యూపీఐ సేవలు నిలిచిపోవడంతో గగ్గోలు | - | Sakshi
Sakshi News home page

యూపీఐ సేవలు నిలిచిపోవడంతో గగ్గోలు

Published Sun, Apr 13 2025 1:11 AM | Last Updated on Sun, Apr 13 2025 1:11 AM

యూపీఐ

యూపీఐ సేవలు నిలిచిపోవడంతో గగ్గోలు

ఏలూరు (టూటౌన్‌): యూపీఐ సేవలు నిలిచిపోవడంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫోన్‌ పే, పేటీఎం, గూగుల్‌ పే డౌన్‌ అవడంతో సేవలు అందుబాటులో లేవు. దీంతో డిజిటల్‌ లావాదేవీలు నిలిచిపోవడంతో చాలాచోట్ల యూజర్లు పేమెంట్లు చేయలేకపోయారు.

స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని ఒక బిర్యానీ హోటల్‌కు వచ్చిన ఇద్దరు యువకులు బిర్యానీ తిన్నాక ఫోన్‌ పే ద్వారా డబ్బులు చెల్లిద్దామంటే స్కానర్‌ పనిచేయలేదు. క్యాష్‌ ఇద్దామంటే జేబులో సరిపడా సొమ్ములు లేవు. దీంతో ఫోన్‌తో చాలా సేపు కుస్తీ పట్టిన సదరు యువకులు బిక్క మొహం వేశారు. చివరకు అందులోని ఒక యువకుడి సోదరుడికి ఫోన్‌ చేసి రమ్మని డబ్బులు కట్టారు.

స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని ఒక వస్త్ర దుకాణంలోకి వచ్చిన మహిళ తనకు నచ్చిన దుస్తులు కొనుగోలు చేసింది. క్యాష్‌ కౌంటర్‌కు వచ్చి డిజిటల్‌ పేమెంట్‌ చేసేందుకు ప్రయత్నించగా యూపీఐ సర్వర్‌ స్లోగా ఉండటంతో మనీ ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు చూపినా అవి దుకాణదారుడి ఖాతాలోకి రాలేదు. దీంతో ఆమె ఇంటి నుంచి కుటుంబ సభ్యులను రప్పించి నేరుగా క్యాష్‌ చెల్లించాల్సి వచ్చింది.

ఇలాంటి సన్నివేశాలు శనివారం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా డిజిటల్‌ లావాదేవీలు డౌన్‌ అయితే పరిస్థితి ఏంటనే దానిపై శనివారం జిల్లా వాసులకు స్పష్టత వచ్చింది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)లో శనివారం టెక్నికల్‌ ప్రాబ్లం రావడంతో డిజిటల్‌ పేమెంట్స్‌ నిలిచిపోయాయి. జిల్లాలో చాలా మంది వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులకు వీలుకావడం లేదని ఫిర్యాదులు చేశారు. పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లు పనిచేయడం లేదని వినియోగదారులు గగ్గోలు పెట్టడం కన్పించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో 66 శాతం యూజర్లకు పేమెంట్‌ చేసే సమయంలో సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. మరో 34 శాతం మంది ఫండ్‌ టాన్స్‌ఫర్‌ కావడం లేదని రిపోర్ట్‌ చేశారు.

జిల్లాలో 10 లక్షలకు పైగా వినియోగదారులు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 లక్షల వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరిలో 10 లక్షల మంది వరకు డిజిటల్‌ లావాదేవీలైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి వాటిని వినియోగిస్తున్నారు. డిజిటల్‌ లావేదేవీలు పెరగడంతో కనీసం రూ.10 కూడా డిజిటల్‌ పేమెంట్‌ చేస్తున్నారు. దీంతో జేబులో, పర్సులో డబ్బులు లేకుండానే యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వరుసగా బ్యాంకులకు మూడు రోజులు సెలవులు రావడం, శనివారం మధ్యాహ్నం నుంచి డిజిటల్‌ సేవలు మొరాయించడంతో ప్రజలకు తమ వెంట నగదు తెచ్చుకోకపోతే పరిస్థితి ఏంటనేది అర్థమైంది.

యూపీఐ సేవలు నిలిచిపోవడంతో గగ్గోలు 1
1/1

యూపీఐ సేవలు నిలిచిపోవడంతో గగ్గోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement