కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు అనుకోకుండా ప్రమాదవశాత్తు నేరం చేసినందుకు ఏళ్ల కొద్ది జైల్లో మగ్గి శిక్ష అనుభవిస్తుంటారు. మరికొందరూ అత్యంత కిరాతకంగా హత్య చేసి కూడా చిన్న లాజిక్‌తో చాలా సునాయాసంగా బయటపడతారు. అయితే ఆ వ్యక్తులు చేసిన నేరం చూస్తే క్షమించేలా ఉండదు. కానీ వాళ్లకు శిక్ష ఎందుకు పడలేదనే ప్రశ్న మిగిలుంటుంది. అదృష్టమా లేక తలరాత అనుకోవాలో కూడా తెలియదు. అలాంటి షాకింగ్ ఘటనే అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాలో బ్రైన్ స్పెజ్చెర్ 32 ఏళ్ల మహిళ తాను ఎంతగానో ప్రేమించిన 26 ఏళ్ల చాడ్ ఓ మెలియాను దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. విచారణలో ఏకంగా వందసార్లు పైగా కత్తితో అతికిరాతకంగా పొడిచినట్లు వెల్లడైంది. పైగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ కూడా ఆమె చేతితో కత్తినే పట్టుకునే ఉంది, ఓమెలియా రక్తపు మడుగులో ఉన్నాడు, అదీగాక పోలీసులు ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆమె ఆ కత్తిలో తన గొంతుపై గాయం చేసుకునే యత్నం కూడా చేసింది. స్పెజ్చెర్‌నే చంపిందనేందుకు పూర్తిసాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆమెకు శిక్షపడలేదు.
పైగా జడ్జీ ఆమెకు కొద్దిపాటి జైలు శిక్ష విధించి వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ స్పెజ్చెర్ పూర్తి స్ప్రుహలో ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోవడమే ఆమెను జైలు పాలు కాకుండా చేసింది. నిజానికి ఈ ఘటనకు కొద్దిరోజులు ముందు ఇద్దరు కలుసుకుంటూ హాయిగా ఉన్నారు. సరిగ్గా 2018లో థౌజండ్ ఓక్స్‌లోని ఓ మెలియా అపార్ట్‌మెంట్‌లో ఇరువురు కలిసి గంజాయి తాగారు. అయితే స్పెజ్చెర్ ఫస్ట్ షాట్ గంజాయి తీసుకున్నప్పుడు అంతగా మత్తులో లేదు. అయితే ఆమెను మరింత గంజాయి తీసుకోవాల్సిందిగా ఓమెలియా ఒత్తిడి చేయడంతో మరో షాట్ తీసుకుంది. దీంతో ఇరువురు పూర్తిగా మత్తులో జోగుతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు.
అధికంగా గంజాయి తీసుకోవడంతో స్పెజ్జెర్ సైకోటిక్‌గా మారిపోయింది. తాను ఏం చేసిందో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్లిపోయింది. తాను ఎంతో ఇష్టపడ్డ వ్యక్తే అతి కిరాతకంగా 100 సార్లు పొడిచి మరీ హతమార్చింది. ఆ రోజు ఆమె పోలీసులు వచ్చిన తర్వాత కూడా మాములు స్థితికి రాకపోగా అదే ఉన్మాదస్థితితో తనను తాను హతమార్చుకునేంత దారుణ స్థితికి వచ్చేసింది. సమయానికి పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి స్పెజ్చెర్ ప్రాణాతో బతికిబట్టగట్టగలిగింది. అయితే పోలీసులు ఓ మెలియా ఆ ఘటనలో అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు. అయితే కోర్టులో స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది ఆమె స్ప్రుహలో ఉండి చేసిన నేరం కాదని గట్టిగా వాదించారు. పైగా అతడే ఆమెను గంజాయి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని అన్నారు.
తన క్లయింట్ నాటి ఘటనలో ఏం జరగుతుంది, తానేం చేస్తుంది అనేది కూడా తెలియని దారుణ స్థితిలో ఉందని అన్నారు. వాస్తవానికి ఆమె కావాలని చేసిన హత్య మాత్రం కాదని కూడా అన్నారు. దీంతో న్యాయమూర్తి ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం కాదు. పైగా ఇరువురు ఇష్టపూర్వకంగా గంజాయి సేవించి ఉండటంతో జరిగిన ఘటనే అని ఈ కేసుని కొట్టిపడేసింది కోర్టు. అంతేగాదు తెలియని స్థితిలో చేసిన నేరానికిగానూ ఆమెకు రెండేళ్ల ప్రోబేషన్ శిక్ష తోపాటు వంద గంట సామజికి సేవ కూడా చేయాలని ఆదేశించింది.
అయితే ఈ తీర్పు పట్ల బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ గంజాయి తాగిన ప్రతి ఒక్కరూ మరో వ్యక్తి చంపేయొచ్చు అనేలా ఉంది ఈ తీర్పు అని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక స్పెజ్చెర్ న్యాయవాది మాత్రం జడ్డి ఓర్లీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మరీ ఈ విధంగా తీర్చు ఇచ్చారని ప్రశంసించాడు. ఈ తీర్పు పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నాని అన్నారు. ఆయన దీన్ని మత్తులో జరిగిన అనుకోని ఘోరమే తప్ప తన క్లయింటే స్వతహాగా మంచిదే అని వెనుకేసుకొచ్చాడు స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది. ఏదీమైన మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు తమకే గాక తామెంత ఇష్టపడ్డ వాళ్లను కూడా దూరం చేసుకునేలా చేస్తుంది. సరిదిద్దుకోలేని తప్పులను చేయిస్తుంది. ఇలాంటి ఉందంతాలు కోకొల్లలు కూడా. అందువల్ల దయచేసి ఇలాంటి వ్యసనాలకు బానిసలై ఉన్మాదులుగా మారి మిమ్మల్ని మీరు కోల్పోయి, మీ వాళ్లను దూరం చేసుకోకండి.
Comments
Please login to add a commentAdd a comment