
దాడిలో గాయపడిన విద్యార్థి సంజయ్
జంగారెడ్డిగూడెం: గుర్తుతెలియని వ్యక్తి దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి ధర్మవరపు గోపి తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్ సమీపంలో ఒక భవనం రెండో ఫ్లోర్‌లో ధర్మవరపు గోపి, భార్య, కుమారుడు సంజయ్‌తో ఉంటున్నారు. గోపి ఓ ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగి కాగా, అతని భార్య టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు సంజయ్‌ను అదే స్కూల్‌లో చదివిస్తున్నారు. శుక్రవారం ఉదయం సంజయ్ స్కూల్‌కు వెళ్లడం ఆలస్యం కాగా.. తల్లి స్కూల్‌కు వెళ్లిపోయింది. గోపి సంజయ్‌ను స్కూల్ వద్ద దింపేందుకు ఇంటికి వెళ్లాడు. అయితే సంజయ్ ఇంటి వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉండటాన్ని గమనించి వెళ్లి చూడగా, చేతి మణికట్టు, మెడపై కోసిన గాయాలు కనిపించాయి.
వెంటనే సంజయ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బ్లేడ్‌తో దాడి చేసి చేతిపై మెడపై కోశాడన్నారు. తప్పించుకునేందుకు తాను ప్రతిఘటించానని, చేతికి అందిన వస్తువులు అతనిపై విసిరివేయడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడన్నారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గోపి తెలిపారు.