సన్మార్గం : చేద్దాంలే అనుకుంటే ఎప్పటికీ చేయలేం...
కాలం విలువను గుర్తించలేని కొందరు సోమరులు, బద్దకస్తులు ప్రతిపనినీ ఆలస్యంగానే చేస్తుంటారు. చేయవలసిన పనిని తరువాత చేద్దాం, లేకపోతే రేపో ఎల్లుండో చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు. కాని ఆలస్యం చేయడం వల్ల తమకు జరిగే అనర్థాలను గుర్తించలేరు. అమృతం కూడా విషంగా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోలేరు.
మనిషి జీవితంలో పెద్ద శత్రువు ఆలస్యమే అనే విషయాన్ని ఆలస్యం హి మనుష్యాణాం జీవనే చ మహాన్ రిపుః అనే సూక్తి ధ్రువపరుస్తోంది. అందుకే అభివృద్ధిని కోరుకునే ప్రతి మనిషి ముందుగా ఈ ఆలస్యమనే శత్రువును సమూలంగా నాశనం చేయవలసిందే. ఆలస్యం వల్లనే ప్రాణాలు పోగొట్టుకున్న ఒక తుమ్మెద వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
ఒకనాటి సాయంకాలం ఒక తుమ్మెద సరస్సులోని పద్మంపై వాలింది. ఆ పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ అలానే కూర్చుండి పోయింది. ఆ తుమ్మెద మకరందాన్ని పానం చేస్తుండగానే సూర్యాస్తమయమయింది. పద్మం ముకుళించే సమయం వచ్చింది. అయినా తుమ్మెద ఆ పుష్పాన్ని వదిలి రాలేదు. ఆలస్యం చేసింది. పైగా ఈ రాత్రంతా ఆ పద్యంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూనే ఉండవచ్చు అనుకుంది. కొంచెం ఓపిక పడితే రాత్రి గడుస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, పద్మం మళ్లీ వికసిస్తుంది, అప్పుడే స్వేచ్ఛగా ఇక్కడినుంచి మరొక పుష్పం దగ్గరికి వెళ్లవచ్చు అని ఆ తుమ్మెద మురిసిపోతుండగానే ఒక ఏనుగు వచ్చింది. సరస్సులోకి దిగింది. తొండంతో సరస్సులోని పద్మాలను విసిరికొట్టింది. పద్మాలు చిందర వందరగా నేలపై పడి వాడిపోయినాయి. లోపల ఉన్న తుమ్మెద ఆకస్మికంగా మరణించింది. పద్మం నుండి వెళ్లిపోవడంలో బద్దకించి ఆలస్యం చేసిన తుమ్మెద స్థితిని
‘రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుధేతి హసిష్యతి పంకజశ్రీః
ఇత్థం విచిన్తయతి పద్మగతే ద్విరేఫే
హాః హంత! హంత! నళినీం గజ ఉజ్జహార’
అనే శ్లోకం వివరిస్తోంది.
ఏ విధంగానైతే దూరప్రాంతంలో ఉన్న నగరానికి మరునాడు చేరుకోవలసిన వ్యక్తి ముందురోజే ప్రయాణమయినట్లే, పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని భావించేవారు ఆ కోర్సులో ప్రవేశించిన నాటినుంచే చదువును ప్రారంభించాలని, ఆలస్యం చేయవద్దని‘అధ్వైవాధ్యయనం కార్యం పరీక్షాముత్తితీర్షుణా ప్రస్థాతవ్యం హి నిశ్యేవ స్థాఋనం తత్ ప్రేప్సునోషసి అనే శ్లోకం సూచిస్తోంది.
మరణసమయంలో కఫ, వాత, పిత్త దోషాలకు నేను లోనైతే నీ నామస్మరణకు గొంతు, భగవద్ధ్యానానికి మనస్సు అనుకూలంగా ఉంటాయో, ఉండవో చెప్పలేను, అప్పుడే స్మరిస్తానులే అని ఇప్పుడు మానలేను. ఎందుకైనా మంచిది. ఈ రోజే నీ పాదపద్మాలనే పంజరంలో నా మనస్సు అనే రాజహంసను ప్రవేశపెడతాను, ఆలస్యం చేయను అనే భావాన్ని కులశేఖరులు తమ ముకుందమాలలో-
‘కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంత
మద్వైవ మే విశతు మానస రాజహంస
ప్రాణప్రయాణ సమయే కఫ వాత పిత్తై
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే’ అనే శ్లోకంలో వివరించారు.
అందుకే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియాలు బలంగా, పరిపుష్టంగా ఉన్నప్పుడే, ముసలితనం రాకముందు తనకు, ఇతరులకు శ్రేయస్సును కలిగించే పనులను చేయాలని మన పెద్దలు చెబుతుంటారు. తరువాత చేద్దాం, తొందరేముంది అని వాయిదా వేయవద్దు, సత్కార్య నిర్వహణకై తొందరపడాలి. సత్కార్యసాధనకై ఎక్కువగా ప్రయత్నించాలి.
ఒకపక్క ఇల్లు తగలబడిపోతుంటే ఇంటిని చల్లార్చడానికి కావలసిన నీటికోసం బావిని తవ్వాలనుకోవడం ఎంతటి దోషమో, యుద్ధం ప్రారంభమయ్యాక యుద్ధంలో గెలవాలనుకునే వాడు శస్త్రాస్త్రాలు ప్రయోగించే విధానాన్ని యుద్ధసమయంలో నేర్చుకోవాలనుకోవడం ఎంత తప్పో, వెంటనే చేయాల్సిన పనులను ఆలస్యం చేయడం కూడా అంతే తప్పని మనకు మహాభారత శ్లోకం ఉద్బోధిస్తోంది.
పనులను వాయిదావేసే పద్ధతిని మానుకుని, వీలున్నంత త్వరగా సక్రమమైన రీతిలో విశేష ప్రయత్నం చేస్తే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, న్యాయస్థానాలు విశేష గౌరవాన్ని పొందుతాయి. వ్యక్తులు కూడా తమ పనిని వెంటనే చేపట్టి సక్రమంగా సత్వరంగా పూర్తి చేస్తే అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఆలస్యాన్ని నిర్మూలిస్తేనే వ్యక్తి శ్రేయస్సు సాధ్యపడుతుంది. సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి ఆలస్యాన్ని నివారించడంపై కూడా ఆధారపడి ఉంటాయి.
- సముద్రాల శఠగోపాచార్య