
పీజీ సెంటర్‌లో కూలుతున్న అకడమిక్ బ్లాక్ భవనం
నూజివీడు: పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీకి చెందిన పీజీ కేంద్రంలోని అకడమిక్ బ్లాక్ భవనం ద్వితీయ అంతస్తు స్లాబు బుధవారం కూలిపోయింది. ఈ సమయంలో పైన పెద్ద శబ్దం రావడంతో కింది అంతస్తులో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై భవనంపై నుంచి కిందకు పరుగులు తీశారు. ఈ అంతస్థు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో గత ఏడాది కాలంగా ఈ భవనంలోని గదుల్లో తరగతులు నిర్వహించడం లేదు. దానంతట అదే కూలిపోక ముందే, ఎలాంటి ప్రమాదం చోటు చోసుకోకముందే ఈ భవనం పై అంతస్థును కూల్చేయాలని పీజీ సెంటర్‌లోని అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పలుమార్లు యూనివర్శిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పందించడం లేదు. గత నెలలో పీజీ కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా యూనివర్శిటీ వీసీ ఆచార్య కూన రాంజీ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇప్పటికై నా పై అంతస్తును కూల్చివేయాలని పీజీ కేంద్రం విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.