ప్రపంచమంతా ఏకమైనా తన తీరు మారదని రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి తెలియజెప్పారు. హత్యాయత్నంలో మృత్యువు అంచుల వరకూ వెళ్లి ఆరోగ్యవంతుడై స్వదేశంలో అడుగుపెట్టిన తన రాజకీయ ప్రత్యర్థి నవాల్నీని విమానాశ్రయంలో దిగిన వెంటనే అరెస్టు చేయించారు. 2036 వరకూ అధ్యక్షుడిగా తానే కొనసాగటానికి వీలుకల్పించే రాజ్యాంగ సవరణకు అనుమతి కోరుతూ నిరుడు జూలైలో పుతిన్ నిర్వహించిన రిఫరెండంలో నవాల్నీ ఆయనకు ప్రత్యర్థిగా నిలబడ్డారు. అయితే నవాల్నీకి వచ్చిన ఓట్లు చాలా స్వల్పం. రాజ్యాంగం విధించిన పరిమితుల్ని కూడా అధిగమిస్తూ పుతిన్ గత 22 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. తిరుగులేని నేతగా స్థిరపడ్డారు.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న తరహాలో తన అధికారానికి సవాలుగా నిలుస్తారని భావించినవారిని అడ్డుతొలగిం చుకోవటం పుతిన్‌కు అలవాటైంది. నిరుడు ఆగస్టులో సైబీరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా తన మద్దతుదార్లతో మాట్లాడటానికెళ్లిన నవాల్నీని రష్యా నిఘా విభాగం ఎఫ్‌బీఎస్ వెంటాడి విషప్రయోగం జరిపింది. మాస్కో వెళ్లే విమానం ఎక్కిన ఆయన హఠాత్తుగా కిందపడి కోమాలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన్ను జర్మనీలోని బెర్లిన్‌లో వున్న ఆసుపత్రికి తరలించారు. నవాల్నీపై విషప్రయోగం జరిగిందని అక్కడ నిర్ధారించారు. కోలుకున్నాక నవాల్నీ తనపై జరిగిన హత్యాయత్నంలో ఎఫ్‌బీఎస్ ప్రమేయాన్ని నిరూపిస్తూ గత నెలలో ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో నవాల్నీ ఎఫ్‌బీఎస్ ఏజెంట్‌గా భావిస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి, ఆ విభాగంలోని సీనియర్ అధికారిగా పరిచయం చేసుకుని జరిపిన ఫోన్ సంభాషణలు సంచలనం కలిగించాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్లమంది దాన్ని చూశారు.
తనను అంతమొందించేందుకు పుతిన్ కుట్ర పన్నుతున్నారని నవాల్నీ ఆరోపించారు. అందుకు భయపడేది లేదని, తిరిగి రష్యా వెళ్తానని నవాల్నీ చెప్పినప్పుడు ఆయన్ను చాలామంది ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రభుత్వం నుంచి ముప్పు ఎదురుకావొచ్చని, దీర్ఘకాలం జైలుపాలు కావలసివస్తుందని హెచ్చరించారు. కానీ నవాల్నీ వెళ్లడానికే సిద్ధపడ్డారు. అందరూ అంచనా వేసినట్టే మాస్కోలో దిగగానే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాదిగా పనిచేసే నవాల్నీ 2008లో రాజకీయ రంగప్రవేశం చేసి పుతిన్, ఆయన సహచరుల అవినీతిని బయటపెడుతున్నారు. రెండేళ్లక్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీకి ప్రయత్నించినా ఆయనపై అనర్హత వేటు వేశారు. అంతకుముందూ, ఆ తర్వాత ఆయన అనేకసార్లు అరెస్టయ్యారు.
నవాల్నీని ఈసారి అరెస్టు చేసే సాహసం పుతిన్ చేయకపోవచ్చని అనేకులు అంచనా వేశారు. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ శకం ముగిసి, జో బైడెన్ అధ్యక్షుడిగా రాబోతున్నారు. ఇన్నాళ్లూ పుతిన్‌కు ట్రంప్‌నుంచి ప్రత్యక్ష, పరోక్ష సహకారం బాగానే అందింది. యూరప్ దేశాలు నాటో కూటమిలో భాగస్వాములుగా వున్నా, వారికి పుతిన్ బెడద వున్నకొద్దీ పెరుగుతున్నా ఏనాడూ ట్రంప్ మద్దతుగా నిలబడింది లేదు. ఇప్పుడు బైడెన్ రాకతో ఆ పరిస్థితి మారబోతోంది. అయినా పుతిన్ బేఖాతరు చేశారు. ఈ అరెస్టును ఖండిస్తూ బైడెన్ ట్వీట్ చేశారు. అనేకమంది కాంగ్రెస్ సభ్యులు రష్యాపై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్‌లో దురాక్రమణకు పాల్పడినప్పటినుంచీ యూరప్ దేశాలు పుతిన్‌పై ఆగ్రహంతో వున్నాయి. ముఖ్యంగా జర్మనీ అధినేత ఏంజెలా మెర్కల్ రష్యాపై ఆంక్షలు అమలుకావాలన్న విషయంలో పట్టుదలగా వున్నారు.
నవాల్నీపై హత్యాయత్నం ఉదంతంపై దర్యాప్తు జరిపించి కారకుల్ని శిక్షించాలని ఈయూ చేసిన డిమాండ్‌ను రష్యా మన్నించక పోవటంతో పుతిన్‌కు సన్నిహితంగా మెలిగే కొందరు అధికారులపై ఈయూ ఆంక్షలు విధించింది. వీటిని మరింత విస్తరించాలని మెర్కల్ కోరుతున్నారు. ఇతరత్రా చర్యల గురించి సరిపోతాయన్న ఫ్రాన్స్ సూచనను ఆమె గట్టిగా వ్యతిరేకించారు. ఇప్పుడు నవాల్నీ అరెస్టుతో ఈయూలో మెర్కల్ వాదనకు బలం పెరుగుతుంది. రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేయటానికి జర్మనీ చాన్నాళ్లక్రితం ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం పైప్‌లైన్‌ల నిర్మాణం కూడా సాగుతోంది. తాజా ఉదంతం పర్యవసానంగా ఆ ఒప్పందంపై జర్మనీ మారటోరియం విధించవచ్చన్న ఊహాగానాలు జోరుగా వినబడుతున్నాయి. మెర్కల్ స్థానంలో ఈ మధ్యే సీడీయూ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఆర్మిన్ లాషెట్‌కు కూడా ఈ ఉదంతం ఒక పరీక్షే. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో తోడ్పడే గ్యాస్ కొనుగోలు ఒప్పందాన్ని వదులుకోవటానికి ఆయన ఎంతవరకూ సిద్ధపడతారో చూడాల్సివుంది.
రష్యాలో ప్రత్యర్థుల్ని కుట్ర పన్ని హతమార్చే సంస్కృతి ఎప్పటినుంచో వుంది. అది సోవియెట్ యూనియన్‌గా వున్నప్పుడే అసమ్మతివాదులను ఆజన్మాంత ఖైదు విధించి ప్రవాసానికి పంపటం, దేశం నుంచి బహిష్కరించటం, రహస్య ఏజెంట్లద్వారా అంతమొందించటం వుండేది. పుతిన్ ఆ సంస్కృతినే కొనసాగిస్తున్నారు. రష్యా ఏజెంట్‌గా బ్రిటన్‌లో పనిచేసే సెర్గీ స్క్రిపాల్ ఆ తర్వాత డబుల్ ఏజెంట్‌గా మారి బ్రిటన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం ఎంఐ–6కు రహస్యాలు చేరేసేవాడు. ఈ నేరానికి రష్యాలో అతనికి శిక్ష కూడా పడింది.
అయితే 2010లో బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు స్క్రిపాల్‌ను విడుదల చేసిన రష్యా, అటుతర్వాత బ్రిటన్‌లోనే అతనిపై విషప్రయోగం జరిపి హత్యచేసింది. ఇంకా వెనక్కు వెళ్తే అలెగ్జాండర్ లిత్వినెంకో, వ్యాపారవేత్త బోరిస్ బెరిజోవ్‌స్కీ, మహిళా జర్నలిస్టు అనా పొలిట్కోస్కయా వంటివారెందరో వున్నారు. వీరందరిపైనా అతి ప్రమాద కరమైన విష రసాయనాన్ని ప్రయోగించి హతమార్చారు. రాజ్యమే హంతకిగా మారి ప్రత్యర్థుల్ని మట్టుబెట్టే కుట్రలకు పూనుకోవటం, అక్రమ కేసులతో వారిని శాశ్వతంగా జైలుపాలు చేయాలను కోవటం ప్రమాదకరమైన ధోరణి. ఈ విషయంలో పుతిన్‌ను ప్రపంచ దేశాలు ఏమేరకు నిలువ రించగలవో మున్ముందు చూడాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment