
భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ శకం ముగిసింది. కెప్టెన్‌గా కోహ్లీ ఏడేళ్ల ప్రయాణం స్వల్పకాలమే అయినా... టీం ఇండియాకు తన విలక్షణమైన సారథ్యంతో, మైదానంలో అంతకుమించిన సాటిలేని పోరాట పటిమతో దాన్ని దీర్ఘకాలం గుర్తుంచుకోదగ్గ అధ్యాయంగా మార్చిన ఘనత నిస్సందేహంగా అతనిదే. తనకు ముందు కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోనీ స్థిరపరిచిన ప్రమాణాలు సామాన్యమైనవి కాదు. రెండు ప్రపంచ కప్‌లు అందించినవాడిగా, అద్భుతమైన వికెట్ కీపర్‌గా, సహ ఆటగాళ్లకు మైదానంలో సమర్థవంతమైన మార్గదర్శకత్వం అందించినవాడిగా ధోనీకి మంచి పేరుంది. అతను నిష్క్రమించే సమయానికి భారత్ జట్టు బలహీనంగా ఉంది. అంటే... అటు ధోనీకి దీటుగా ఉన్నాడనిపించుకోవాలి, ఇటు జట్టును కట్టుదిట్టం చేసి విజయ తీరాలకు చేర్చాలి. చాలా త్వరగానే కోహ్లీ తనేమిటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో విమర్శలు ఉండొచ్చు... వివాదాలు ముసురుకొని ఉండొచ్చు. అప్పుడప్పుడు తన దురుసు మాటలతో, చేష్టలతో చాలామందికి కోపం తెప్పించి ఉండొచ్చు. కానీ ఆ అలవాటుకు క్రమేపీ దూరమయ్యాడు. పూర్తిగా ఆటపైనే కేంద్రీకరించి, ఎప్పుడూ తన జట్టు విజయ సాధనే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే 68 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించి, 40 సార్లు విజయం సాధించిపెట్టాడు. ఓడినవి కేవలం పదిహేడు మాత్రమే. అంటే గెలుపు శాతం దాదాపు 59. కెప్టెన్‌గా విదేశీ గడ్డపై ఆడిన 37 టెస్టుల్లో 16 గెలిచి 43.2 శాతం గెలుపు శాతాన్ని సాధించాడు. సౌరవ్ గంగూలీ 39.3 శాతం విజయాలతో ఇతనికి దగ్గరలో ఉన్నా, గంగూలీ నాయకత్వాన ఆడినవి 28 టెస్టులు మాత్రమే. సొంత గడ్డపై జరిగిన 11 సిరీస్‌లనూ కోహ్లీ జట్టు కైవసం చేసుకోగలగడం మరో రికార్డు. కోహ్లీ గొప్పతనం మరొకటుంది. అతను బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా, టీం లీడర్‌గా కూడా నిరూపించుకుని అబ్బురపరిచాడు. దేశంలోనూ, వెలుపలా కూడా తన టీంలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, దాన్ని విజయపథంలో నడిపించడం కోహ్లీ ప్రత్యేకత. కెప్టెన్‌గా ఉంటూ మూడు వరస సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారీ అతని లక్ష్యం విజయసాధనే. తమతో తలపడుతున్న టీంను చూసి... సొంత టీంలోని బలహీనతలను గమనించి... పిచ్ అననుకూలతలను పరిగణించి ఆటను కనీసం డ్రా చేయడానికైనా ప్రయత్నించి బయటపడదామనే కొందరు పాత కెప్టెన్‌ల వైఖరికి కోహ్లీ తీరు భిన్నం. సాహసించి పోరాడితే విజయం ఎందుకు దక్కదన్న పట్టుదల అతని సొంతం. యోధుడిగా ముందుకురకడం, ప్రత్యర్థి శిబిరంలో ప్రకంపనలు సృష్టించడం, గట్టెక్కడం అసాధ్యం అన్న దశలో కూడా దీక్షగా జట్టును నడిపించడం కోహ్లీకే చేతనయింది. గతంలో కొందరు కెప్టెన్ల మాదిరి టీంను బలిపెట్టి సొంత ఇమేజ్‌ను పెంచుకునే తత్వం కోహ్లీలో లేదు. మెరికల్లాంటి సహచరులను ముందుపెట్టి వారితో అద్భుతాలు చేయించిన ఘనత అతని సొంతం. కోహ్లీ ఖాతాలో అన్ని విజయాలు నమోదుకావడం అందుకే.
విజయాలు అందివచ్చినప్పుడు పొంగిపోయి గర్వాతిశయాన్ని ప్రదర్శించడంగానీ, ఓడినప్పుడు తలదించుకుని సాకులు కోసం వెదకడంగానీ చేయలేదు. ఈ కారణంవల్లే కోహ్లీ భిన్నంగా నిలిచాడు. వైఫల్యాలు ఎదురుపడినప్పుడు సైతం తన జట్టును వెనకేసుకొచ్చాడు. మరీ ముఖ్యంగా టీ 20 ప్రపంచకప్–2021లో మన పేసర్ మహ్మద్ షమీని లక్ష్యంగా చేసుకుని, అతని మత విశ్వాసాలను జోడించి కొందరు ఉన్మాదపూరిత వ్యాఖ్యలు చేసినప్పుడు విరాట్ కోహ్లీ అతనికి అండగా నిలిచిన తీరు మరువలేనిది. షమీ పాకిస్తాన్‌కు అమ్ముడుపోయాడని, జట్టు ఓటమికి కారణమయ్యాడని సామాజిక మాధ్యమాల్లో కొందరు విషం కక్కినప్పుడు ‘గతంలో షమీ సాధించిన విజయాలను మరిచారా? మరుగునపడేశారా? మీలాంటివాళ్ల గురించి ఒక్క నిమిషం ఆలోచించినా అది వృథానే’ అంటూ ఇచ్చిన జవాబు అలాంటివారికి చెప్పుదెబ్బ అయింది. ఈ క్రమంలో తన గారాలపట్టిపై అసభ్యకర వ్యాఖ్యలు వినాల్సివచ్చినా కోహ్లీ కుంగిపోలేదు. ఇలా నిక్కచ్చిగా నిలబడటం కొందరిని ఆగ్రహపరిచి ఉండొచ్చు. కానీ కోహ్లీ ఆ బాపతు జనాన్ని బేఖాతరు చేశాడు.
కోహ్లీ తాజా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులేమిటో పూర్తిగా అర్థం కావడానికి మరికొంత సమయం పడుతుంది. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆకస్మికంగా ప్రకటించడం గతంలోనూ జరిగి ఉండొచ్చు. నిష్క్రమించదల్చుకున్న కెప్టెన్ చివరిలో వరస విజయాలు సాధించి, కొన్ని మెరుపులు మెరిపించి క్రీడాభిమానుల మదిలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకోవడం సర్వసాధారణం. కానీ కోహ్లీ ఎంచుకున్న సమయం అందుకు విరుద్ధం. తన కెప్టెన్సీ కింద దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓటమి, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ అయిదో స్థానానికి దిగజా రడం, టీ 20 ఓటమి వంటి అపజయాల పరంపర వచ్చిపడిన వేళ టెస్టు ఫార్మాట్ సారథ్యంనుంచి విరాట్ కోహ్లీ నిష్క్రమించడం బీసీసీఐతోసహా అందరినీ షాక్‌కు గురిచేసింది. బీసీసీఐకి గంగూలీ నేతృత్వం వచ్చాక అతనికీ, కోహ్లీకీ మధ్య తలెత్తిన విభేదాలు ఉన్నకొద్దీ పెరుగుతూ పోవడం, జట్టు సభ్యుల ఎంపికలో సైతం కోహ్లీ మాటకు విలువ లేకపోవడం ఈ పరిస్థితికి కారణం కావొచ్చన్నది కొన్ని కథనాల సారాంశం. ఏదేమైనా భారత క్రికెట్ గమ్యంపై సందేహాలు ముసురుకుంటున్నప్పుడు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం నిస్సందేహంగా నష్టం చేకూరుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని దీన్ని నివారించి ఉంటే బాగుండేది.
Comments
Please login to add a commentAdd a comment