
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
భీమడోలు: మండలంలోని పోలసానిపల్లిలో రాష్ట్ర రహదారి పక్కన ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం వేకువజామున ఘోర అవమానం జరిగింది. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. దీంతో దళిత యువకులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అంబటి దేవి వారితో కలిసి నినాదాలు చేశారు. దీంతో వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో భీమడోలు, దెందులూరు ఎస్సైలు వై.సుధాకర్, సుధీర్, సిబ్బంది వచ్చి చర్చించగా ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. నిందితులు ఎంతటి వారైనా సాంకేతికత సాయంతో పట్టుకుంటామని, సంయమనం పాటించాలని సీఐ కోరడంతో ఆందోళన విరమించారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీములు విచారణ చేపట్టగా పోలీస్ జాగిలం విగ్రహానికి పక్క రోడ్డులోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. దీంతో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు గ్రూపుల మధ్య విభేదాల వల్లే..
గ్రామంలో దళిత సామాజికవర్గానికి చెందిన వారు కొన్నేళ్లుగా రెండు వర్గాలుగా వీడిపోయారు. ఇటీవల ఓ వర్గానికి చెందిన వారు మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం నిర్మాణంలో ఉండగానే మరో వర్గానికి చెందిన వారు అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి నాడు ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. దీని వల్ల వారి మధ్య వివాదాలు ముదిరినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు.
కఠినంగా శిక్షించాలి
అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాలకు అవమాన కరమైన సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, విగ్రహాలను సంరక్షించే బాధ్యత పోలీస్, రెవెన్యూ శాఖలదేనన్నారు. సర్పంచ్ షేక్ రహీమాబేగం, వైఎస్సార్‌సీపీ దళిత విభాగం నేతలు అంబటి నాగేంద్ర ప్రసాద్, ముళ్లగిరి జాన్సన్, పాము మాన్‌సింగ్, దళిత సంఘం నాయకులు పైడిమాల యుగంధర్, గోవింద్, మండల జనసేన అధ్యక్షుడు ప్రత్తి మదన్ సంఘటనను తీవ్రంగా ఖండించారు.