
శుభలేఖలు పంచి వస్తూ.. అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృతి
దెందులూరు: మండలంలోని కొమిరేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం అనంతపల్లి గ్రామానికి చెందిన గురుమిల్లి అప్పారావు, నిడమర్రు గ్రామానికి చెందిన పతివాడ బాపన్న వరుసకు బావ, బావమరిదిలు. వీరు బాపన్న కుమారుడు వివాహ శుభలేఖలు ఇవ్వడానికి బైక్‌పై దెందులూరు వచ్చారు. శుభలేఖలు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా కొమిరేపల్లి సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఓ కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుమిల్లి అప్పారావు(47) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ పతివాడ బాపన్న(50) ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ వివరించారు.