Insurance Agent
-
Anie Siva: ఐస్‌క్రీమ్‌లు అమ్మిన ఊరికే ఎస్ఐగా వచ్చింది!
మలయాళ నటుడు మోహన్‌లాన్ ‘ఆమె కథ అందరికీ స్ఫూర్తి కావాలి’ అని ఫేస్బుక్లో రాశాడు. కేరళ ప్రతిపక్ష నాయకుడు సతీశన్ ‘ఓహో... ఏమి పట్టుదల’ అని శ్లాఘించాడు. కేరళ డిజిపి లోక్‌నాథ్ బెహరా ‘నీకేం కావాలో చెప్పమ్మా’ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ‘ఆనీ శివ’ అనే కొత్త మహిళా ఎస్.ఐ గురించి. జూన్ 25న ఆమె ఎస్.ఐ అయ్యింది అక్కడ. పదేళ్ల క్రితం భర్త, తల్లిదండ్రులు వదిలేయగా ఏ ఊళ్లో అయితే నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ వచ్చిందో అదే ఊరికి ఆమె ఎస్.ఐ. అయ్యింది. ‘నా పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను’ అందామె. మనం పేడముద్దలా ఉంటే జీవితం విసిరికొట్టినప్పుడు హరీమంటాం. బంతిలా ఉంటే ఆనీ అవుతాం. ఆమె కథ ఇది. రెండు మూడు రోజులుగా కేరళలో ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ వార్తల్లో ఉంది. సాధారణంగా ఇలా సినిమాల్లో జరుగుతుంటుంది. అయితే కల్పన కంటే నిజ జీవితంలోనే ఎంతో అనూహ్యత ఉంటుంది. అందుకే ఆనీ శివ జీవితం ఇప్పుడు చాలామందికి స్ఫూర్తికానుంది. ఒక విశేష నియామకం త్రివేండ్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే వర్కల అనే టౌన్‌కు జూన్ 25న ఆనీ శివ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. అది ఆమెకు తొలిపోస్టు. అంతకుముందు ఆమె రెండు సంవత్సరాలుగా కొచ్చిలో ట్రయినింగ్ లో ఉంది. అది పూర్తి కావడంతో వర్కలకు పోస్టింగ్ ఇచ్చారు. మామూలుగా అయితే అసలు ఇది ఏ మాత్రం చెప్పుకోదగ్గ వార్త కాదు. కాని వర్కలకు ఆనీ శివ ఎస్.ఐగా రావడం మాత్రం పెద్ద వార్త. ఎందుకంటే పదేళ్ల క్రితం అదే టౌన్లో ఆమె పొట్టకూటి కోసం నిమ్మకాయ రసం అమ్మింది. ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసింది. సరుకులు ఇంటింటికి తిరిగి అందించే బాయ్‌గా పని చేసింది. వేయి పనులు చేసింది బతకడానికి. ఎందుకంటే ఆమె భర్త వదిలిపెట్టిన గతి లేని స్త్రీ. పైగా ఒక బిడ్డకు తల్లి. కన్నవాళ్లు తన్ని తరిమేసిన మహిళ. అలాంటి మహిళ ఆ ఊళ్లో బతికింది. కాని ఇవాళ అదే మహిళ ఆ ఊరికే ఎస్.ఐగా తిరిగొచ్చింది. ప్రేమ–వంచన త్రివేండ్రంకు గంట దూరంలో ఉండే కంజీరంకులమ్ అనే చిన్న ఊరికి చెందిన ఆన్నీ శివ తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా ప్రేమించిన కుర్రాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఏమాత్రం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమించినవాడు ఆమెతో వర్కలలో కాపురం పెట్టాడు. ఒక కొడుకు పుట్టాడు. అప్పటికి ఆమె పట్ల విముఖత ఏర్పరుచుకున్న అతడు ఆమెను ఆమె ఖర్మానికి వదిలి వెళ్లిపోయాడు. జీవితంలో దెబ్బ తిన్న ఆనీ శివ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ‘గడప ఎక్కావంటే కాళ్లు విరగ్గొడతాం’ అన్నారు. దాంతో గతి లేక వర్కల వచ్చి అక్కడ ఉంటున్న నానమ్మ ఇంట్లోని స్థలంలో చిన్న షెడ్ వేసుకుని జీవించసాగింది. ఆమె తల్లి, అన్న, తండ్రి కొడుకు పేరు శివ స్వరూప్. కొడుకును సాకడానికి ఆనీ శివ నిమ్మకాయరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. వర్కల పుణ్యక్షేత్రం. అక్కడ గుడి చాలా ఫేమస్. పాపనాశం బీచ్‌లో మునిగితే పాపాలు పోతాయని నమ్మిక. అందుకని యాత్రికులు వస్తుంటారు. వారికి తినుబండారాలు అమ్మేది. ఆ డబ్బు చాలక ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారింది. ఇంకా ఏ పని దొరికితే అది. ఆమె తను స్త్రీగా ఉంటే ఇబ్బంది అని పూర్తిగా అబ్బాయి క్రాఫ్‌లో తిరిగేది. చూసేవారు ఆమెతో ఉన్న కొడుక్కు అన్నగాని తండ్రి గాని అనుకునేవారు. ఇన్ని పనులు చేస్తూనే ఆన్నీ తన చదువు తిరిగి కొనసాగించింది. కష్టపడి డిగ్రీ సోషియాలజీ పూర్తి చేసింది. స్నేహితుని సలహా ఆమె చురుకుదనం, శరీర స్వభావం గమనించిన మిత్రుడు నువ్వు పోలీసాఫీసర్‌గా సరిపోతావు.. ట్రై చెయ్ అని సలహా ఇచ్చాడు. దాంతో ఆనీ నియామక పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలెట్టింది. 2016లో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె లక్ష్యం ఎస్.ఐ కావడం వల్ల తిరిగి పరీక్షలు రాయడం కొనసాగించి 2019లో ఎస్.ఐగా సెలెక్ట్ అయ్యింది. ట్రైనింగ్, ప్రొబేషన్ పూర్తయ్యాక తన ఊరికే ఎస్.ఐగా వచ్చింది. ప్రశంసల వెల్లువ ఆమె పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఆమె జీవితం గురించి అక్కడ విశేష కథనాలు రావడంతో కేరళలో ఆనీకు ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా, రాజకీయ రంగాలలోని ప్రముఖులు ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని చాలా ప్రశంసించారు. ‘ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలి’ అని మోహన్‌లాల్‌తో సహా అందరూ కోరుకున్నారు. ఆనీకి కూడా తన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ‘నన్ను బాధించిన పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను?’ అని అంది. తన ఇంటర్వ్యూలలో తన కొడుకు కొచ్చిలో చదువుకుంటున్నాడని, ట్రయినింగ్ సమయంలో అక్కడే స్కూల్లో వేశానని, ఇప్పుడు ఇద్దరం వేరు వేరుగా ఉండాల్సి వస్తోందని అందామె. అది చదివిన కేరళ డిజిపి వెంటనే కొచ్చికి బదిలీ చేశారు. తల్లీకొడుకులను కలపడానికి ఈ ట్రాన్స్ఫర్ చేశాం అని ఆయన తెలియచేశారు. లోకం మారాలి వివాహంలో విభేదం వచ్చి కూతురు పుట్టింటికి వస్తే అక్కున చేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగానే ఉంటారు. కాని లోకులే సూటిపోటి మాటలు అంటుంటారు. లోకులకు భయపడి తల్లిదండ్రులు తమ కూతుళ్లను వారి ఖర్మానికి వదిలిపెడుతున్నారు. లోకుల ధోరణి మారాలి. అప్పుడు వివాహిత స్త్రీలు తమకు తల్లిదండ్రుల అండ ఉంది అనుకుంటారు. ఆత్మహత్యల వరకూ వెళ్లరు అంది ఆనీ. – సాక్షి ఫ్యామిలీ -
ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!?
గాంధీనగర్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తోంది. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరి ఇంట్లో మర్చిపోయాను సర్ అంటే కుదరదు. అన్ని కాగితాలను మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించుకుని తిరుగుతున్నాడు. వివరాలు.. గుజరాత్ వడోదరకు చెందిన రామ్ షా అనే వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రోజంతా ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన నూతన మోటార్ వాహన చట్టం వల్ల ఏ చిన్న కాగితం మిస్ అయినా పెద్ద మొత్తంలో చలాన్ కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి రామ్ షా ఓ వినూత్న మార్గం కనుగొన్నాడు. ఎక్కడికెళ్లినా హెల్మెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. దాంతో బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించాడు. ఇక నేను కాగితాలు చూపించడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పని లేదు.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదంటున్నాడు రామ్ షా. ఇతని ప్రయత్నాన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా అభినందిస్తున్నారు. (చదవండి: విక్రమ్ ల్యాండర్‌కు చలాన్ విధించం) -
బీమా ఏజెంట్‌గా అమెజాన్
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ .. భారత్‌లో ఆర్థిక సేవలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బీమా సర్వీసులు కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు (ఆర్వోసీ) సంబంధిత పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం, సర్వీసులకు సంబంధించి కార్పొరేట్ ఏజెంటుగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని అమెజాన్ యోచిస్తోంది. అయితే, దీనికోసం ఇంకా బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నుంచి అమెజాన్ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు అమెజాన్ వర్గాలు బీమా ప్రణాళికలను ధృవీకరించాయి. చెల్లింపుల సర్వీసులు అందించే అమెజాన్ పే... బీమా రంగ సేవలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే బరిలో ఫ్లిప్‌కార్ట్, పేటీఎం..: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నుంచి ఇటీవలే నిధులు సమకూర్చుకున్న దేశీ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బీమా పాలసీల విక్రయంపై దృష్టి పెట్టింది. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం కోసం నియంత్రణ సంస్థ అనుమతులు కోరింది. అటు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం ఇప్పటికే కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్సు పొందింది. -
ఛీ, శవాలతో వ్యాపారమా !
సాక్షి, తెనాలిరూరల్ : అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలే అతని టార్గెట్.. కుటుంబ సభ్యులతో బేరం మాట్లాడుకుని మరీ బీమా కట్టించడం అతని ప్రత్యేకత.. సహజ మరణాలను ప్రమాద మరణాలుగా చిత్రీకరించడంలో అతను సిద్ధహస్తుడు.. పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన రమావత్ కస్నానాయక్(56) మరణాన్ని కూడా గురువారం అదే క్రమంలో చిత్రీకరిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ ప్రాంతానికి చెందిన రాజు నాయక్. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంటుగా పని చేసే రాజు నాయక్ తెనాలి మండలం పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన రమావత్ కస్నానాయక్‌కు బంధువు శ్రీనునాయక్ ద్వారా పరిచయం. దూరపు బంధువు. రెండేళ్లుగా టీబీ వ్యాధితో తీసుకుంటున్న కస్నా నాయక్ మరికొద్ది నెలల్లో మృతి చెందుతాడని భావించి, అతని కుటుంబసభ్యులను ఒప్పించి, ప్రమాద బీమా కట్టించాడు. బీమా సంస్థ నుంచి వచ్చే మొత్తంలో 60 శాతం తనకు, 40 శాతం మృతుడి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా ఒప్పందం రాసుకున్నాడు. కస్నా నాయక్ భార్య భద్రికి భర్త మరణిస్తే వెంటనే ఆ విషయాన్ని తనకు తెలియజేయాలని సూచించాడు. ఈ నేపథ్యంలో కస్నా నాయక్ బుధవారం ఉదయం ఇంట్లో మృతి చెందాడు. వెంటనే ఈ విషయాన్ని భార్య, ఇద్దరు అల్లుళ్లు రాజునాయక్‌కు ఫోను ద్వారా తెలియజేశారు. అతను శ్రీనునాయక్, మరో వ్యక్తిని తీసుకుని కారులో పెదరావూరుకు చేరుకున్నాడు. కస్నా నాయక్ అల్లుళ్లకు చెందిన ఆటోలో మృతదేహాన్న పెదరావూరు నుంచి చుండూరు మండలం చినపరిమికి వెళ్లే డొంక రోడ్డు వైపునకు తీసుకువెళ్లారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి, కారును ఎక్కించారు. వెంటనే ఆటోలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి పేరు నమోదు చేయమనడంతో అనుమానం వచ్చి.. కస్నా నాయక్ మృతదేహాన్ని పరిశీలించిన వైద్యశాల సిబ్బంది మృతుడు చనిపోయి చాలా సేపు అయిందని, తీసుకెళ్లి పొమ్మని సూచించారు. మృతుడి వివరాలను వైద్యశాలలో నమోదు చేయాలని, ప్రమాదంలో మృతి చెందినట్టు సంబంధిత రసీదులు కావాలని రాజునాయక్, శ్రీనునాయక్, మరి కొందరు సిబ్బందిని అడగడంతో అనుమానం వచ్చిన వైద్యులు, సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తాలూకా ఎస్ఐ డి. జయకుమార్ వివరా లు తెలుసుకుని ఘటన జరిగిందని చెప్పిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ రక్తం, వాహనాలకు సంబంధించిన గాజుముక్కలు వంటివి లేకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలిస్తే ఒంటిపై గాయాలూ లేవు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేయాలంటూ రాజునాయక్ పోలీసులను అడగడం గమనించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజునాయక్, శ్రీనునాయక్‌తో పాటు కస్నానాయక్ భార్య, ఇద్దరు అల్లుళ్లు ప్రస్తుతం నిందితులుగా పోలీసుల అదుపులో ఉన్నారు. -
బీమా ఏజెంట్ల నియామకానికి ఐఆర్డీఏ పరీక్ష పాసవ్వాల్సిందే..
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ ఏజెంట్ కావాలంటే తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి అని ఇన్సూరెన్స్ రంగ నియంత్రణ సంస్థ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏ) తెలిపింది. ఈ పరీక్షలో లైఫ్, జనరల్, ఆరోగ్య బీమాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు ఉంటాయని, అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ నియామకానికి కొత్తగా రూపొందించిన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కేవలం ఆరోగ్య బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఐఐఐ) పరీక్షల నమూనా ఆధారంగానే జూన్ 30 వరకు ఏజెంట్లను నియమించుకోవచ్చని తర్వాత ఆ కంపెనీలు కూడా ఐఆర్డీఏఐ నియమావళిని అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది.