
లేబర్ కోడ్‌లపై ఉద్యమం
జంగారెడ్డిగూడెం: కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బోసు బొమ్మ సెంటర్, ప్రభుత్వ టింబర్ డిపోల వద్ద పట్టణ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. కార్మిక వర్గం పోరాటాల ఫలితంగా సాధించిన చట్టాలన్నింటినీ రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్‌లు తీసుకువచ్చిందని విమర్శించారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా తయారు చేయడమే కేంద్రం ఉద్దేశమని, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. హమాలీల నాయకులు పాల్గొన్నారు.
నవయుగ వైతాళికులను విస్మరించడం బాధాకరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2025లో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పలువురు నవయుగ వైతాళికులను విస్మరించడం బాధాకరమని జిల్లా రచయితల సంఘ ప్రతినిధులు లంకా వెంకటేశ్వర్లు, నాగాస్త్ర, లేళ్ల వెంకటేశ్వరావు ప్రకటనలో ఖండించారు. గురజాడ వెంకట అప్పారావు, కందుకూరి వీరేశలింగం, మహాకవి శ్రీశ్రీ, గుర్రం జాషువా, అయ్యంకి వెంకటరమణయ్య, గిడుగు వెంకట రామమూర్తి పంతులు, డాక్టర్ యల్లాప్రగడ సు బ్బారావు, పింగళి వెంకయ్య, ఘంటసాల వెంకటేశ్వరావు తదితరుల పేర్లను ఈ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
పాక్ జలసంధిని ఈదిన పారా స్విమ్మర్
ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్, పారా స్విమ్మర్ బలగా గణేష్ అరుదైన ఘనత సాదించారు. శుక్రవారం భారత్, శ్రీలంక మధ్య తలైమనార్ నుంచి ధనుష్కోటి వరకూ పాక్ జలసంధి ఈదిన పారా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించారు. నిర్వాహకుల సమక్షంలో ఉదయం 5.50 గంటలకు ఈత ప్రారంభించి సాయంత్రం 4.20 నిమిషాలకు ముగించారు. 28 కిలోమీటర్ల దూరం 10 గంటల 30 నిమిషాల్లో ఈది మన్ననలు అందుకున్నారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్‌గా నిలిచారు. శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్‌ఏ చీఫ్ కోచ్ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
శ్రీవారి దేవస్థానంసూపరింటెండెంట్‌గా రామారావు
ద్వారకాతిరుమల: అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ ఐవీ రామారావు ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రామారావు ఇక్కడ చార్జ్ తీసుకోనున్నారు.
బంగారం షాపుల్లో సోదాలు
నరసాపురం: పట్టణంలోని బంగారం షాపుల పై శుక్రవారం జీఎస్టీ, తూనికలు, కొలతలు, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ సీఐ కె.శివరామకృష్ణ వివరాలను వెల్లడించారు. జైన్ జ్యూయల్ పార్క్ షాపులో 622.37 గ్రాముల బంగారం, 4,907 గ్రాముల వెండి స్టాక్ రిజిస్టర్‌లో కన్నా తక్కువగా ఉన్నట్టుగా గుర్తించి జీఎస్టీ అధికారులు రూ.3,51,004 అపరాధ రుసుం విధించారన్నారు. అలాగే ఎలాంటి ధ్రువీకరణ లేని ఎలక్ట్రానిక్ కాటాను గుర్తించి తూనికలు, కొలతల అధికారులు రూ.25 వేలు అపరాధ రుసుం విధించారని చెప్పారు. అంబిక సంఘవి జ్యూయల్ షాపులో ఎలాంటి ధ్రువీకరణ లేని ఎలక్ట్రానిక్ కాటా గుర్తించి రూ.25 వేలు ఫైన్ వేసినట్టు తెలిపారు. విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము పాల్గొన్నారు.

లేబర్ కోడ్‌లపై ఉద్యమం

లేబర్ కోడ్‌లపై ఉద్యమం