
సమ్మె బాటలో మీటర్ రీడర్లు!
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యుత్ మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టనున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ విద్యుత్ మీటర్ల రీడర్లు గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై యూనియన్ నాయకులు పెనుమాక జాకబ్, వంశీ, శేఖర్, శ్రీనివాస్, రమణ గురువారం విశాఖపట్నంలో సీఎండీతో చర్చలు జరిపారు. అయితే అవి విఫలం కావడంతో రీడర్స్ యూనియన్ నాయకులు కార్యాచరణలో భాగంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు.
వినియోగదారులపై భారం
ప్రతి నెలా 1 నుంచి 12వ తేదీ లోపు మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్లి విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయాల్సి ఉంది. విద్యుత్ మీటర్లు సమ్మెబాట పట్టి, విద్యుత్ అధికారులు ప్రత్యామ్నాయా ఏర్పాట్లు చేయకుంటే బిల్లుల శ్లాబ్ రేట్లు మారిపోయి అదనపు భారం పడే అవకాశం ఉండడం వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 5,700 మంది మీటర్ రీడర్లు ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో 750 మంది రీడర్లు ఉన్నారు. వీరు సమ్మె బాట పడితే 20 లక్షల సర్వీస్‌లకు ఇబ్బందులు కలగనున్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళితే తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
ముగియనున్న కాంట్రాక్టర్ల గడువు
ఇదిలా ఉంటే విద్యుత్ మీటర్లకు సంబంధించి కాంట్రాక్టర్ల గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి కాంట్రాక్టు మొదులుకాగా ఈనెలాఖరికి రెండేళ్ల గడువు తీరనున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పొడిగింపు ఇవ్వలేదని వారు అంటున్నారు. మీటర్ రీడర్లు సమ్మె చేస్తే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. దీనిపై విద్యుత్ తాడేపల్లిగూడెం డివిజన్ ఈఈ కె.నరసింహమూర్తిను వివరణ కోరగా మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళుతున్నట్లు తమకు ఇంకా తెలియదన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్టర్లు వచ్చే నెలలో కూడా మీటర్లు రీడింగ్ తీసేందుకు సమ్మతి ఇచ్చారని ఎస్‌ఈకు పంపామని, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు రావని వివరించారు.
ఏపీఈపీడీసీఎల్ సీఎండీతో విఫలమైన చర్చలు
వచ్చే నెల 1 నుంచి సమ్మె ఆలోచన
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే వినియోగదారులపై భారం