
ఆర్టీసీకి స్పెషల్ ఆదాయం
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ గత ఐదేళ్లుగా మంచి ఆదాయంతో దూసుకుపోతోంది. పండుగలకు, తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జిల్లాలోని భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి ఏటా సంక్రాంతి, దసరా పండగలతోపాటు కార్తీక మాసంలో, అరుణాచలం తదితర తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ప్రజలకు ఆర్టీసీ బాగా చేరువైంది.
రికార్డు స్థాయిలో ఆదాయం
గత ఐదేళ్లుగా ఆర్టీసీ మంచి ఆదాయాన్ని సాధించింది. 2020లో ఏడాదికి రూ.48 లక్షల ఆదాయం సాధించగా.. 2024 నాటికి ఏడాదికి రూ.కోటి ఆదాయం ఆర్జించే స్థాయికి చేరింది. ఏటా సంక్రాంతికి ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి హైదరాబాద్‌కు పది రోజుల పాటు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రికార్డు స్థాయిలో రూ.99 లక్షల ఆదాయాన్ని సాధించింది. ఈ ఏడాది పంచారామాల ప్రత్యేక బస్సు సర్వీసులు నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.1.50 కోట్లు దాటనుంది.
ప్రైవేటు బస్సుల దందాకు చెక్
పండుగ సీజన్లు తీర్థయాత్రలకు ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేసేవి. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులతో టిక్కెట్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారు కోరుకున్న తీర్థయాత్రలకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు వల్ల ప్రైవేటు బస్సుల టిక్కెట్ దందాకు చెక్ పెట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల ద్వారా గత 5 ఏళ్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా విపత్తు రెండేళ్లలో కూడా సంక్రాంతి, దసరా, ఇతర తీర్థ యాత్రలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు.
ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.5 కోట్ల రాబడి
ఈ ఏడాది సంక్రాంతికి రూ.99.30 లక్షల ఆదాయం
పండగలు, యాత్రలకు ప్రత్యేక సర్వీసులతో ప్రైవేటు దందాకు చెక్
గత ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ఆదాయం
ఏడాది సంక్రాంతికి ఇతర సర్వీసులు
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
2020 36.93 11.80
2021 36.88 28
2022 54.62 30
2023 60 35
2024 70 40
2025 99.51
ప్రత్యేక బస్సులతో మంచి ఆదాయం
పండగలు, తీర్థ యాత్రలకు, దైవ దర్శనాలకు జిల్లాలోని 4 డిపోల నుంచి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సర్వీసుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసిని జిల్లా ప్రజలకు మరింత చేరువ చేసేలా టిక్కెట్ ధరలు పెంచకుండానే అన్ని పండుగలకు బస్సులు ఏర్పాటు చేసి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాం. సంక్రాంతి, దసరా పండుగలకు హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం.
ఎన్‌వీఆర్ వర ప్రసాద్, జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి

ఆర్టీసీకి స్పెషల్ ఆదాయం