
కొల్లేరు అతిథి పక్షుల తిరోగమనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆహారం, ఆవాసం కోసం వేల మైళ్ల దూరం నుంచి కొల్లేరుకు వలస వస్తున్న విదేశీ అతిథి పక్షులు తిరుగుబాట పడుతున్నాయి. రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు కొల్లేరు పక్షి జాతుల ఉసురు తీస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కొల్లేరు సరస్సుపై పడింది. దీంతో జల సిరులతో కళకళలాడే సరస్సు ఎడారిని తలపిస్తోంది. కొల్లేరు భూమి నెర్రలతో కళావిహీనంగా మారింది. విదేశీ, స్వదేశీ పక్షులకు నీరు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు పయనమవుతున్నాయి. అభయారణ్య పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో 16 రకాల జాతులు సైబీరియా, యూరప్, చైనా, ఇండోనేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, నైజీరియా, శ్రీలంక వంటి దేశాల నుంచి ఏటా వలస వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఏలూరు జిల్లా కై కలూరు, మాధవపురం పక్షి సంరక్షణ కేంద్రాలకు పెలికాన్ పక్షులు వేలల్లో విచ్చేస్తాయి. దాదాపు వీటి సంఖ్య 7వేల పైనే ఉంటాయి. వీటిలో పాటు సూదితోక బాతు (నార్తరన్ పిన్ టయల్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్ల రెక్కల ఉల్లంకి (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), బంగారు ఉల్లంకి(పసిఫిక్ గోల్డెన్ ప్లోవర్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్) వంటివి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరులో నీరు లేకపోవడంతో సుమారు 35 వేల పైనే పక్షులు వెనుదిరుగుతున్నాయి.
గోదావరి జలాలు మళ్లించాలి
పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం అవశ్యమని కొల్లేరుపై అధ్యయనం చేసిన మిత్రా, శ్రీరామకృష్ణయ్య కమిటీలు తేల్చిచెప్పాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీటి నిర్మాణాలకు నిధులు సైతం కేటాయించారు. ప్రభుత్వం మారడంతో రెగ్యులేటర్ల అంశం అటకెక్కింది. కూటమి ప్రభుత్వం రెగ్యులేటర్లను నిర్మిస్తే వర్షాకాలం, వరదల సమయంలో కొల్లేరుకు వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
నీరు లేక ఎడారిగా మారిన కొల్లేరు సరస్సు
సుమారు 35 వేల పక్షులు వెళ్లిపోయాయని అంచనా
గోదావరి జలాలు కొల్లేరుకు పంపాలని డిమాండ్
కొల్లేరులో సహజ సిద్ధ చేపలు మృత్యువాత
రెగ్యులేటర్లు నిర్మించండి
కొల్లేరులో ఎల్లప్పుడూ నీరు ఉండాలంటే రెగ్యులేటర్లు నిర్మిం చాలి. దీనివల్ల వరదల సమ యంలో వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఏటా సముద్రపు ఉప్పునీరు కొల్లేరుకు చేరుతోంది. ఈ నీటి వల్ల కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే చేపలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం రెగ్యులేటర్ల నిర్మాణంపై దృష్టి సారించాలి.
– ముంగర నరసింహారావు,
ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా
నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు పక్షులకు వేసవిలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. వేసవికి ముందుగానే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అరుదైన పక్షులు కొల్లేరుకు వలస వస్తున్నాయి. సామాజిక బాధ్యతగా పలు స్వచ్ఛంద సంస్థలు నీటి తొట్టెల ఏర్పాటుకు ముందుకు రావాలి.
– ఎం.హరిప్రసాద్, హిస్టరీ హెచ్‌ఓడీ,
వైవీఎన్నార్ డిగ్రీ కాలేజీ, కై కలూరు
నెర్రలిచ్చిన కొల్లేరు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 కొల్లేరు గ్రామాల్లో దాదాపు 3 లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు సరస్సుకు 67 డ్రెయిన్ల ద్వారా 1.11 లక్షల క్యూసెక్కుల నీరు ఏటా చేరుతోంది. కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమల కొండ ప్రాంతాల నుంచి వచ్చే రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు వాగులు కొల్లేరుకు ప్రధాన నీటి వనరులు. గత తెలుగుదేశం పాలనలో వెలగలేరు వద్ద రామిలేరు, తమ్మిలేరును పోలవరం కుడి కాల్వకు, అదే విధంగా చిన్న కాల్వలు, డ్రెయిన్లను పట్టిసీమ ప్రాజెక్టు కాల్వలోకి మళ్ళించారు. దీంతో కొల్లేరుకు వచ్చే నీరు తగ్గింది. కొల్లేరు సరస్సులో అక్రమ చేపల చెరువులు వేల ఎకరాల్లో విస్తరించడం, ఎగువ నుంచి వచ్చే నీటిని చెరువుల్లో నింపుకోవడం వల్ల కొల్లేరులో నీటి జాడ కనిపించడం లేదు. నీరు లేకపోవడంతో కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే అనేక నల్ల జాతి చేపలు మృత్యువాత పడుతున్నాయి.

కొల్లేరు అతిథి పక్షుల తిరోగమనం

కొల్లేరు అతిథి పక్షుల తిరోగమనం

కొల్లేరు అతిథి పక్షుల తిరోగమనం