సింహాలు... గ్రామసింహాలు! | Vardhelli Murali Article On Weekend Roundup | Sakshi
Sakshi News home page

సింహాలు... గ్రామసింహాలు!

Published Sun, Jun 20 2021 1:13 AM | Last Updated on Sun, Jun 20 2021 8:01 AM

Vardhelli Murali Article On Weekend Roundup - Sakshi

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చాలారోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఈ శుక్రవారం నాడు వర్కర్స్‌ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొరియన్‌ ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలను కాపాడేటందుకు అవసరమైతే అమెరికాతో సయోధ్యకైనా, సమరానికైనాసిద్ధమేనని ప్రకటించారట. ఇందులో వింత ఏముంది? ఆయన స్వభావమే అంత. కయ్యా నికి ఎన్నడూ వెనకాడని స్వభావం. ఆయన మాటల్లో వింతేదీ లేదు కానీ, ఆయన ఆకారంలో మాత్రం ఉందట. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కొంచెం సన్నబడ్డారు. అదీ న్యూస్‌.

ఈ ‘కిమ్‌’ పురుషుని పేరు వినగానే మదిలో ఒక 140 కేజీల భారీ ఆకారం మెదులుతుంది. నెత్తిమీద తట్ట బోర్లించినట్టుగా ఉండే డిప్ప కటింగ్‌ హెయిర్‌ స్టయిల్‌. ఫ్యాషన్లకు వ్యతిరేకంగా ఆయన ఈ తరహా కటింగ్‌ను చేయించుకున్నారట. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిది లేటెస్ట్‌ ఫ్యాషన్‌గా మారింది. బుగ్గలు ఆయన స్పెషల్‌ ఫీచర్‌. రెండు దవడల్లో రెండు ఫుట్‌బాళ్లను ఇరికించినట్టు గుండ్రంగా ఉంటాయి. రేడియో స్వర్ణయుగం గుర్తున్నవారికి మర్ఫీ బేబీ ఫొటో గుర్తుంటుంది. ఆ పాలబుగ్గలు గుర్తుంటాయి. కిమ్‌ ముప్ఫయ్యేడేళ్ల మర్ఫీ బేబీ.

అంతర్జాతీయ సమాజాన్నీ, మీడియాను ప్రభావితం చేయడం కోసం అడపాదడపా రకరకాల ‘మేకోవర్‌’లను ఆశ్రయించడం కిమ్‌కు అలవాటే. ఒక్కోసారి సూపర్‌మ్యాన్‌ ఇమేజ్‌ కోసం గుర్రమెక్కి దౌడు తీస్తాడు. అప్పుడు రెండు చేతుల్తో కోటు జేబుల్లోంచి పిస్తోళ్లను తీసుకొని స్వారీ చేస్తూనే కాల్పులు జరిపే కౌబాయ్‌ హీరోగా కనిపిస్తాడు. పార్టీ సమా వేశాల్లో పెద్ద తరహాగా కన్పించడం కోసం చేతిలో కాగితాలు పట్టుకొని కళ్లకు సులోచనాలను ధరిస్తాడు.

‘కిమ్‌’ పురుషుని గుర్రపు స్వారీ దృశ్యాల మీద అమెరికా, యూరప్‌ మీడియాల్లో పెద్ద చర్చే జరిగింది. ఉత్తర కొరియా – చైనా సరిహద్దులో ఉండే మౌంట్‌ పేక్టూ అంటే కొరియన్లకు పవిత్రభావం. హిందువులకు మౌంట్‌ కైలాస్‌ మాదిరిగా (కాక పోతే అది ఇండియాలో లేదు). తమ ‘కిమ్‌’ వంశ ప్రతిష్టను మౌంట్‌ పేక్టూతో పోల్చి చెప్పడం కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు అత్యంత సంతోషకరమైన విషయం. గడిచిన డెబ్బయ్‌ ఐదేళ్లుగా ఈ ‘కిమ్‌’ పురుషులే ఉత్తర కొరియాను పాలిస్తున్నారు కనుక వారి వంశ ప్రతిష్టను అంగీకరించక తప్పదు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు స్వయానా తాతపాదుల వారైన కిమ్‌ ఇల్‌ సంగ్‌ దేశంలో వ్యక్తిపూజను వ్యవ స్థీకృతం చేశారు. ఆయన తనకు తాను ‘గ్రేట్‌ కామ్రేడ్‌’ అనే బిరు దును కూడా ఇచ్చుకున్నారు. తాతగారి స్వార్జితమైన వంశ ‘ప్రతిష్ట’ను తండ్రిగారు భద్రంగా కాపాడి కిమ్‌ జోంగ్‌ చేతిలో పదేళ్ల క్రితం పెట్టారు. అప్పటినుంచి పేక్టూ శిఖరంతో సమాన మైన తమ వంశ గౌరవాన్ని ఈయన కూడా నిలబెట్టు కొస్తున్నారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో మంచు ముసుగువేసుకున్న మౌంట్‌ పేక్టూ వెండి కొండలా వెలిగిపోతుంటుంది. దారికి రెండుపక్కలా ఉన్న చెట్లన్నీ మంచు తెరలు కప్పుకొని వినయంగా నిలబడి ఉంటాయి. మధ్యలోంచి తెల్లని జవనాశ్వంపై గోధుమ రంగు కోటు ధరించిన కిమ్‌ వస్తుంటాడు. తనను తాను అత్యంత శక్తిమంతుడిగా లోకానికి చాటుకోవడానికి కిమ్‌ చేపట్టిన ఇమేజ్‌ మేకోవర్‌గా ఈ దృశ్యాలను పాశ్చాత్య మీడియా విశ్లేషించింది. ఇప్పుడు కిమ్‌ కొంచెం సన్నబడ్డాడు. కారణమేమిటి? ఇదో రక మైన మేకోవరా? లేక మాయరోగమా? పరిశోధనలు జరుగు తున్నాయి.

అపజయాలు వరుసగా ఎదురవుతున్నప్పుడు, లేదా కొత్త విజయాలను సాధించాలనుకున్నప్పుడు, తమ వేషభాషల్లో కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టగల మేకోవర్లను ఇప్పుడు చాలామంది ఆశ్ర యిస్తున్నారు. ఇందులో రకరకాల సెలెబ్రిటీలు, రాజకీయ నాయ కులు ముఖ్యులు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రొఫెషనల్‌ సంస్థలు కూడా ఏర్పడ్డాయి. ఇమేజ్‌ మేకోవర్‌ అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అంశమని ఈ రంగంలోని నిపుణులు చెబు తున్నారు. సదరు సెలెబ్రిటీ శక్తి సామర్థ్యాలకూ, సహజ స్వభావా నికి పూర్తి విరుద్ధమైన ఇమేజ్‌ను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ సెలెబ్రిటీలు అభాసుపాలు కావడం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈమధ్య ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం వేసిన కిల్‌ బిల్‌ పాండే అనే ఒక నిస్పృహకు గురైన పోలీసాఫీసర్‌ పాత్ర గుర్తు కొస్తున్నది. బ్రహ్మానందం పాపులర్‌ కమెడియన్‌. కానీ, ఆ పాత్రేమో కనిపించిన అక్రమార్కులందరినీ విచక్షణారహితంగా కాల్చిపారేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రేక్షకులకు ఒడ లంతా గగుర్పాటు రావాలి. కానీ పగలబడి నవ్వుతారు. అది సినిమా కనుక, దర్శకుడు ఆశించిన హాస్య ప్రయోజనం నెర వేరింది. నిజ జీవితంలో ఇటువంటి మేకోవర్‌ జరిపితే ఎట్లా ఉంటుంది?

జాతీయ టీవీ చానళ్లలో కిమ్‌ తాజా వార్త ప్రసారమైన శుక్రవారం నాడే కొన్ని తెలుగు ‘బ్రాండెడ్‌’ చానళ్లలో ఒక పర్యటన వార్త పదేపదే ప్రసారమైంది. కర్నూలు జిల్లాలో రెండు ఫ్యాక్షన్‌ హత్యలు జరిగాయి. చనిపోయిన వ్యక్తులు తమ పార్టీకి సంబంధించిన వారని చెబుతూ, ఆ పార్టీ అధ్యక్షుని కుమారుడు లోకేశ్‌ నాయుడు పరా మర్శకు వెళ్లారు. అంతవరకు తప్పులేదు. కానీ ఈ సందర్భంగా లోకేశ్‌ నాయు డితో పాటు ఆ బ్రాండెడ్‌ మీడియా బృందం వేసిన వీరంగం చూస్తుంటే పూర్వపు రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే యక్షగానం గుర్తుకొచ్చింది. ‘రాజు వెడలె రవితేజము లలరగా... కుడి ఎడ మల డాల్‌ కత్తులు మెరవగా’ అన్నట్టుగా బ్రాండెడ్‌ చానళ్లు ఈ పరామర్శ కార్యక్రమాన్ని ప్రసారం చేశాయి. ఒక్క హార్మోనియం, మద్దెల దరువే తక్కువ.

లోకేశ్‌ నాయుడు అనగానే తెలుగు ప్రజల మనసుల్లో నాటు కొని పోయిన ముద్ర ఒకటుంది. బొద్దుగా ఉంటాడు. ముద్ద ముద్దగా మాట్లాడతాడు. సంభాషణలో విపరీతంగా తప్పులు దొర్లుతాయి. చాలా సందర్భాల్లో తాను చెప్పదలచుకున్న విష యాన్ని వ్యతిరేకార్థంలో చెబుతుంటాడు. ఆహార ప్రియుడు, నడుము చుట్టుకొలత సాధారణం కంటే ఎక్కువ. ఇత్యాది కార ణాల వలన సోషల్‌ మీడియాలో ఆయనకు పప్పు అనే పేరు స్థిరపడిపోయింది. ఎవరు పెట్టారో తెలియదుకానీ బాగా వైరల్‌ అయింది. ఒక దశలో గూగుల్‌లో పప్పు అని వెతికితే ఈయన బొమ్మ వచ్చేదట. నిజానికి పప్పు అనేది కించపడాల్సిన మాటేమీ కాదు, పైగా మంచి పోషకాహారం కూడా. కానీ, ఎందుకో వారికి ఈ మాట నచ్చేది కాదు. పప్పు అని సెర్చ్‌ చేస్తే తమ బొమ్మ రాకుండా గూగుల్‌తో లాబీయింగ్‌ చేసుకున్నారు.

లోకేశ్‌ నాయుడి ఇమేజ్‌ మార్చడానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు. దొడ్డిదారిన చట్టసభలోకి తీసుకొచ్చి మంత్రిని చేశారు. రెండు కీలకమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారు. పార్టీ ముఖ్యులు, ప్రభుత్వ ముఖ్యులందరూ లోకేశ్‌ను సంప్రదించే విధమైన ఏర్పాటు చేశారు. అతన్నొక సూపర్‌ మ్యాన్‌గా చిత్రీక రించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ ఫలితం సాధించలేకపోయారు. లోకేశ్‌ నాయుడు ఒక ముఖ్యమంత్రికి ఏకైక కుమారుడు, మరో పాపులర్‌ ముఖ్యమంత్రి, సినీరంగ చక్రవర్తిగా వెలిగిన ఒక శిఖరప్రాయునికి మనవడు. కావలసి నంత ఆర్థిక, అంగబలం ఉన్నది. పైగా, ఎమ్మెల్యేగా గెలవడానికి అనేక ప్రాంతాల్లో సర్వేల మీద సర్వేలు చేసుకొని ఏరికోరి మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు. అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై గెలవలేక చతికిలబడ్డారు. కనుక లోకేశ్‌ నాయుడికి ఏర్పడిన ఇమేజ్‌ ఆయన స్వయంగా సంపాదించుకున్న కష్టార్జితమే తప్ప ఎవరో ఆపాదించింది కాదని రూఢీ అయింది.

లోకేశ్‌ నాయుడు ఈ మధ్యకాలంలో కొంత సన్నబడ్డారు. కిమ్‌ జోంగ్‌ ఉన్, లోకేశ్‌నాయుడు ఒకే కాలంలో సన్నబడడం జస్ట్‌ కాకతాళీయమే. ఇద్దరికీ ఏమాత్రం పోలిక లేదు. లోకేశ్‌ నాయుడు తండ్రిగారి మాదిరిగా కొద్దిగా గడ్డం కూడా పెంచారు. ఇదంతా ఏదో రొటీన్‌గా జరిగిన వ్యవహారం కాదు, మేకోవర్‌ శిక్షణలో ఉన్నారనే సంగతి కర్నూలు పర్యటనతో వెల్లడైంది. అక్కడాయన ఆవేశంతో ఊగిపోయారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తీసే తెలుగు సినిమా డైలాగులు వినిపించారు. ఎట్లా మాట్లాడాలనే దానిపై తర్ఫీదైతే తీసుకున్నట్టున్నారు, కానీ తడబాట్లు మాత్రం తప్పలేదు. ముఖ్యమంత్రిపై ఏకవచనం ఉపయోగిస్తూ అసభ్యంగా దూషించారు. హత్యలకు బదులు తీర్చుకునే బాధ్యతను తానే తీసుకుంటానని చూపుడు వేలు విన్యాసంతో హెచ్చ రించారు. మేనమామ బాలకృష్ణతో ఫ్యాక్షన్‌ సినిమాలు తీసే బోయపాటి వంటి వారెవరో స్క్రిప్టు రాసి ఉండవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 29 మంది ప్రాణాలు బలితీసుకున్న పుష్కరాల షూటింగ్‌ దర్శకుడు ఆయనే అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రయోగించిన పదజాలాన్నంతా ఇక్కడ ఉటంకించడం సభ్యత కాదు. చివరగా నేను సింహం లాంటోణ్ణి, ఊరుకోబోనని ప్రకటించారు. అదేదో సినిమాలో హీరో అంటాడు– ‘ఒరేయ్‌ నేను సింహంలాంటోణ్ణి, అది గడ్డం గీసు కోదు. నేను గీసుకుంటా అంతే తేడా.’ ఇక్కడ ఆ తేడా కూడా లేదు. ఈయన కూడా గీసుకోవడం లేదు.

కిల్‌బిల్‌ పాండే పాత్రను నిజజీవితంలో ప్రవేశపెడితే ఏమవుద్ది? శ్రీకృష్ణ పాత్రధారి భుజం మీద గదను పెట్టి, భీముడి వేషధారి చేతికి పిల్లనగ్రోవినిస్తే ఏం బాగుంటుంది?. పప్పు ఇమేజ్‌కి నిప్పు డైలాగులు ఎట్లా నప్పుతాయి? స్క్రిప్టు రాసే వాడికయినా జ్ఞానం ఉండాలి కదా? అతడి కారణంగా లోకేశ్‌ నాయుడి కర్నూలు యాత్ర రసాభాసగా మారింది. అధికారపక్షం ఎదురుదాడితో కుమ్మేసింది. గ్రామాల్లోకి వచ్చి తానో సింహాన్ని అనడం ఏమిటని ప్రశ్నించింది. గ్రామ సింహాలకు వేరే అర్థం ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. సోషల్‌ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. ‘బాబూ... చిట్టీ, ఏమన్నావ్‌ బాబూ’ అనే శ్రీలక్ష్మి డైలాగ్, ‘ఒరేయ్‌ చిట్టినాయుడు... చచ్చి నోడా’ అనే సురేఖవాణి డైలాగ్‌ వైరల్‌గా మారాయి. ఇమేజ్‌ మేకోవర్‌కు పోతే డ్యామేజ్‌ మేకోవర్‌ ఎదురైంది.

ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్షంగా పోరాడేటందుకు రాచ బాట ఉండగా ఈ సందుగొందుల మార్గాన్ని బాబు వారసుడు ఎన్నుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రభుత్వ పథకాలను ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను ఎత్తి చూపవచ్చు. నారాయణ, చైతన్యలుండగా సర్కారు బడుల మీద ఇంత డబ్బు ఎందుకు తగలేస్తున్నారని నిలదీయవచ్చు. ప్రైవేట్‌ ఆస్పత్రులుండగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజాధనాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారని అడగవచ్చు. హెరిటేజ్‌ ఉండగా అమూల్‌ను ఎందుకు తీసుకువచ్చారని ఎండగట్టవచ్చు. అమ్మ ఒడి పేరుతో అంతంత డబ్బును ఎందుకు తగలేస్తున్నారని గదమాయించవచ్చు. అధికారంలోకి వచ్చీరాగానే లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేయదలుచు కున్నారని ఎలుగెత్తి నిలదీయవచ్చు. ఇటువంటి ఎన్నో అవకాశా లను ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు ప్రతిపక్షానికి ఈ అడ్డదారు లెందుకు?. ఎందుకంటే అందుకో కారణం ఉందట.

కర్నూలు రసాభాసకు స్క్రిప్టు రైటర్‌ కారణం కాదనీ, అధి నాయకత్వమే కార్యక్రమాన్ని ఆ విధంగా డిజైన్‌ చేయించిందని ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. టీడీపీ అధి నాయకత్వం రెండంచెల కార్యక్రమాన్ని చేపట్టిందట.  1) చంద్రబాబు వారసుడైన లోకేశ్‌నాయుడు ఇమేజిని క్రమంగా మార్చడం. 2) ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాల నుంచి ప్రజల మనస్సులను దారిమళ్లించడం. ఈ కార్యక్రమానికి పబ్లిక్‌ మైండ్‌ డైవర్షన్‌ ప్రోగ్రామ్‌ (íపీఎమ్‌డీపీ) అనే ముద్దుపేరును పెట్టుకున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల మీదనే జనం మనసు లగ్నమైతే అది పాలక పార్టీకే ప్లస్‌ అవుతుందని తెలుగుదేశం నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. అందువల్ల కులం, మతం, ప్రాంతం, ఫ్యాక్షన్‌ల ఆధారంగా వైషమ్యాలను రెచ్చగొట్టడం, న్యాయస్థానాల్లో పిటీషన్ల ద్వారా అభ్యుదయ కార్యక్రమాలను అడ్డుకోవడం అనే ఎత్తుగడను చేపట్టింది. అందులో భాగంగానే లోకేశ్‌ నాయుడి కర్నూలు పర్యటన. అయితే జనం టీడీపీ అనుకున్నంత అమాయకులు కారు కనుక ఈ పర్యటన సత్ఫలితాలనివ్వలేకపోయింది.

నేను సింహం లాంటోణ్ణి అని చెప్పుకునే వారికి ఆ సింహా నికి ఉన్నపాటి ఇంగిత జ్ఞానమైనా ఉండాలి. తనకంటే ఎంతో బలహీనమైన జంతువును వేటాడేటప్పుడు కూడా సింహం మీసం దువ్వదు. తొడలు కొట్టదు. చాటు మాటున నక్కి నక్కి ఉంటుంది. ఆ జంతువు దూరాన్ని, దాని వేగాన్ని గమనిస్తుంది. ఏ కోణంలో దాడి చేయాలో నిర్ధారించుకున్న తర్వాతనే లంఘిస్తుంది. అలాంటిది ఒక బలమైన ప్రభు త్వంలో ఒక బలహీనమైన నాయకుడు రంధ్రాన్వేషణ చేయాల నుకున్నప్పుడు ఎంత శ్రద్ధా, సహనం ఉండాలి? ఎంత ఓర్పుతో వేచి చూడాలి? అందుకు ఐదేళ్లు కావచ్చు, పదేళ్లు కావచ్చు. ఇరవ య్యేళ్లు కూడా పట్టవచ్చు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement