How To Get Rid of Blackheads: ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ బ్లాక్‌హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం డల్‌గా, కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది.
అయితే ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, నిమ్మకాయ, పప్పు, పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం...
కొల్లాజెన్ విడుదలలో..
►చర్మంలో అతిముఖ్యమైన ప్రోటిన్ కొల్లాజెన్ విడుదలను మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి.
►అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
ఎర్రకందిపప్పు ఉంటే..
►పాలు చర్మానికి పోషణ అందిస్తే పప్పు దినుసులు బ్లాక్‌హెడ్స్‌ను వేళ్లతోసహా పీకేస్తాయి. ఎర్రకందిపప్పుని ఒక టేబుల్ స్పూను తీసుకుని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నానినపప్పులో నీటిని తీసేసి రెండు స్పూన్ల పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పప్పులోని యాంటిఆక్సిడెంట్స్ చర్మానికి అందుతాయి. మర్దనతో బ్లాక్ హెడ్స్ పోతాయి. సున్నిత చర్మతత్వం కలిగిన వారికి ఈ స్క్రబ్ చక్కగా పనిచేస్తుంది.
మృతకణాలను తొలగిస్తుంది
►స్పూను పంచదారలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార లోతుగా శుభ్రంచేసి మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంతోపాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి.
చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది!
అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్‌వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతిమంతంగా మెరిసేలా చేస్తుంది.
చదవండి: Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే..
Comments
Please login to add a commentAdd a comment