
తణుకు చరిత్రలో చీకటి రోజు
మాజీ మంత్రి కారుమూరి
అత్తిలి: కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ఇది ఒక బ్లాక్ డే అని, తణుకు నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి దారుణ ఘటన ఎన్నడూ జరగలేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీపీ ఉప ఎన్నికకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకుండా కూటమి మూకలను ఉసిగొల్పడంపై గు రువారం ఆయన అత్తిలిలో మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి ఎస్పీ, డీఎస్పీ, సీఐ అందరికీ ఫోన్ చేసినా కానీ.. ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. తమ ఎంపీటీసీ సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, తాము ఎవరినీ తీసుకుపోలేదని, తమ మ్యాండెట్‌పై గెలిచినవారని తెలిపారు. తమవారినే ఇద్దరిని వారు తీసేసుకున్నారని అన్నారు. ఎన్నికలకు వెళ్లాల్సిన తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను కూటమి నేతలు దౌర్జన్యంగా రౌడీలను పెట్టి అడ్డుకున్నారని, తన ఇంటిపైకి వచ్చి రౌడీయిజం చేశారని చెప్పారు. చివరికి మహిళలని కూడా చూడకుండా తోసేసి దుర్మార్గంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున ఎంపీపీగా చేసిన మక్కా సూర్యారావును మభ్యపెట్టి తీసుకున్నారని, అయినా తాము మాట్లాడలేదని, నేడు దుర్మార్గంగా ఎన్నికకు వెళ్లకుండా సభ్యులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ‘మీకు 6 ఉంటే, మాకు 13 ఉన్నాయి.. అయినా సరే దా రుణాతి దారుణంగా రౌడీయిజంతో దుర్మార్గం చేశా రు.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.. అసలు పోలీస్ వ్యవస్థ టోటల్‌గా విరుద్ధంగా అయిపోయింది.. టోటల్ ఫ్లాప్.. ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరించారు.. ఇంత దౌర్జన్యం చేస్తున్నా, ఆడవాళ్లను తోసేస్తున్నా ఎస్పీ, డీఎస్పీ, సీఐ ఒక్కరు కూడా ఇక్కడి రాలేదు.. నేను మాజీ మంత్రిని, నేను ఫోన్ చేసినా, చాలా మంది కౌన్సిల్ చైర్మన్‌లు ఫోన్‌లు చేసినా స్పందించలేదు, ఫోన్లు కూడా ఆపేశారు.. ఇది చాలా దుర్మార్గమైన, హేయమైన చర్య..’ అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకష్ణ చేసే దుర్మార్గాలకు చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు వస్తాయని కారుమూరి స్పష్టం చేశారు.