
పేదలకు అప్పుల తిప్పలు
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వ పాలనలో పనులు లేక.. చిరు వ్యాపారాలకు పెట్టుబడులు దొరక్క.. సంక్షేమ పథకాలు అందక.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం రాక.. పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు యంత్రాలతో చేస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు చేతినిండా పని దొరకని పరిస్థితి. ఈ క్రమంలో కుటుంబ పో షణ భారం కాగా.. పిల్లలు చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు అప్పుల బాటపడుతున్నారు. కు టుంబ పోషణ, డ్వాక్రా రుణాల చెల్లింపునకు మహిళలు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్‌ల ఖర్చు, బీమా తదితరాల కింద 10 శాతం రుణంలో మినహాయించుకుని ఇస్తున్నాయి. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. 2014లో చంద్రబాబు పాలనలోనూ ఇదే తరహా పరిస్థితులు ఉండగా అప్పట్లో చాలా మంది ప్రైవేట్ బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వేధింపులతో కాల్‌మనీ వ్యవహరంలో ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పేదలకు కేవలం డ్వాక్రా రుణాలతోనే సరిపెడుతున్నాయి.
సూపర్ సిక్స్.. మోసం ఫిక్స్
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఇప్పటికీ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. కేవలం పింఛన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు మినహా మిగిలినవి అటకెక్కించింది. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వ్యాపారాలూ అంతంతమాత్రంగా సాగుతున్నాయి. ప్రధానంగా మహిళలకు ఎలాంటి పథకాలు అందడం లేదు.
కంటి తుడుపుగా కార్పొరేషన్ రుణాలు
ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నామమాత్రంగా బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్ రుణాల పేరిట గ్రామం, వార్డుకు ఇద్దరు ముగ్గురికి చొప్పున రుణాలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దీంతో అర్హులకు రుణాలు అందని పరిస్థితి.
పనులు లేక.. సంక్షేమం కానరాక..
అప్పుల బాటపడుతున్న ప్రజలు
విద్య, వైద్యానికి వడ్డీ వ్యాపారుల చెంతకు..
నామమాత్రంగానే కార్పొరేషన్ రుణాలు
పథకాలపై కూటమి కత్తి
గత ఐదేళ్లలో సంక్షేమం పరవళ్లు
భీమవరానికి చెందిన లక్ష్మి అనే మహిళ నాటి జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్ చేయూత ఆర్థిక సాయంతో అద్దెకు షాపు తీసుకుని చిన్నపాటి బట్టల దుకాణం పెట్టుకుంది. నాలుగేళ్ల పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం అందడం, కొనుగోళ్లు బాగుండటంతో వ్యాపారం బాగా జరిగింది. భర్త సంపాదనతో పాటు ఆమె ఆదాయంతో కుటుంబ చక్కగా నడిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో కొనుగోళ్లు లేక షాపు అద్దె చెల్లించడం కూడా భారంగా మారింది. దీంతో ఆమె బట్టల దుకాణం మూసివేసే పరిస్థితి వచ్చింది.
పాలకోడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం పిల్లల ఫీజులు, డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం ప్రైవేట్ బ్యాంకు వద్ద రూ.50 వేలు రుణం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక కొరతతో కొన్ని నెలలు భవన నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు సరిగా లేక జీవనం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో వారం వారం బ్యాంకు వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఒత్తిళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కుటుంబాలు జిల్లాలో వందలాదిగా ఉన్నాయి.
జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పథకాల లబ్ధి
పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో)
చేయూత 2,72,111 552.88
ఆసరా 1,02,352 1,067.35
అమ్మఒడి 2,25,525 597.62
కాపు నేస్తం 2,24,286 79.40
ఈబీసీ నేస్తం 12,286 19.02
సున్నా వడ్డీ రుణాలు 2,64,719 14.02
సున్నా వడ్డీ (డ్వాక్రా) 11,65,513 110.51
నేతన్న నేస్తం 2,286 10.98
గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా సాయం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పేద, మధ్యతరగతి ప్రజలకు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాల లబ్ధి అందింది. ముఖ్యంగా మహిళల పేరిట పథకాలను అమలు చేయడంతో కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు ఇబ్బందులు ఉండేవి కావు. కరోనా విపత్తు సమయంలోనూ రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలు ఎన్నో పేద కుటుంబాల జీవనానికి భరోసాగా నిలిచాయి. వైఎస్సార్ చేయూత, ఆసరా (డ్వాక్రా రుణమాఫీ), అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల సాయంతో ఎందరో మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. పిల్లల స్కూల్, కళాశాల ఫీజులు, వైద్య ఖర్చులు కూడా నాటి ప్రభుత్వం భరించడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ఉండేది కాదు. దీంతో వారు అప్పులు చేసే పరిస్థితులు లేవు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.