
ఏలూరును అరగగామిగా నిలపాలి
జిల్లా ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి
ఏలూరు(మెట్రో): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో బుధవారం కలెక్టర్‌తో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి, జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రగతిపథంలో నిలపాలన్నారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం పెంపొందించేందుకు రైతులకు ప్రభుత్వం అందించే చేయూతపై అవగాహన కలిగించి, మరింత విస్తీర్ణంలో సాగుచేసేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ,పాపికొండలు, కొల్లేరు ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి, ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 2.50 లక్షల ఉత్పత్తులు ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు జరిగి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారని, 50 ఉత్పత్తుల అమ్మకాలతో ఏలూరు జిల్లా మూడవ స్థానం సంపాదించిందన్నారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రగతిని సాగిస్తున్నామని, ఉద్యానవన పంటలలో ఆయిల్ పాం అధిక విస్తీర్ణంలో సాగవుతుందన్నారు.
గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తి చేయాలి
జిల్లాలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పేదల గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. మే 31 నాటికి 13,525 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఇంతవరకు 6,832 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యిందని, వేసవిలో అనుకూలమైన వాతావరణం ఉంటుందని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కాలువలు కట్టేలోగా మంచినీటి చెరువులన్నింటిని నింపుకోవాలన్నారు. ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో నిర్మించిన తాగునీటి సదుపాయాలు, టాయిలెట్లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.