‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు.
అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు.
సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్‌లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి.
ఈ సాహస బృందంలోని సభ్యులు:
1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ)
2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్)
4. చేతనా సాహు (54, కోల్‌కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్‌పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్‌పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్)
9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్‌పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్‌నవూ)
‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు.
లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు.
ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు.
‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు!
4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది.
‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్.
విజయోస్తు
Comments
Please login to add a commentAdd a comment