దీర్ఘకాలమే పట్టినా నిరాదరణకు గురైన మహిళా న్యాయమూర్తికి న్యాయం దక్కింది. మధ్యప్రదేశ్‌లో జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేస్తూ ఎనిమిదేళ్ల క్రితం రాజీనామా చేయాల్సివచ్చినామెకు సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమిస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం అసాధారణమైన తీర్పు వెలువరించింది. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా విషయ పరిశీలన చేయాలో, బాధితులపట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో తీర్పు పూర్తి పాఠాన్ని గమనిస్తే అర్థమవుతుంది. మన వ్యవస్థలన్నిటా ప్రచ్ఛన్నంగా అలుముకున్న పురుషాధిక్య భావజాలాన్ని ఈ తీర్పు సరిదిద్దగలిగితే లింగ వివక్ష అంతానికి అది నిస్సందేహంగా దోహదపడుతుంది.
లింగ వివక్ష, వేధింపులు కొత్తేమీ కాదు... అన్నిచోట్లా అవి దర్శనమిస్తూనే ఉంటాయి. కాకపోతే న్యాయదేవత కొలువుదీరే పవిత్రస్థలం కూడా వీటికి మినహాయింపు కాదన్న చేదు నిజమే అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారనీ, లైంగికంగా వేధిస్తున్నారనీ అప్పట్లో మహిళా న్యాయమూర్తి ఆరోపించారు. అభ్యంతరం చెప్పినం దుకు ఇబ్బందులపాలు చేస్తున్నారని అక్కడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. కానీ ఆ కష్టాలు తొలగిపోలేదు సరిగదా ఆమెను గ్వాలియర్ జిల్లానుంచి దూర ప్రాంతానికి బదిలీచేశారు. ఎనిమిది నెలల్లో తన కుమార్తె చదువు పూర్తవుతుందనీ, అప్పటివరకూ బదిలీ ఆపాలనీ, లేదంటే సమీపంలోని నాలుగు నగరాల్లో ఎక్కడికి వెళ్లమన్నా వెళ్తాననీ విజ్ఞప్తిచేశారు. బదిలీ విధానంలోని నిబంధనలు సరిగా పాటించకపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అదంతా అరణ్యరోదనే అయింది. దాంతో విధిలేక ఆమె 2014 జూలైలో ఉద్యోగంనుంచి నిష్క్రమించారు.
ఆ మహిళా న్యాయమూర్తి ఉదంతానికి ముందూ, తర్వాతా కూడా న్యాయవ్యవస్థలో వేధింపుల ఆరోపణలు వినబడ్డాయి. ఆ కేసులు చివరికెలా ముగిశాయన్న సంగతి అలా ఉంచితే, ప్రస్తుత కేసులో బాధితురాలిగా ఉన్న మహిళ పదిహేనేళ్లపాటు న్యాయవాద వృత్తిలో కొనసాగి, జిల్లా అద నపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నవారు. పైగా లైంగిక వేధింపుల కేసుల్ని పరిశీలించే జిల్లా స్థాయి ‘విశాఖ కమిటీ’ చైర్‌పర్సన్. అలాంటి బాధ్యతల్లో ఉన్నామె తానే నిత్యం లైంగిక వేధింపులు ఎదుర్కొనే దుస్థితిలో పడితే ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారా? దీర్ఘకాలం భాగస్వామిగా ఉన్న వ్యవస్థే తనకు అన్యాయం చేసిందంటే తట్టుకోగలుగుతారా? ఫిర్యాదును లోతుగా పరిశీలించి ఉంటే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదిలోనే సమస్యను చక్కదిద్దగలిగేది.
కానీ జరిగిందంతా వేరు. ఆమె పని తీరు ప్రశంసనీయంగా ఉన్నదంటూ అంతకు ఏడాది ముందు ‘వెరీ గుడ్’ గ్రేడ్ ఇచ్చిన ఉన్నత న్యాయస్థానమే ఏకపక్షంగా బదిలీ చేసింది. బదిలీ సంగతలా ఉంచితే ఆ తర్వాత చకచకా జరిగిన పరిణామాలు సర్వోన్నత న్యాయస్థానానికి ఆశ్చర్యం కలిగించాయి. వేధింపుల గురించి వివరించడానికి వ్యక్తిగతంగా కలుస్తానన్న ఆమె చేసిన వినతిని అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ తోసిపుచ్చారు. పైగా ఉద్యోగానికి రాజీనామా చేస్తే కేవలం రెండు రోజుల్లోనే ఆమోదించారు. ఇదంతా ఒక ఎత్తయితే అదే ఏడాది ఆగస్టు 1న ఆమెనుంచి తమకందిన లేఖపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరినప్పుడు వ్యవహరిం చిన తీరు మరో ఎత్తు. ఇద్దరు న్యాయమూర్తులతో ఏర్పాటుచేసిన కమిటీలో తనకు న్యాయం దక్కే అవకాశంలేదని ఆమె మొరపెట్టుకున్నా హైకోర్టు వినలేదు. చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా ఓ కమిటీని నియమించారు.
అయితే ఆమె ఎదుర్కొన్న వేధింపులకు సరైన సాక్ష్యాలు లేవని ఆ కమిటీ తేల్చింది. నిజమే... ‘నీ పనితీరు బాగుంది. అంతకన్నా నీ అందం మరింత బాగుంది’ అని ఒక శుభకార్యంలో న్యాయమూర్తి అంటే అందుకు సాక్ష్యం ఏముంటుంది? ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఎవరూ లేనప్పుడు కోరితే... ‘ఐటెమ్ సాంగ్’కు నృత్యం చేయమని ఒక న్యాయమూర్తి భార్య ద్వారా కబురుపెడితే... ఎవరిస్తారు సాక్ష్యం? ఆమెకు అటెండ ర్‌ని ఇవ్వకపోవడం, స్టెనోగ్రాఫర్ సదుపాయం నిరాకరించడం వేధింపులుగా గుర్తించేదెవరు? చివరకు 2015 మార్చిలో రాజ్యసభ నియమించిన న్యాయమూర్తుల కమిటీ కూడా వాటిని పసిగట్ట లేకపోయింది. బదిలీలో మానవీయతా కోణం లోపించిందని మాత్రం గుర్తించింది. ఆమె తిరిగి సర్వీసులోకి వస్తానంటే అందుకు అవకాశమీయాలని సిఫార్సు చేసింది.
అయినా మధ్యప్రదేశ్ హైకోర్టు తీరు మారలేదు. సర్వీస్‌లో చేరతానన్న ఆమె విన్నపాన్ని 2017, 2018ల్లో తోసిపుచ్చింది. మరోసారి పునఃపరిశీలించాలని, పోస్టులు ఖాళీ లేకపోతే వేరే రాష్ట్రానికైనా బదిలీ చేయాలని 2019లో సుప్రీంకోర్టు కోరినా ఫలితం లేదు. చివరకు ఇన్నేళ్ల తర్వాత ఆమెకు న్యాయం దక్కింది. తీర్పులిచ్చే స్థానంలో ఉన్న మహిళలు కూడా వేధింపులకు అతీతం కారన్న భావన అందరినీ అభద్రతలోకి నెడుతుంది. దీన్ని తన స్థాయిలోనే హైకోర్టు గమనించుకోగలిగితే ఆ మహిళా న్యాయమూర్తికి న్యాయం దక్కడంతోపాటు అన్ని వ్యవస్థల్లోనూ చొరబడ్డ దుశ్శాసనులకు అదొక హెచ్చరికగా ఉండేది. కానీ అందుకు సర్వోన్నత న్యాయస్థానం పూనుకోవాల్సివచ్చింది. ఈ తీర్పు బాధిత మహిళలకు ధైర్యాన్నిస్తుందనడంలో... వేధింపుల కేసుల పరిష్కారంలో వ్యవస్థల కుండాల్సిన పవిత్ర బాధ్యతను గుర్తుచేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
Comments
Please login to add a commentAdd a comment