ఒక్కోసారి కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం ఇప్పటివరకు సినిమాల్లో, నిజజీవితంలోనూ చూశాం. కొన్ని ప్రత్యేకమైన కారణాలు, అనుకోని ట్విస్ట్‌ల కారణంగా ఇలా జరుగుతుంటాయి. అయితే ఓ పెంపుడు కుక్క వల్ల పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న ఆ వరుడు కుక్క చేసిన పనికి తల పట్టుకున్నాడు. ఇంతకీ ఆ పెంపుడు కుక్క ఏం చేసింది? పెళ్లి ఆగిపోయిందా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకం. ఈ వేడుకను కలకాలం గుర్తించుకునేలా వధూవరులు ప్లాన్ చేసుకుంటారు. ఇక ఇప్పుడైతే చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అమెరికాలోని ఓ జంట కూడా తమ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకుంది.
అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పనుల్లో ఉండగానే వారి పెంపుడు కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే వ్యక్తికి మాగ్దా మజ్రీస్ అనే యువతితో పెళ్లి కుదరింది. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తో పాటూ పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులు కూడా పాస్‌పోర్టులు, వీసాలు, టికెట్లు సహా అన్ని సిద్ధం చేసుకున్నారు.
కొన్ని పెళ్లి పనులు మిగిలి ఉండగా వరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తీరా వచ్చి చూసేసరికి డొనాటో పెంపుడు కుక్క అతడి పాస్‌పోర్ట్‌ను నమిలేసింది. మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక స్థానిక అధికారుల దగ్గరికి పరుగులు పెట్టాడు. ఆగస్టు 31న ఇటలీలో తన పెళ్లి జరగనుందని, ఇలాంటి సమయంలో తన కుక్క చేసిన పనికి ఏం చేయాలో తెలియడం లేదని, ప్రత్యామ్నాయం చూపించాల్సిందిగా అభ్యర్థించాడు.
లేదంటే తాను లేకుండానే తనకు కాబోయే భార్యతో పాటు కుటుంబం, బంధువులు అందరూ ఇటలీకి వెళ్లిపోతారని అధికారులకు మొర పెట్టుకున్నాడు. అయితే అదృష్టవశాత్తూ అధికారులు వెంటనే స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఆగస్టు 31న జరగాల్సిన వాళ్ల వివాహం జరుగుతుందా? అధికారులు చూపించిన ఆ ప్రత్యామ్నాయం ఏంటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment