నగరం విభిన్న సంస్కృతులకు కేంద్రం బింధువు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. శతాబ్దాల గత చరిత్ర మొదలు ప్రస్తుత తరం అధునాతన జీవనశైలిని సైతం తనలో ఇముడ్చుకుని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిగా విశేష ఆదరణ పొందిన కేక్ మిక్సింగ్ ఈవెంట్లను సైతం ఘనంగా నిర్వహిస్తోంది మన భాగ్యనగరం. ఈ నేపథ్యంలో నగరంలోని ఎయిర్‌పోర్ట్ నోవోటెల్ వేదికగా ఆదివారం కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. క్రిస్మస్ ఈవెంట్లకు రెండు నెలల ముందే మిక్సింగ్ మొదలైంది..
ఆ వివరాలు తెలుసుకుందాం..
క్రిస్మస్‌కి దాదాపు 2 నెలల ముందు కేక్ మిక్సింగ్ నిర్వహిస్తారు. కేక్ మిక్సింగ్ దాదాపు 25 రకాల డ్రైఫ్రూట్స్, రమ్, బ్రాందీ, వైన్ వంటి లిక్కర్లతో కలిపిన మిశ్రమాన్ని 2 నెలల పాటు సోక్ (పులియబెడతారు–ఫర్మంటేషన్) చేస్తారు. 60 రోజుల తరువాత ఈ మిశ్రమంతో ప్లమ్‌కేక్ తయారు చేస్తారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ కేక్ చాలా స్పెషల్. క్రిస్మస్‌కు కొద్ది రోజుల ముందు కేక్ మిక్సింగ్ చేసి తయారు చేసే కేక్‌లలో రుచి, నాణ్యత ఉండదని నోవోటెల్ చెఫ్ అమన్న రాజు తెలిపారు. కనీసం 2 నెలలు లిక్కర్‌లో మాగిన డ్రైఫ్రూట్స్‌కు మంచి ఫ్లేవర్ అద్దుతుంది. గ్రేప్ స్టాంపింగ్ (కాళ్లతో ద్రాక్షలను తొక్కుతూ వైన్ తయారు చేయడం) కూడా ఇక్కడ ప్రత్యేకం. ఇది ఫ్రాన్స్‌కు చెందిన పురాతన పద్దతి, సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.
13 ఏళ్ల నుంచి..
నోవోటెల్ ఆధ్వర్యంలో 2011 నుంచి కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇలా ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి, రెండు వారాల్లో 2 వేల నుంచి 2,500 కేకుల వరకూ చేస్తాం. ఒక కిలో కేక్‌లో ఈ మిశ్రమాన్ని 30 శాతం మాత్రమే వినియోగిస్తాం, మిగతాది క్యారమిల్, ఎగ్, ఫ్లోర్ తదితరాలను వినియోగిస్తాం. వైన్ తయారీ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రేప్ స్టాంపింగ్‌లో విదేశీయులు సైతం పాల్గొని సందడి చేశారు.
– సుఖ్‌బీర్ సింగ్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్
వహ్.. భారత్..
నగరం వేదికగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రతి యేటా పాల్గొంటాను. హైదరాబాద్, భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం. రష్యా నుంచి నగరానికి వచ్చే పర్యాటకులు చారి్మనార్, బిర్లా మందిర్‌ను తప్పకుండా సందర్శిస్తారు. నాకు ఇష్టమైన వేడుకల్లో ఈ కేక్ మిక్సింగ్ ముఖ్యమైనది. ఐదేళ్లుగా ఈ వేడుకలకు హాజరవుతున్నా.
నా పిల్లలకు కూడా ఇక్కడి సంస్కృతిపై మక్కువ.
– ఎలీనా, రష్యా
Comments
Please login to add a commentAdd a comment