
గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 11వ పీఆర్‌సీ గడువు ముగిసి 21 నెలలు అయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఆందోళన నెలకొందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా దీని ఊసే లేకపోవడం శోచనీయమన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2004, సెప్టెంబరు 1 నాటికన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్‌తో నియామకమైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో ఇచ్చినా రాష్ట్రంలో ఇప్పటికీ అమలు చేయని పరిస్థితి కొనసాగడం బాధాకరమన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏను 90 శాతం నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండగా.. పెండింగ్ ఉందన్నారు. ఇంకా మూడు డీఏలను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందన్నారు. సీపీఎస్, జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జి.మోహానరావు, కార్యదర్శి ఎం.ఆదినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.మనోజ్, జేఏసీ కన్వీనర్ నెరుసు రామారావు, డిప్యూటీ సెక్రటరీ ఎం.శామ్యూల్, కోశాధికారి ఎస్‌డి జిలానీ తదితరులు పాల్గొన్నారు.