సాక్షి, తెనాలిరూరల్ : అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలే అతని టార్గెట్.. కుటుంబ సభ్యులతో బేరం మాట్లాడుకుని మరీ బీమా కట్టించడం అతని ప్రత్యేకత.. సహజ మరణాలను ప్రమాద మరణాలుగా చిత్రీకరించడంలో అతను సిద్ధహస్తుడు.. పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన రమావత్ కస్నానాయక్(56) మరణాన్ని కూడా గురువారం అదే క్రమంలో చిత్రీకరిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ ప్రాంతానికి చెందిన రాజు నాయక్. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంటుగా పని చేసే రాజు నాయక్ తెనాలి మండలం పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన రమావత్ కస్నానాయక్‌కు బంధువు శ్రీనునాయక్ ద్వారా పరిచయం. దూరపు బంధువు. రెండేళ్లుగా టీబీ వ్యాధితో తీసుకుంటున్న కస్నా నాయక్ మరికొద్ది నెలల్లో మృతి చెందుతాడని భావించి, అతని కుటుంబసభ్యులను ఒప్పించి, ప్రమాద బీమా కట్టించాడు. బీమా సంస్థ నుంచి వచ్చే మొత్తంలో 60 శాతం తనకు, 40 శాతం మృతుడి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా ఒప్పందం రాసుకున్నాడు.
కస్నా నాయక్ భార్య భద్రికి భర్త మరణిస్తే వెంటనే ఆ విషయాన్ని తనకు తెలియజేయాలని సూచించాడు. ఈ నేపథ్యంలో కస్నా నాయక్ బుధవారం ఉదయం ఇంట్లో మృతి చెందాడు. వెంటనే ఈ విషయాన్ని భార్య, ఇద్దరు అల్లుళ్లు రాజునాయక్‌కు ఫోను ద్వారా తెలియజేశారు. అతను శ్రీనునాయక్, మరో వ్యక్తిని తీసుకుని కారులో పెదరావూరుకు చేరుకున్నాడు. కస్నా నాయక్ అల్లుళ్లకు చెందిన ఆటోలో మృతదేహాన్న పెదరావూరు నుంచి చుండూరు మండలం చినపరిమికి వెళ్లే డొంక రోడ్డు వైపునకు తీసుకువెళ్లారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి, కారును ఎక్కించారు. వెంటనే ఆటోలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి పేరు నమోదు చేయమనడంతో అనుమానం వచ్చి.. కస్నా నాయక్ మృతదేహాన్ని పరిశీలించిన వైద్యశాల సిబ్బంది మృతుడు చనిపోయి చాలా సేపు అయిందని, తీసుకెళ్లి పొమ్మని సూచించారు. మృతుడి వివరాలను వైద్యశాలలో నమోదు చేయాలని, ప్రమాదంలో మృతి చెందినట్టు సంబంధిత రసీదులు కావాలని రాజునాయక్, శ్రీనునాయక్, మరి కొందరు సిబ్బందిని అడగడంతో అనుమానం వచ్చిన వైద్యులు, సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో తాలూకా ఎస్‌ఐ డి. జయకుమార్ వివరా లు తెలుసుకుని ఘటన జరిగిందని చెప్పిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ రక్తం, వాహనాలకు సంబంధించిన గాజుముక్కలు వంటివి లేకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలిస్తే ఒంటిపై గాయాలూ లేవు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేయాలంటూ రాజునాయక్ పోలీసులను అడగడం గమనించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజునాయక్, శ్రీనునాయక్‌తో పాటు కస్నానాయక్ భార్య, ఇద్దరు అల్లుళ్లు ప్రస్తుతం నిందితులుగా పోలీసుల అదుపులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment