
గ్యాస్, పెట్రో ధరలు తగ్గించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్రం ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద న్యూడెమోక్రసీ, ఇఫ్టూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నాని ఉద్దేశించి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరగకపోయినా అమాంతంగా ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రజలకు సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాటు చేయకుండా భారం వేస్తున్నారని ధరలను బేషరతుగా రద్దు చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రావు డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్‌తో పాటు అనేక హామీలు అమలు చేస్తామని చెప్పారని, ఇంతవరకూ పెన్షన్ మినహా ఏదీ అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఇఫ్టూ నగర కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, పీడీఎస్‌యూ జిల్లా ప్రెసిడెంట్ కాకి నాని, ఇఫ్టూ ఏలూరు నగర సహాయ కార్యదర్శి గడసల రాంబాబు తదితరులు మాట్లాడారు.