ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల స్థానంలో దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులను తీసుకొని భవిష్యత్తులో ఆర్టీసీలను కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకం వేసిందనీ, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం– ఈ బస్సు స్కీము కూడా ఇందులో భాగమే అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలనీ, ఈనెల 24న ఢిల్లీలో భారీ ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, ఎస్‌బీ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ ప్రసాద్, టీకే రావు తదితరులు పాల్గొన్నారు.