
హాయిగా ప్రయాణం: నిర్మాణం పూర్తిచేసుకున్న భీమవరం–గరగపర్రు రహదారి
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానమైన భీమవరం–యండగండి రహదారి పనులను సుమారు రూ.15.9 కోట్ల వ్యయంతో సీఆర్‌ఎఫ్ పథకంలో చేపట్టారు. పనులు వేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే దాదాపు గరగపర్రు గ్రామం వరకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది.
జిల్లాలో ప్రధాన రహదారి : భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు ప్రధానమైన ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఆర్టీసీ బస్సులతో పాటు సరుకు రవాణా వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా పంట కాలువ, మురుగు కాలువలు ఉండటంతో తరచూ గోతులు పడుతున్నాయి. రహదారిని పూర్తిస్థాయిలో పటిష్టంగా నిర్మించాలనే డిమాండ్ ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నామమాత్రపు మరమ్మతులతో సరిపెట్టేశారు. ఈ నేపథ్యంలో భీమవరం నుంచి పిప్పర వరకు రోడ్డు సమస్య పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా భీమవరం నుంచి యండగండి వరకు సుమారు 8.56 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.15.9 కోట్లు సీఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇరువైపులా రోడ్డును విస్తరించడంతో పాటు తారుతో పటిష్టంగా నిర్మాణ పనులు చేపట్టారు. భీమవరం నుంచి గరగపర్రు వరకు దాదాపు రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. గరగపర్రు నుంచి యండగండి వరకు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే రోడ్డు రెండువైపులా విస్తరించి మొదటి పొర కంకర వేసి చదును చేశారు. మరో పొర కంకరతో చదును చేసి తారురోడ్డు వేయాల్సి ఉంది. రహదారి పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.