
హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
భీమవరం: పట్టణంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యు.స్వర్ణకుమారి (19) కళాశాల హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణకుమారి గురువారం తరగతులకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండి తన స్నేహితుడికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతడు కళాశాలలోని తన స్నేహితులకు చెప్పడంతో హాస్టల్ గదికి వెళ్లేసరికి స్వర్ణకుమారి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేళ్లాడుతూ కనిపించింది. హుటాహుటిన చికిత్స కోసం ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె స్నేహితులతో టూర్ వెళ్లడానికి ప్లాన్ చేసుకోగా తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై రూరల్ సీఐ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు.
నేషనల్ క్రికెట్ టీంకు క్రీడాకారుడి ఎంపిక
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణం బ్రాడీపేట ప్రాంతానికి చెందిన షేక్ సమీరుద్దీన్ నేషనల్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఇండో–నేపాల్ కప్ చాంపియన్‌షిప్–2025 క్రికెట్ టోర్నమెంట్‌కు ఇండియా తరఫున ఆడేందుకు నైన్ ఏ సైడ్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సంస్థ నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు వచ్చినట్లు సమీరుద్దీన్ తెలిపాడు. ఈ టోర్నమెంట్ మే 26 నుంచి 31 వరకూ నేపాల్‌లో ఆరురోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చైతన్య కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాని పేర్కొన్నారు. అలాగే పీడీ రామకృష్ణ, మణికంఠల శిక్షణలో తర్ఫీదు పొందుతున్నానని వివరించాడు. త్వరలో క్రికెట్ అకాడమీకి పిలుస్తామని సిద్దంగా ఉండాలని నైన్ ఏ సైడ్ సంస్థ సభ్యులు సమాచారం ఇచ్చినట్లు సమీరుద్దీన్ తెలిపారు.
బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ
ఏలూరు రూరల్: ఏలూరుకు చెందిన కంఠం సాయితరుణ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడని శిక్షకుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు బదిరెడ్డి రామ్‌ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1న బైలాస్‌పూర్‌లో ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జూనియర్ మిస్టర్ ఇండియా చాంపియన్‌షిప్ పోటీల్లో 80 కేజీల విభాగంలో తృతీయస్థానం సాధించాడని వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర పోటీల్లో సైతం చాంపియన్స్ ఆఫ్ ది చాంపియన్స్‌గా నిలిచి ఓవరాల్ టైటిల్ కై వసం చేజిక్కించుకున్నాడని హర్షం వ్యక్తం చేశారు.

హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య