
హత్యకు దారితీసిన సరిహద్దు తగాదా
యలమంచిలి : సరిహద్దు తగాదాల నేపథ్యంలో కొంతేరు కట్టా వారి పుంతకు చెందిన కత్తుల పౌలు (58)ను అతని ఎదురింటిలో ఉండే బత్తుల ఏసుదాసు (పెద్దోడు), అతని భార్య భారతి కలసి హత్య చేశారు. మృతుడు పౌలు భార్య జానకమ్మ పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పౌలు, ఏసుదాసు స్నేహితులు. కొంతకాలం క్రితం సరిహద్దు తగాదా రావడంతో శత్రువులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పౌలు ఇంటి తలుపులు చప్పుడు కావడంతో జానకమ్మ తలుపు తీసింది. ఆమెను తోచుకుని లోపలకు వెళ్లి ఏసుదాసు, అతని భార్య భారతి పౌలుపై దాడి చేసి కత్తితో నరికారు. పౌలు మెడ, ఎడమ భుజం, కుడి చేతికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు జానకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరసాపురం డీఎస్పీ శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పౌలు మృతదేహానికి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.