
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
తాడేపల్లిగూడెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అర్జున అవార్డు గ్రహీత, జాతీయ కబడ్డీ క్రీడాకారిణి రీతూ నేగి అన్నారు. ఏపీ నిట్‌లో బుధవారం ఆమె వార్షిక క్రీడాసంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీతూ నేగి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి క్రీడల్లో రాణించి అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను 17 సంవత్సరాల నుంచి కబడ్డీ ఆడుతున్నానని, దేశం తరుఫున ఆడటాన్ని గర్విస్తున్నానన్నారు. 2022లో ఆసియా క్రీడల్లో భారతీయ కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు స్వర్ణపతకం సాధించడం చాలా ఆనంందంగా ఉందన్నారు. గౌరవ అతిధి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఫోన్లకే పరిమితం కాకుండా కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తూ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సచిన్, ధోని స్ఫూర్తితో అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. గౌరవ అతిధి కబడ్డీ క్రీడాకారిణి పింకీ రాయ్ మాట్లాడుతూ క్రీడలపై మక్కువతో సాధనచేస్తే ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, డీన్‌లు రవికిరణ్‌శాస్త్రి, వీరేష్‌కుమార్, అసోసియేట్ డీన్‌లు శ్రీనివాసన్, రాజేశ్వరరెడ్డి, కిరణ్ తీపర్తి తదితరులు పాల్గొన్నారు.