Young Woman Choked Her Fiance Throat in Anakapalle District - Sakshi
Sakshi News home page

సర్‌ప్రైజ్‌ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి..

Published Mon, Apr 18 2022 8:10 PM | Last Updated on Tue, Apr 19 2022 11:46 AM

Young Woman Stabbed Young Boy Throat in Anakapalle - Sakshi

బుచ్చెయ్యపేట/రావికమతం(అనకాపల్లి జిల్లా): నెల రోజుల్లో ఇద్దరికీ వివాహం. సోమవారం షికారుకని ఇంట్లో పెద్దలకు చెప్పి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. కొత్త జంట ఆనందంగా గడుపుతారని అందరూ అనుకున్నారు. యువకుడు రక్తపు మడుగులో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడడంతో అంతా హతాశులయ్యారు. తనకు కాబోయే భార్యే కత్తితో తన గొంతు కోసిందని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ సీన్‌ సోమవారం సాయంత్రం బుచ్చెయ్యపేట మండలం అమరపురి వద్ద జరిగింది. హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న తమ కుమారుడికి ఈ గతి పట్టిందేమిటని తల్లిదండ్రులు రమణ, గంగమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.

బుచ్చెయ్యపేట ఎస్‌ఐ బి.రామకృష్ణ కథనం ప్రకారం.. మాడుగుల మండలం ఘాటీరోడ్డుకు చెందిన అద్దేపల్లి రామునాయుడుకు రావికమతానికి చెందిన వియ్యపు పుష్పతో వివాహం చేయడానికి ఇరు కుటుంబాల వారు ఆరు నెలల కిందట నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన వీరి వివాహానికి నిశి్చతార్థం చేశారు. మే 20న వివాహం చేయడానికి ముహూర్తం పెట్టారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం అమ్మాయి ఫోన్‌ చేయడంతో రామునాయుడు ఘాటీరోడ్డు నుంచి రావికమతం వెళ్లాడు. అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పి ఇద్దరూ బుచ్చెయ్యపేట మండలం కొమళ్లపూడి దగ్గర ఉన్న అమరపురి బాబా గుడి వద్దకు బైక్‌పై వెళ్లారు.

ప్రైజ్‌ ఇస్తానని.. సర్‌ప్రైజ్‌ చేస్తానని.. 
బహుమతి ఇస్తానని, కళ్లు మూసుకోమని యువతి కోరినట్టు బాధితుడు వాంగ్మూలంలో చెప్పాడు. తన చున్నీతో కళ్లకు గంతలు కట్టిందని, అంతలోనే కత్తితో గొంతుపై గాయపరచిందని ఆయన పేర్కొన్నారు. రక్తంతో రామునాయుడు షర్టు తడిచిపోవడంతో పుష్ప భయందోళన చెందింది. రక్తం కారకుండా పుష్ప చున్నీ గొంతుకు కట్టుకుని ఆమెను బైక్‌ ఎక్కించుకుని రామునాయుడు రావికమతం ఆస్పత్రికి బయలుదేరాడు. మార్గంమధ్యలో పరిస్ధితి విషమంగా ఉండటంతో బైక్‌ను రోడ్డు పక్కన ఆపి సొమ్మసిల్లిపోయాడు. అక్కడ ఉన్న యువకుడు రామునాయుడు పరిస్ధితిని చూసి రావికమతం ఆస్పత్రిలో ఇద్దరినీ విడిచి వెళ్లిపోయాడు.

వైద్యుల సలహా మేరకు పరిస్ధితి విషమంగా ఉండటంతో రామునాయుడును అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తం అవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని రామునాయుడు కుటుంబ సభ్యులకు అక్కడ వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న బుచ్చెయ్యపేట ఎస్‌ఐ అనకాపల్లి ఆస్పత్రికి వెళ్లి విషమ పరిస్ధితిలో ఉన్న రామునాయుడు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనకు కాబోయే భార్యే కత్తితో తన గొంతు కోసిందని, నీవంటే నాకు ఇష్టం లేదని చెప్పిందని రామునాయుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. సోమవారం వీరు ఎక్కడెక్కడికి తిరిగారు.. గొంతు కోసిన తరవాత వీళ్లని ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడెవరు.. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులేమంటున్నారు.. తదితర విషయాలపై బుచ్చెయ్యపేట ఎస్‌ఐ విచారణ చేస్తున్నారు. రామునాయుడు పరిస్థితి కాస్త మెరుగైందని, ప్రాణాపాయం లేదని అనకాపల్లి ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.   

చదవండి: (ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే చావే గతని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement