ఎంఎస్సీ మాథ్స్ చేసి ఆన్‌లైన్‌లో లెక్కలు చెప్పే భోపాల్ యువతికి పెళ్లి కావడం లేదు. కట్నం ఇవ్వను అనడమే కారణం. ‘50 లక్షలు అడుగుతున్నారు మా నాన్న ఎక్కడ నుంచి తెస్తాడు’ అని ఆమె ప్రశ్న. ‘సంబంధం కేన్సిల్’ అనేది తరచూ వినవస్తున్న జవాబు. ఇప్పటికి 12 పెళ్లి చూపులు భగ్నమయ్యాయి. విసిగిపోయిన ఆమె పోరాటానికి దిగింది. పోలీసులకు కంప్లయింట్ చేసింది. అన్ని చోట్లా చైతన్యానికి నడుం బిగించింది.
‘ఇది రొటీన్‌గా జరుగుతోంది. ఎప్పట్లాగే నేను ట్రేలో టీకప్పులు పెట్టుకుని వస్తాను. దానికి ముందు మా అమ్మ నాకు బాగుంటుందని చెప్పి ఆకుపచ్చ డ్రస్సు తీస్తుంది. నా పళ్లు కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటాయని ఎక్కువగా నవ్వొద్దని హెచ్చరిస్తుంది. టీ ట్రేతో నేను హాల్లోకి రాగానే అందరూ నన్ను ఆపాదమస్తకం శల్యపరీక్ష చేస్తున్నట్టుగా చూస్తారు. ఏం చదివావు, ఏం పని చేస్తున్నావు, వంటొచ్చా... అవే ప్రశ్నలు.
ఆ తర్వాత కీలకమైన సందర్భం వస్తుంది. కట్నం ఎంత ఆశిస్తున్నారు అని మా నాన్న అడుగుతాడు. అప్పుడు పెళ్లికొడుకు తరుఫువారు ఏ యాభైలక్షలో అరవైలక్షలో లేకుంటే పెళ్ళిళ్లు జరుగుతున్నాయా అనంటారు. కొంచెం ఆలోచించండి అని మా నాన్న అంటాడు. మీ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వొచ్చులేండి అని వారు జోక్ చేస్తారు. నాకు మాత్రం ఇదంతా చాలా అసహ్యంగా ఉంటుంది’ అంటుంది రూప.
ఇది ఆమె అసలు పేరు కాదు. ఇలాంటి అమ్మాయిలు దేశమంతా ఉన్నారు. వారికి వేరే వేరే పేర్లు ఉంటాయి. కాని వారందరి సమస్య మాత్రం ఒకటే– కట్నం. నేషనల్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం మన దేశంలో 2017 నుంచి 2022 వరకు 35,493 మంది నవ వధువులు, కొత్త పెళ్లి కూతుళ్లు వరకట్న చావులకు గురయ్యారు. అంటే రోజుకు సగటున 20 మంది. అయినా కట్నం కొనసాగుతూనే ఉంది.
పేరు మారిందంతే
మన దేశంలో వరకట్నం 1961లో నిషేధించారు. కాని అలాంటి చట్టం ఒకటుందని సమాజం ఆనాడు పట్టించుకోలేదు.. ఈనాడూ పట్టించుకోవడం లేదు. 1980ల కాలంలో వరకట్న పిశాచం దేశాన్ని పీడించింది. ఎందరో కొత్తకోడళ్లు కిరోసిన్ స్టవ్ మంటల్లో కాలిపోయారు. ఆ తర్వాత కొంత చైతన్యం వచ్చింది. అమ్మాయిలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.
కొన్నివర్గాల ఆర్థిక స్థితి మెరుగయ్యింది. కట్నం అనే మాట వాడటం నామోషీగా మారింది. దానికి బదులుగా లాంఛనాలు అంటున్నారు. ఫార్మాలిటీస్ అంటున్నారు. ఏ మాట వాడినా ఉద్దేశం మాత్రం ఆడపిల్ల తరఫువారు మగపెళ్లి తరఫు వారికి ఆర్థికంగానో ఆస్తిపాస్తుల రూపేణానో ముట్టజెప్పాలి. అంతస్తును బట్టి ఈ లాంఛనాల స్థాయి ఉంటుంది. లక్షల నుంచి కోట్ల వరకు.
కట్నం ఇవ్వను
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, భోపాల్‌లో తన కాళ్ల మీద తాను నిలబడే స్థితిలో ఉన్న రూపకు 27 ఏళ్లు వచ్చేశాయి. ఈమె తల్లిదండ్రులు ఐదారేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నారు. కాని కట్నం కారణంగా కుదరడం లేదు. ‘మా నాన్న నూటాయాభై మంది కుర్రాళ్ల ప్రొఫైల్స్ చూసి 20 మందిని సెలక్ట్ చేశాడు. వారిలో 12 మందితో పెళ్లిచూపులు అయ్యాయి. అందరూ కట్నం అడిగేవాళ్లే. ఎవరూ 50 లక్షలకు తక్కువ లేరు.
మా నాన్న అంత ఖర్చు పెట్టలేడు. అసలు కట్నం ఎందుకివ్వాలి? నేను కట్నం ఇవ్వను... కట్నం అనేది చాలా చెడ్డ ఆచారం. పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాను అని ఏ అబ్బాయికి చెప్పినా నా ముందు తలాడిస్తున్నాడు కాని ఆ తర్వాత సంబంధం కేన్సిల్ అనే కబురు వస్తోంది. నా ఆత్మవిశ్వాసం మొత్తం పోయింది. మరోవైపు మా బంధువులేమో అమ్మాయి ఇప్పటికే ముదిరిపోయింది అని టెన్షన్ పెడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. ఒంటరిగా జీవితాన్ని లాగలేము కదా. కాని ఈ కట్నం బాధ ఏమిటి? ఎంతమంది అప్పులు చేసి, ఆస్తులు అమ్మి ఇంకా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలి?’ అని ప్రశ్నిస్తోంది రూప.
పోలీసులు పూనుకోవాలి
కట్నం తీసుకోవడం శిక్షార్హం కాబట్టి పోలీసులు పూనుకొని ఈ దురాచారాన్ని నిలువరించాలని, ప్రతి పెళ్లి జరిగే మంటపాల్లో చెకింగులు చేయాలని, కట్నం తీసుకుంటున్న కొంతమందికైనా శిక్ష పడితే కట్నం డిమాండ్ తగ్గుతుందని అంటుంది రూప. ఈమేరకు ఆమె భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్‌ను వినతిపత్రం ఇచ్చింది. వరకట్న దురాచారం వల్ల వస్తున్న ఆర్థిక బాధల గురించి చైతన్యం రావాలని మీడియాను సంప్రదించింది రూప.
‘నేను కట్నం వద్దంటున్నానని మా అమ్మ నాతో మాట్లాడటం లేదు. కట్నం వద్దంటే జన్మలో నీ పెళ్లి చేయలేనని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. నేటి కాలంలో కట్నం ఉంటే తప్ప పెళ్లి కాని స్థితిలో ఒక యువతి ఉండటం ఎంత విషాదమో ఈ సమాజం ఆలోచించాలి’ అంటోంది రూప. ఈ స్థితికి తాము ఎంత కారణమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ పరిస్థితిలో మార్పుకోసం ప్రయత్నించాలి.
Comments
Please login to add a commentAdd a comment