మల్బరీ, ‘తేనె’ కంచెలతో ఏనుగుల దాడులకు చెక్‌! | Bee fences to ward off elephant attacks | Sakshi
Sakshi News home page

మల్బరీ, ‘తేనె’ కంచెలతో ఏనుగుల దాడులకు చెక్‌!

Published Tue, Jun 14 2022 8:03 AM | Last Updated on Tue, Jun 14 2022 8:03 AM

Bee fences to ward off elephant attacks - Sakshi

ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో అడవులకు దగ్గరగా నివసించే రైతులు, గ్రామీణుల జీవనం ప్రాణసంకటంగా మారుతోంది. పలువురు ఏనుగుల దాడిలో పంటలను, ఆస్తులతోపాటు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా తరచూ వింటూనే ఉన్నాం. మన దేశంలో ఏనుగుల దాడుల్లో ఏటా దాదాపు 500 మంది మృత్యువాతపడుతున్నారు. 2015–2020 మధ్యలో సుమారు 2,500 మంది ఏనుగుల దాడుల్లో చనిపోయారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలోనే అత్యధికంగా 170 మంది చనిపోయారు.

ప్రజల ప్రతి దాడుల్లో ఈ ఐదేళ్లలో 500 వరకు ఏనుగులు కూడా చనిపోయాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల దాడి సంఘటనలు వేసవిలో ఏటేటా పెరుగుతున్నాయి. కొందరు రైతులు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఏనుగులు–మనుషుల మధ్య సంఘర్షణను నివారించడానికి లేదా తగ్గించడానికి అనేక పద్ధతులు అందుబాటులో వున్నాయి. ఊళ్ల చుట్టూ పెద్ద కందకాలు తవ్వటం, శిక్షణ ఇచ్చిన ఏనుగులతో అటవీ ఏనుగుల గుంపులను పారదోలటం వంటి నివారణ చర్యలు ఉన్నా ఫలితం అంతగా ఉండటం లేదు. అయితే, రెండు పరిష్కార మార్గాలున్నాయి.  
తేనెటీగల కంచెలతో చెక్‌!
ఈ నేపథ్యంలో ఏనుగులు పొలాల్లోకి, జనావాసాల్లోకి చొరబడే సరిహద్దు ప్రాంతాల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీ–ఫెన్సెస్‌)ను ఏర్పాటు చేయటం అనే పద్ధతి ఒకటుంది. తేనెటీగల ధ్వని వినిపించగానే ఏనుగులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పద్ధతిని గతంలోనే కేరళలో అమలు చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కెవిఐసి) కర్ణాటకలోని కొడగు జిల్లాలో ‘రీ–హేబ్‌’ పేరిట పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా తేనెటీగల కంచెలు ఏర్పాటు చేసి పంటలపై, గ్రామీణులపై ఏనుగుల దాడులను విజయవంతంగా నివారించగలిగారు.

తేనెటీగల గుంపులు శబ్దం చేసుకుంటూ ఏనుగులను చుట్టుముట్టి శబ్ధం చేస్తూ, వాటి తొండాల్లోకి, కళ్లలోకి దూరి ఇబ్బంది పెట్టడం వల్ల ఏనుగులు భయపడి వెనక్కి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. తేనెటీగల కంచెల ఏర్పాటుకు ఖర్చు తక్కువే కాకుండా ఏనుగులకు కూడా ఎటువంటి హానీ జరగదు. అంతేకాకుండా తెనెటీగల పెట్టెల ద్వారా తేని వస్తుంది కాబట్టి గ్రామీణులకు ఆదాయమూ లభిస్తుంది.

పెద్ద కందకాలు తవ్వటం, సాధారణ కంచెలు ఏర్పాటు చేయటం వంటి చర్యల కన్నా తేనెటీగల కంచెలకు తక్కువ ఖర్చవుతుందని, ఫలితం బాగుందని కెవిఐసి తెలిపింది. పంటలను, రైతుల ప్రాణాలను కాపాడేందుకు ఈ తేనెటీగల కంచెల ఏర్పాటును ఏనుగులతో సమస్య ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని అప్పటి కేంద్ర ఎం.ఎస్‌.ఎం.ఈ. శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. 
మల్బరీ ఆకులను ఏనుగులు ముట్టవు!
అయితే, ఏనుగులు తినని పంటలను ఆయా ప్రాంతాల్లో కంచె పంటగా సాగు చేయటం ద్వారా వాటి రాకను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పూల పంటలను ఏనుగులు తినవు. కానీ, తొక్కి పాడు చేస్తాయి. ఏనుగులు తినని, పాడు చేయని పంటలేమైనా ఉన్నాయా? అని బెంగళూరులోని కేంద్రీయ ఔషధ–సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీమాప్‌) శాస్త్రవేత్తలు డా. ఆర్‌. రవి కుమార, డా. ఎన్‌.డి. యోగేంద్ర కర్నాటకలోని కావేరి వన్యప్రాణుల అభయారణ్యం బెల్ట్‌లో ఐదేళ్లు పరిశోధన చేశారు. మల్బరీ ఆకులను ఏనుగులు అసలు తినవని, ఈ చెట్ల జోలికి కూడా రాకుండా దూరంగా వెళ్లపోతున్నట్లు వారు కనుగొన్నారు. 



మల్బరీ మొక్కలను పట్టు పురుగులకు మేతగా వేస్తుంటాం. పండ్లలో పోషకాలు ఉంటాయి. లేత ఆకులు, కాండంతో రుచికరమైన కూర వండుకోవచ్చు. మల్బరీ ఆకుతో కషాయం చేసుకోవచ్చు. పశువులు, గొర్రెలు, మేకలు, కుందేళ్లకు మల్బరీ ఆకులను మేపవచ్చు. సులభంగా జీర్ణమవుతుంది, ఈ ఆకుల్లో ప్రోటీన్‌ 15% నుండి 28% వరకు ఉంటుంది. అద్భుతమైన అమైనో ఆమ్లం ఉంటుంది. హానికరమైన పదార్థాలు లేవు. ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కాండం ముక్కను నాటితే చాలు. మొక్క వేగంగా పెరుగుతుంది. 

అయితే, ఇతర శాకాహార పశువులు ఇష్టంగా తినే మల్బరీ ఆకులకు ఏనుగులు మాత్రం ముట్టుకోవు. ఈ ఆకుల్లో మోరిన్‌ బి–సిటోస్టెరాల్‌ వంటివి ఉండటం వల్ల కావచ్చని సీమాప్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మల్బరీ సాగు మానవ–ఏనుగుల సంఘర్షణలను నియంత్రణలో ఉపయోగపడటంతో పాటు బహుళ ప్రయోజనాలతో కూడిన సుస్థిర జీవనోపాధిని అందిస్తుందని డా. రవి కుమార, డా. యోగేంద్ర సూచిస్తున్నారు. 
ఇలాఉండగా.. గ్రామీణాభివృద్ధి అధికారులు కోరితే సమస్యాత్మక గ్రామాల పొలిమేరల్లో ‘తేనెటీగల కంచె’ల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని విజయవాడలోని కేవీఐసీ డైరెక్టర్‌ డా. గ్రీప్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఆయన ఈ–మెయిల్‌: sohyderabad.kvic@gov.in
పంతంగి రాంబాబు, 
సాగుబడి డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement