
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్ సెషన్–2 పరీక్షలు బుధవారం నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 167 మందికి 157 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగిన పరీక్షకు 143 మందికి 127 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
భీమవరం: భీమవరంలో బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని డీఎన్నార్ కళాశాలలో ఉదయం షిప్ట్‌లో 100 మందికి 93 మంది, మధ్యాహ్నం షిప్ట్‌లో 100 మందికి 95 మంది హాజరయ్యారని పరీక్షల పర్యవేక్షకుడు సూర్యనారాయణమూర్తి చెప్పారు.
9న ఉండిలో ఆక్వా రైతుల సమావేశం
భీమవరం: ఆక్వా సమస్యలపై చర్చించడానికి ఈ నెల 9న అప్సడా, ఆక్వా రైతుల సమావేశం ఏర్పాటుచేసినట్లు జిల్లా ఫ్రాన్స్‌ఫార్మర్స్ వెల్పేర్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.గజపతిరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు చెప్పారు. బుధవారం భీమవరంలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఆక్వా రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సివుందన్నారు. 9వ తేది ఉదయం 10 గంటలకు ఉండి గ్రామంలోని కోట్ల ఫంక్షన్‌హాల్లో నిర్వహించే సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నందున ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
ఇళ్ల స్థలాల కోసం ధర్నా
భీమవరం: పేదల ఇళ్లస్థలాలకు సంబంధించి ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ తక్షణం నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, డీఆర్‌ఓకు ఆర్జీలు సమర్పించారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తొమ్మిది నెలలు గడిచిపోయినా హామీలను అమలు చేయలేదన్నారు. సత్వరమే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్‌ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తమరాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి
భీమవరం: మున్సిపాలిటీల ద్వారా ప్రజలకు అందించే సేవల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశించిన కార్మికుకు చేదు అనుభవం ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేవలను ప్రైవేటుపరం చేస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు