
కోకో రైతులను ఆదుకోవాలని వినతి
ఏలూరు (టూటౌన్) : కోకో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమను ఆదుకోవాలని కోరుతూ గురువారం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడుని కలిసి వినతిపత్రం అందజేసింది. గురువారం ఈమేరకు అమరావతి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయడు సమక్షంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ఉద్యాన శాఖ ఉన్నతాధికారుల సంయుక్త సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రైతు సంఘ నేతలు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేయాలని, అన్ సీజన్ గింజలు వెంటనే కొనుగోలు చేసి కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోకో రైతులను మోసం చేస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విదేశీ కోకో గింజల దిగుమతులు ఆపాలని, దేశీయంగా రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈనెల 7వ తేదీ లోపు కంపెనీలు తమ నిర్ణయాన్ని చెప్పాలని మంత్రి ఆదేశించారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకుంటుందని, కోకో రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పానుగంటి అచ్యుతరామయ్య, బోళ్ళ వెంకట సుబ్బారావు, కోనేరు సతీష్ బాబు, గుది బండి వీరారెడ్డి, జాస్తి కాశీ బాబు, డి.నరేష్, కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్, ఉప్పల కాశీ తదితరులు పాల్గొన్నారు.