Anie Siva: ఐస్‌క్రీమ్‌లు అమ్మిన ఊరికే ఎస్‌ఐగా వచ్చింది! | 18-yr-old abandoned with baby becomes SI of Varkala after 14 years | Sakshi
Sakshi News home page

Anie Siva: ‘ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను’

Published Tue, Jun 29 2021 12:09 AM | Last Updated on Tue, Jun 29 2021 11:02 AM

18-yr-old abandoned with baby becomes SI of Varkala after 14 years - Sakshi

మలయాళ నటుడు మోహన్‌లాన్‌ ‘ఆమె కథ అందరికీ స్ఫూర్తి కావాలి’ అని ఫేస్‌బుక్‌లో రాశాడు. కేరళ ప్రతిపక్ష నాయకుడు సతీశన్‌ ‘ఓహో... ఏమి పట్టుదల’ అని శ్లాఘించాడు. కేరళ డిజిపి లోక్‌నాథ్‌ బెహరా ‘నీకేం కావాలో చెప్పమ్మా’ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ‘ఆనీ శివ’ అనే కొత్త మహిళా ఎస్‌.ఐ గురించి. జూన్‌ 25న ఆమె ఎస్‌.ఐ అయ్యింది అక్కడ. పదేళ్ల క్రితం భర్త, తల్లిదండ్రులు వదిలేయగా ఏ ఊళ్లో అయితే నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ వచ్చిందో అదే ఊరికి ఆమె ఎస్‌.ఐ. అయ్యింది. ‘నా పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను’ అందామె. మనం పేడముద్దలా ఉంటే జీవితం విసిరికొట్టినప్పుడు హరీమంటాం. బంతిలా ఉంటే ఆనీ అవుతాం. ఆమె కథ ఇది.

రెండు మూడు రోజులుగా కేరళలో ఒక మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వార్తల్లో ఉంది. సాధారణంగా ఇలా సినిమాల్లో జరుగుతుంటుంది. అయితే కల్పన కంటే నిజ జీవితంలోనే ఎంతో అనూహ్యత ఉంటుంది. అందుకే ఆనీ శివ జీవితం ఇప్పుడు చాలామందికి స్ఫూర్తికానుంది.

ఒక విశేష నియామకం
త్రివేండ్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే వర్కల అనే టౌన్‌కు జూన్‌ 25న ఆనీ శివ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చింది. అది ఆమెకు తొలిపోస్టు. అంతకుముందు ఆమె రెండు సంవత్సరాలుగా కొచ్చిలో ట్రయినింగ్‌ లో ఉంది. అది పూర్తి కావడంతో వర్కలకు పోస్టింగ్‌ ఇచ్చారు. మామూలుగా అయితే అసలు ఇది ఏ మాత్రం చెప్పుకోదగ్గ వార్త కాదు. కాని వర్కలకు ఆనీ శివ ఎస్‌.ఐగా రావడం మాత్రం పెద్ద వార్త. ఎందుకంటే పదేళ్ల క్రితం అదే టౌన్‌లో ఆమె పొట్టకూటి కోసం నిమ్మకాయ రసం అమ్మింది. ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పని చేసింది. సరుకులు ఇంటింటికి తిరిగి అందించే బాయ్‌గా పని చేసింది. వేయి పనులు చేసింది బతకడానికి. ఎందుకంటే ఆమె భర్త వదిలిపెట్టిన గతి లేని స్త్రీ. పైగా ఒక బిడ్డకు తల్లి. కన్నవాళ్లు తన్ని తరిమేసిన మహిళ. అలాంటి మహిళ ఆ ఊళ్లో బతికింది. కాని ఇవాళ అదే మహిళ ఆ ఊరికే ఎస్‌.ఐగా తిరిగొచ్చింది.

ప్రేమ–వంచన
త్రివేండ్రంకు గంట దూరంలో ఉండే కంజీరంకులమ్‌ అనే చిన్న ఊరికి చెందిన ఆన్నీ శివ తను డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో ఉండగా ప్రేమించిన కుర్రాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఏమాత్రం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమించినవాడు ఆమెతో వర్కలలో కాపురం పెట్టాడు. ఒక కొడుకు పుట్టాడు. అప్పటికి ఆమె పట్ల విముఖత ఏర్పరుచుకున్న అతడు ఆమెను ఆమె ఖర్మానికి వదిలి వెళ్లిపోయాడు. జీవితంలో దెబ్బ తిన్న ఆనీ శివ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ‘గడప ఎక్కావంటే కాళ్లు విరగ్గొడతాం’ అన్నారు. దాంతో గతి లేక వర్కల వచ్చి అక్కడ ఉంటున్న నానమ్మ ఇంట్లోని స్థలంలో చిన్న షెడ్‌ వేసుకుని జీవించసాగింది.

ఆమె తల్లి, అన్న, తండ్రి
కొడుకు పేరు శివ స్వరూప్‌. కొడుకును సాకడానికి ఆనీ శివ నిమ్మకాయరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. వర్కల పుణ్యక్షేత్రం. అక్కడ గుడి చాలా ఫేమస్‌. పాపనాశం బీచ్‌లో మునిగితే పాపాలు పోతాయని నమ్మిక. అందుకని యాత్రికులు వస్తుంటారు. వారికి తినుబండారాలు అమ్మేది. ఆ డబ్బు చాలక ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా మారింది. ఇంకా ఏ పని దొరికితే అది. ఆమె తను స్త్రీగా ఉంటే ఇబ్బంది అని పూర్తిగా అబ్బాయి క్రాఫ్‌లో తిరిగేది. చూసేవారు ఆమెతో ఉన్న కొడుక్కు అన్నగాని తండ్రి గాని అనుకునేవారు. ఇన్ని పనులు చేస్తూనే ఆన్నీ తన చదువు తిరిగి కొనసాగించింది. కష్టపడి డిగ్రీ సోషియాలజీ పూర్తి చేసింది.

స్నేహితుని సలహా
ఆమె చురుకుదనం, శరీర స్వభావం గమనించిన మిత్రుడు నువ్వు పోలీసాఫీసర్‌గా సరిపోతావు.. ట్రై చెయ్‌ అని సలహా ఇచ్చాడు. దాంతో ఆనీ నియామక పరీక్షలకు కోచింగ్‌ తీసుకోవడం మొదలెట్టింది. 2016లో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె లక్ష్యం ఎస్‌.ఐ కావడం వల్ల తిరిగి పరీక్షలు రాయడం కొనసాగించి 2019లో ఎస్‌.ఐగా సెలెక్ట్‌ అయ్యింది. ట్రైనింగ్, ప్రొబేషన్‌ పూర్తయ్యాక తన ఊరికే ఎస్‌.ఐగా వచ్చింది.

ప్రశంసల వెల్లువ
ఆమె పోస్టింగ్‌ తీసుకున్న వెంటనే ఆమె జీవితం గురించి అక్కడ విశేష కథనాలు రావడంతో కేరళలో ఆనీకు ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా, రాజకీయ రంగాలలోని ప్రముఖులు ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని చాలా ప్రశంసించారు. ‘ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలి’ అని మోహన్‌లాల్‌తో సహా అందరూ కోరుకున్నారు. ఆనీకి కూడా తన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ‘నన్ను బాధించిన పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను?’ అని అంది. తన ఇంటర్వ్యూలలో తన కొడుకు కొచ్చిలో చదువుకుంటున్నాడని, ట్రయినింగ్‌ సమయంలో అక్కడే స్కూల్లో వేశానని, ఇప్పుడు ఇద్దరం వేరు వేరుగా ఉండాల్సి వస్తోందని అందామె. అది చదివిన కేరళ డిజిపి వెంటనే కొచ్చికి బదిలీ చేశారు. తల్లీకొడుకులను కలపడానికి ఈ ట్రాన్స్‌ఫర్‌ చేశాం అని ఆయన తెలియచేశారు.

లోకం మారాలి
వివాహంలో విభేదం వచ్చి కూతురు పుట్టింటికి వస్తే అక్కున చేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగానే ఉంటారు. కాని లోకులే సూటిపోటి మాటలు అంటుంటారు. లోకులకు భయపడి తల్లిదండ్రులు తమ కూతుళ్లను వారి ఖర్మానికి వదిలిపెడుతున్నారు. లోకుల ధోరణి మారాలి. అప్పుడు వివాహిత స్త్రీలు తమకు తల్లిదండ్రుల అండ ఉంది అనుకుంటారు. ఆత్మహత్యల వరకూ వెళ్లరు అంది ఆనీ.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement