
పచ్చళ్లకు మామిడికాయ రెడీ
తణుకు అర్బన్ : వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఆవకాయ తదితర పచ్చళ్లు పట్టే సందడి నెలకొంటుంది. ఇదే నేపథ్యంలో తణుకు సంత మార్కెట్‌లో ఆవకాయ పచ్చడి కోసం మాడికాయలు సందడి చేస్తున్నాయి. గత 10 రోజులుగా తెల్లవారుజాము నుంచే వివిధ రకాల జాతులకు చెందిన మామిడి కాయలు తణుకు మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. మామిడికాయలు రంగు, రూపుతోపాటు దిగుబడులు కూడా అధికంగానే ఉన్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఇంకా ఊపందుకోలేదు. అనుకున్న మేర అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారులు అమ్మకాల కోసం పడిగాపులు పడాల్సివస్తుంది. కాపు ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఆవకాయ, మాగాయి తదితర పచ్చళ్లు పట్టే ఆసక్తి తగ్గిందని, రెడీమేడ్ పచ్చళ్లకు కొన్ని రకాల ప్రజానీకం అలవాటుపడ్డారని, దానికితోడు జనం దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో ఈ ఏడాది మామిడికాయల కొనుగోళ్లు ఆశాజనకంగా లేవని తెలుస్తోంది.
15 టన్నుల మామిడి కాయలు దిగుమతి
తూర్పుగోదావరి జిల్లా నుంచి అధికంగా తణుకు మార్కెట్‌లోకి రకరకాల జాతులకు చెందిన మామిడికాయలు రోజుకు సుమారుగా 15 టన్నుల వరకు అందుబాటులోకి వస్తున్నాయి. సంత మార్కెట్‌ను ఆనుకుని జరుగుతున్న మామిడికాయల అమ్మకాలకు సంబంధించి రాజమండ్రి, తుని, కత్తిపూడి, అన్నవరం తదితర ప్రాంతాల నుంచి కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు, పెద్ద రసాలు, చిన్న రసాలు, సువర్ణరేఖ, దేశవాళి వంటి రకాల మామడికాయలు నిత్యం తణుకు మార్కెట్‌లో అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా అమ్మకాలు లేకుండా పోయాయని ఈ అమావాస్య గడిస్తే కొంతమేర పచ్చళ్లు పట్టే పరిస్థితులు పెరుగుతాయేమోనంటూ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చడి కోసం ఎక్కువగా వినియోగదారులు ఈ కాయల కోసం మక్కువ చూపుతున్నారని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.
ముక్కలు కొట్టేందుకు పోటాపోటీ
మామిడికాయలు కొనుగోలు చేసుకుని మార్కెట్‌లోనే ఆవకాయ పచ్చడికి కావాల్సిన సైజులో ముక్కలు కొట్టే కార్మికులు కూడా పోటీపడుతున్నారు. ఎవరు మామిడి కాయలు కొంటారా అని వారి చుట్టూ తిరుగుతూ ముక్కలు కొట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి దుకాణం వద్ద ఒకరు ముక్కలు కొడుతూ ఉపాధి పొందుతున్నారు. కాయ సైజును బట్టి రూ. 2 నుంచి రూ.3 తీసుకుంటున్నారు.
రోజుకు 15 టన్నుల మామిడికాయలు తణుకు మార్కెట్‌కు
ఇంకా ఊపందుకోని అమ్మకాలు
అమావాస్య దాటాక అమ్మకాలపై ఆశలు
మామిడి కాయ నాణ్యతను బట్టి ధరలు ఇలా...
కొత్తపల్లి కొబ్బరి కాయ రూ. 25
ఐజర్లు రూ. 25
చిన్నరసాలు రూ. 20
పెద్ద రసాలు రూ. 20
సువర్ణరేఖ రూ. 20
దేశవాళి రూ. 15
ఇంకా ఊపందుకోని అమ్మకాలు
ఈ వేసవి సీజన్‌లో మామిడి కాయ దిగుబడి అధికంగానే ఉన్నపటికీ ప్రస్తుతానికి పచ్చడి కోసం మామడి అమ్మకాలు ఇంకా ఊపందుకోలేదు. గతంలో పచ్చడి మామిడికాయలు ఎప్పుడు వస్తాయా అనే విధంగా ఎదురుచూసేవారు. కానీ నేడు ధరలు అందుబాటులోనే ఉన్నా వ్యాపారాలు పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఆదివారం అమావాస్య అనంతరం అమ్మకాలు పెరుగుతాయని అనుకుంటున్నాము. రెడీమేడ్ పచ్చళ్లతోపాటు జనం దగ్గర డబ్బులు లేకపోవడం కూడా అమ్మకాల తగ్గడానికి కారణం అయివుండవచ్చు.
– కొఠారు రామాంజనేయులు, మామిడికాయల వ్యాపారి, తణుకు

పచ్చళ్లకు మామిడికాయ రెడీ

పచ్చళ్లకు మామిడికాయ రెడీ

పచ్చళ్లకు మామిడికాయ రెడీ