
అగ్నిమాపక సిబ్బంది ఔదార్యం
చింతలపూడి: ప్రమాదవశాత్తూ నేల బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు శునకాలను గ్రామస్తుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. చింతలపూడి మండలం, శెట్టివారిగూడెం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శెట్టివారిగూడెం పొలాల్లో ఉన్న ఇరవై అడుగుల బావిలో రెండు కుక్కలు ప్రమాదవశాత్తూ పడిపోయాయి. బావి నుంచి కుక్కల అరుపులు విన్న రైతులు వాటిని బయటికి తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి చింతలపూడి అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సిబ్బందిని బావి దగ్గరకు పంపించారు. ఫైర్‌మెన్ రామకృష్ణ, ఫైర్ హోంగార్డ్ బాబురావు బావిలోకి దిగి కుక్కల్ని సురక్షితంగా బయటికి తీశారు. మూగ జీవాల ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
బావిలో పడ్డ శునకాల్ని బయటికి తీసిన వైనం