
వ్యసనాలకు బానిసలై.. పోలీసుల అవతారమెత్తి..
వసూళ్లకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్
ఏలూరు (టూటౌన్): వ్యవసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ పోలీసుల అవతారం ఎత్తిన నలుగురు వ్యక్తుల ఆట కట్టించారు పోలీసులు. ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యప్రకాశరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం పావులవారిగూడెంకు చెందిన మాండ్రు డేవిడ్ లక్ష్మీనగర్ హైవే పక్కన టీస్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 1న రాత్రి 11.30 గంటలకు నలుగురు వ్యక్తులు కారులో వచ్చి పోలీసులమని చెప్పి డేవిడ్‌ను బెదిరించారు. రాత్రి సమయంలో షాపు ఎందుకు తెరిచావంటూ, కేసు పెడతామని బెదిరించారు. రూ.1,000 ఇస్తే కేసు లేకుండా వదిలేస్తామనడంతో డేవిడ్ ఆ మొత్తాన్ని వారికి ఇచ్చాడు. ఇదే సమయంలో స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు రావడంతో వారంతా కారులో ఉడాయించారు. దీనిపై బాధితుడు ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఈనెల 3న భీమడోలు జంక్షన్ వద్ద ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించేందుకు పోలీస్ యూనిఫారం కుట్టించుకుని నకిలీ పోలీసుల అవతారం ఎత్తినట్టు విచారణలో తేల్చారు. భీమడోలు మండలం పూళ్లకి చెందిన బుంగా ప్రశాంత్, పెరికె సురేంద్రకుమార్, కోరపాటి రోహిత్, ఉంగుటూరుకి చెందిన గొల్లా సురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కారు, పోలీస్ లోగోతో కూడిన యూనిఫాం, విజిల్ గార్డ్, పోలీస్ బెల్ట్, లాఠీని స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. భీమడోలు, ద్వారకా తిరుమల స్టేషన్ల సిబ్బందిని అభినందించారు.