
రీ–సర్వేపై కేంద్ర బృందం పర్యటన
తాడేపల్లిగూడెం అర్బన్/తాడపల్లిగూడెం రూరల్/ పెంటపాడు : ప్రజలకు చెందిన స్థిరాస్తుల వివరాలు పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రీ–సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి, యశడా డైరెక్టర్ జనరల్ నిరంజన్ కుమార్ సుధానుసు తెలిపారు. ఈ సందర్భంగా భూముల రీ–సర్వేపై స్థానిక నిట్ కాన్ఫరెన్స్ హాలులో కేంద్రభుత్వం నుంచి వచ్చిన బృందం జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన రీ–సర్వేపై చర్చించారు. ఇప్పటి వరకు పూర్తిచేసిన రెండు విడతల రీసర్వేలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించిన వివరాలపై సమీక్షించారు. తాడేపల్లిగూడెంలోని 23వ వార్డులో రీసర్వే నిర్వహించిన ప్రాంతాల ప్రజలతో చర్చించి వారి నుంచి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలోని రెండో ప్రపంచ యుద్ధ అవసరాలకు వినియోగించిన విమానాశ్రయ భూముల్లో సుమారు 4 వేల కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయన్నారు. ఆయా భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ బృందానికి తెలియజేశారు. అలాగే మండలంలోని చినతాడేపల్లి గ్రామానికి చెందిన అక్కిన గంగాభవాని నివాసం వద్ద కడియద్ద రెవెన్యూకు సంబంధించిన రీ–సర్వేపై రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పెంటపాడు మండలంలోని కె. పెంటపాడు బైరాగిమఠంలో నిర్వహించిన సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ డీఎల్‌బీఎల్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విద్యులత, ఐఏఎస్ అధికారి ఆర్‌ఎం గోవిందరావు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కౌసర్‌భానో, ఆర్‌డీ బాలస్వామి, మున్సిపల్ కమిషనర్ వై.ఏసు పాల్గొన్నారు.