సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులంతా మరింత కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. ఆదివారం నోవాటెల్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ఇతర నేతలు తనను కలుసుకున్న సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, మరింత విస్తృతంగా పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని నడ్డా చెప్పారు. పాదయాత్ర, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ నియంతృత్వ, కుటుంబ పాలనను ఎండగట్టాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా హనుమకొండలో బీజేపీ బహిరంగసభను విజయవంతం చేయడంపై పార్టీ నాయకులను అభినందించారు. మరోవైపు హనుమకొండ సభలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ఆదివారం ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి సంస్థాగత అంశాలు, ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టి సారిస్తానని రాష్ట్ర నేతలకు ఆయన తెలిపారు.
మల్కాజిగిరిలో పాదయాత్ర–4
బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర–4 వచ్చేనెల 12 నుంచి 10, 15 రోజుల పాటు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొనసాగనుంది. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజక వర్గంలో రోజు, రోజున్నర పాదయాత్ర చేసేలా కార్యక్రమా న్ని ఖరారు చేస్తున్నారు. ముగింపు సభను అబ్దుల్లాపూర్ మెట్‌లో నిర్వహించనున్నారు. ఈ బహిరంగసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా హాజరయ్యే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment