ఫైల్ ఫోటో
రమేష్, కీర్తన (పేర్లు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. పెళ్లై ఐదేళ్లు అవుతోంది. ఇద్దరివీ ఐదెంకల్లో జీతం. కరోనా కారణంగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యే కీర్తన ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతోంది. ఓ రోజు కీర్తన తన ఆన్‌లైన్ అకౌంట్‌ను రమేష్‌కు చూపించింది. అందులోని ఓ ప్రకటన వివరాలు చూసిన రమేష్‌కు కూడా ఆసక్తిగా అనిపించి, తన అకౌంట్ నుంచి ఫాలో లింక్‌ను క్లిక్ చేశాడు.
ఆన్‌లైన్ ద్వారా అలా పరిచయం అయిన విపుల్ (పేరుమార్చడమైనది)తో రమేష్, కీర్తనలు రోజూ మెసేజ్‌ల ద్వారా అతని టెక్నాలజీ సంస్థకు సంబంధించిన వివరాలను పంచుకునేవారు. గుజరాత్‌లో ఉన్న తన సొంత టెక్నాలజీ కంపెనీ వివరాలు, క్రిఫ్టో కరెన్సీ గురించిన అనుభవమూ, తను చేసే డిజిటల్ కరెన్సీ లావాదేవీలను రమేష్, కీర్తనలతో పంచుకునేవాడు విపుల్.
చదవండి: అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
రెట్టింపులుగా ఆదాయం?!
పది వేల రూపాయలు పెట్టుబడితో లక్ష రూపాయల లాభం ఎలా వస్తుందో తెలిపే వివరాలు రమేష్, కీర్తనలు బాగా ఆకట్టుకున్నాయి. అప్పటికే బిట్‌కాయిన్, క్రిఫ్టో కరెన్సీగా పేరొందిన డిజిటల్ కరెన్సీ గురించి రమేష్, కీర్తనలకు కొద్దిగా తెలుసు. విపుల్‌తో చర్చలు జరిపిన తర్వాత అతను చెప్పిన యాప్స్‌లో కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు రమేష్, కీర్తనలు. రెండు, మూడు రోజుల్లోనే తమ పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చాయి.
ఈ లావాదేవీలు ఇలాగే కొనసాగితే త్వరలోనే కోటీశ్వరులు అయిపోతామన్నది ఇద్దరి ఆలోచన. అంతేకాదు, తాము ఇక ఉద్యోగాలు కూడా చేయాల్సిన అవసరం లేదనుకున్నారు. ఆ ఆలోచనతో విపుల్ సూచనలతో ఆర్థిక లావాదేవీలు జరుపుతూ వచ్చారు. పదిహేను రోజుల్లో దాదాపు రూ.12 లక్షల రూపాయలు విపుల్ చెప్పినవిధంగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత రోజు విపుల్ ఫోన్ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. విపుల్ ఆన్‌లైన్ అకౌంట్ కూడా కనిపించలేదు. గుజరాత్‌లో ఉన్నట్టుగా చెప్పిన విపుల్ టెక్నాలజీ సంస్థ గురించి వాకబు చేస్తే, అలాంటిదేమీ లేదని తేలింది. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే క్రిఫ్టో కరెన్సీ పేరుతో తమలాగే మోసపోయిన వారు వందల సంఖ్యలో ఢిల్లీ, ముంబయ్, పుణె నగరాలలో ఉన్నారని తెలిసింది.
చదవండి: సైబర్ కేసుల ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో తెలుసా!
జాగ్రత్తలే మోసానికి అడ్డుకట్ట
క్రిఫ్టో కరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ ఇందులో మోసం ఉండదు. కానీ,కరెన్సీ పేరు మీద మోసం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మోసపుచ్చాలనుకునేవారు రకరకాల లింక్స్, మన మెయిల్ ఐడీ, ఇతరత్రా మెసేజ్‌ల ద్వారా పంపిస్తారు. ప్రైవేట్ అప్లికేషన్స్ ఎప్పుడూ డౌన్‌లోడ్ చేసుకోకూడదు. ఆ లింక్స్‌పై క్లిక్ చేయకూడదు. డిజిటల్ కరెన్సీ పేరుతో మోసాలు జరగడం ఈ నాలుగైదు నెలల నుంచి ఎక్కువగా ఉంటోంది. చదువుకున్నవాళ్లే ఈ తరహా కరెన్సీ పట్ల ఆసక్తి చూపుతారు. క్రిఫ్టో కరెన్సీలో చాలా రకాలు ఉన్నాయి. వేటిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాటి గురించి పూర్తి అవగాహన పెంచుకొని, తమ ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడం శ్రేయస్కరం.
– యు. మదన్ కుమార్‌గౌడ్, సైబర్ క్రైమ్, హైదరాబాద్
వర్చువల్ కరెన్సీగా క్రిఫ్టో కరెన్సీ డిజిటల్‌లో చలామణిలో ఉంది. దీనికి భారత ప్రభుత్వం లేదా రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా మద్దతు ఇవ్వవు. ఇవి క్రిఫ్టోగ్రఫీ ద్వారా భద్రపరచబడిన డిజిటల్ ఆస్తులు. వీటిని డిజిటల్ మాధ్యమంగానే ఉపయోగిస్తారు. వారం రోజుల తేడాతోనే వీటిలోని పెట్టుబడులు రెట్టింపులుగా ఉంటుంది. ఉదాహరణకు.. కిందటి వారం ఒక బిట్‌కాయిన్ ధర 26 లక్షల రూపాయల పైన ఉంటే, అది ఈ వారం 36 లక్షల రూపాయల పైన ధర ఉంది. అందుకే, వీటిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుపుతుంటారు.
ఈ కరెన్సీ పేరుతో నకిలీ కంపెనీలు, నకిలీ వాలెట్లు, నకిలీ ట్రేడింగ్‌లతో మోసగాళ్లు ముందుకు వస్తున్నారు. ప్రారంభ ధరను తక్కువగా చూపించి, లాభాలు వచ్చినట్టుగా చూపుతారు. వినియోగదారుల బలహీనతను అడ్డుగా పెట్టుకొని, మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఎంతవరకు అంటే కొందరు ఆస్తులు అమ్ముకొని, మరికొందరు అప్పులు చేసి క్రిఫ్టో కరెన్సీ పేరుతో నకిలీ యాప్‌లలో పెట్టుబడి పెట్టి మోసపోయినవారున్నారు. కాబట్టి, జాగ్రత్త తప్పనిసరి.
– అనీల్ రాచమల్ల, ఎండ్ నౌ ఫౌండేషన్‌సైబర్ క్రైమ్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment