
హత్య కేసులో నిందితుడి అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ వెన్నవల్లి వారిపేట ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును ఏలూరు వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు వివరాలు వెల్లడించారు. చనపతి రమణమ్మ అలియాస్ చిట్ల రమణమ్మ (65) ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తూ చీటి పాటలు వేస్తూ ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈనెల 27న వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆధారాలు లభించకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. మెడలోని బంగారు ఆభరణాలతో పరారయ్యారు. వన్‌టౌన్ సత్యనారాయణ పేట కమ్యూనిటీ హాలు ప్రాంతంలో ఉంటున్న చనపతి దుర్గాప్రసాద్ రమణమ్మ వద్ద చీటి పాటలు వేశాడు. చీటీ పాడుకుని సుమారు రూ.2 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. డబ్బుల కోసం రమణమ్మ అనేకసార్లు దుర్గాప్రసాద్‌ను మందలించింది. దుర్గాప్రసాద్ తన ఉంగరాన్ని తాకట్టుపెట్టి మరో రూ.30 వేల వరకు అప్పు తీసుకున్నాడు. ఈ నెల 27న సాయంత్రం డబ్బులు విషయం మాట్లాడేందుకు రమణమ్మ వద్దకు వెళ్ళాడు. రమణమ్మ తిట్టడంతో ఒక్కసారిగా రమణమ్మపై దాడి చేశాడు. నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేశాడు. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం కాళ్ళు, చేతులు కట్టేసి ఆధారాలు లభించకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుర్గాప్రసాద్‌ను ఈనెల 30 న ఏలూరు నగరంలోని పంపుల చెరువు రోడ్డులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి నుంచి సుమారు 57 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1000 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి వద్ద హాజరుపరచగా రిమాండ్ విధించారు. కేసును చేధించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అభినందించారు.