద్వారా పెరోల్ పొందే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంలో నిందితులకు అనుకూలంగానే వ్యవహరించింది. ఇక పేరరివాలన్, నళిని ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై బయట ఉన్నారు. అయితే, పెరోల్‌పై బయటకు వచ్చినా, ఇంట్లో నిత్యం పోలీసు పహారా మధ్య కాలం గడపాల్సిన పరిస్థితి ఉందని, ఇది కూడా ఓ జైలుగానే మారిందంటూ పేరరివాలన్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పేరరివాలన్‌కు బెయిల్ లభించింది. అదే సమయంలో తనకు ఈ కేసు నుంచి విముక్తి కలి్పంచాలని కోరుతూ పేరరివాలన్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ నాగేశ్వరరావు బెంచ్‌ముందు విచారణకు వచ్చింది.
విడుదల చేయవచ్చుగా..?
రాజీవ్ హత్య కేసులో పేరరివాలన్ నిందితుడు అన్న విషయంలో సరైన వివరాలు కేంద్రం వద్ద లేదని.. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినా, ఆంక్షలు తప్పడం లేదని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. విడుదల విషయంలో చేసిన తీర్మానంపై గవర్నర్ నిర్ణయం తీసుకోక పోవడం, ఆయన్ని విడుదల చేసే అధికారం కేంద్రానికి ఉందా..? రాష్ట్రానికి ఉందా..? అనే విషయంపై కేంద్ర బృందాలు ఇంకా నివేదిక ఇవ్వకపోవడం వంటి అంశాన్ని గుర్తు చేస్తూ తమ వాదనల్ని వినిపించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఈ చిక్కుల నేపథ్యంలో పేరరివాలన్‌ను విడుదల చేయవచ్చుగా..? అని వ్యాఖ్యనించింది. ఇంతకీ విడుదల అధికారాలు ఎవరికి ఉన్నాయి..? ఈ ఆంక్షల చట్రంలో అతడు ఎందుకు చిక్కుకోవాలి..? అని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment