
వక్ఫ్ సవరణ బిల్లుపై రాజీలేని పోరు
కై కలూరు: వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర వెనక్కి తీసుకునే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ముస్లిం సోదరులు ముక్తకంఠంతో చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా కై కలూరు మాగంటి సెంటర్ నుంచి ఏలూరు రోడ్ వరకు ముస్లింలు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. తాలూకా సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి, రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులు పరిరక్షించుకోడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునే వరకు కేంద్రంతో పోరాడతామన్నారు. లౌకిక, అభ్యుదయ వాదులందరూ మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో ఎండీ.జానీ, షేక్ రఫీ, రఫీ బాషా, షాబుద్దీన్, గఫూర్, షేక్ మూసా, ఎండీ సిరాజ్, ఎండీ ఉస్మాన్, షేక్ సుభానీ, ఖాదర్ బాషా పాల్గొన్నారు.